Seed Purification సుగంధ ద్రవ్యాల పంటల్లో పసుపు ఒకటి. మనదేశంలో పసుపును ప్రధానమైన పంటగా సాగుచేస్తున్నారు. ముఖ్యంగా ఏపి, తెలంగాణాల్లో చాలా మంది రైతులు పసుపు పంటను సాగు చేస్తున్నారు.
పసుపును ఆహారపదార్ధాలతోపాటు, సుగంధ ద్రవ్యాలు,ఔషదాల తయారీలో వినియోగిస్తున్నారు. మార్కెట్లో పసుపుకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు పసుపు సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. పసుపు సాగు చేయాలనుకునే రైతులు పంట బాగా ఉండాలంటే ముందుగా విత్తన శుద్ధిలో జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించటం వల్ల పంట దిగుబడిని చీడపీడల నుండి కాపాడుకోవచ్చు.
విత్తన శుద్ది
ఒక ఎకరానికి తల్లి దుంపలు అయితే 100 కిలోలు అవసరం అవుతాయి. ఒక ఎకరాని పిల్ల దుంపలు అయితే 800 నుండి 1000 కిలోలు అవసరం అవుతాయి. పసుపు సాగులో విత్తన శుద్ధి పాటించకపోవడం వల్ల పంట దిగుబడి చాల వరకు తగ్గడం జరుగుతుంది. దుంప కుళ్ళు తెగులును విత్తనశుద్ధి చెయ్యడం ద్వారా చాలా వరకు నివారించవచ్చు.
పసుపు దుంపలని మాంకోజెబ్ 2 గ్రాములు లేదా కార్చండాజిమ్ 1 గ్రాములు లేదా రిడోమిల్ 2 గ్రామూల చొప్పున ఒక లీటరు నీటికి లేదా ఏదేని ఒక లీటరు శీలింధ్రనాశని మందులో మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 1 మిల్లీలీటరు, 3 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టాలి.
అనంతరం నీడలో ఆరబెట్టాలి. ఆరిన వెంటనే ఆ దుంపలను విత్తుకోవాలి. శీలింద్రాలు మరియు పురుగుల బారి నుండి విత్తన శుద్ది చేయడం వల్ల రక్షణ కల్పించవచ్చు. రెండుసార్లు విత్తన శుద్ధిని చేసుకోవచ్చు. మొదటిసారి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత వాటిని ఆరబెట్టి నీడ ప్రదేశంలో కుప్పలాగా పోసి నిలువ వుంచుకోవాలి అలాగే రెండవ సారి విత్తన శుద్ధి, నాటటానికి ముందుగా చేసుకోవాలి.
విత్తన శుద్ధి చేసేటపుడు మొలక విరగకుండా జాగ్రత్త వహించాలి. విత్తనం ద్వారా సంక్రమించే దుంప, వేరుకుళ్ళు, తాటాకు తెగులు, ఆకుమచ్చ తెగుళ్ళకు కారణమైన శిలీంధ్రాలు విత్తన శుద్ది చేయటం వలన నాశనమవుతాయి. విత్తన శుద్ది చేయడం వల్ల భూమిలోని హానికర శిలీంధ్రాలు ఆశించకుండా విత్తనాన్ని కొంతకాలం వరకు కాపాడుకోవచ్చు.
బోదె సాళ్లు పద్దతి, ఎత్తుమడుల పద్దతిలో విత్తనం నాటుకోవాలి. బోదె పద్దతిలో 45 సెంటీమీటర్లు ఉండే బోదెలను తయారు చేసుకుని బొదెల మీద 20 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. ఎత్తుమడుల పద్దతిలో బెడ్లు తయారు చేసుకోవాలి. బెడ్ పొడవును అవసరం మేరకు పెట్టుకోవాలి. బెడ్ వెడల్పు 90 సెంటీమీటర్లు ఉండాలి. బెడ్ ఎత్తు 20 నుండి 30 సెంటీమీటర్లు ఉండాలి.