ఉలవలు సాగు : మన రాష్ట్రంలో ఖరీఫ్ మొదటి పంట తరువాత వర్షాధారంగా లేదా ఏ పనులు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయవచ్చు. ఖరీఫ్ లో వేరుశనగ, నువ్వులు, గోగు, మెట్టవరి తరువాత ఏక పంట గాను వేయవచ్చు. రాగి, జొన్న పంటల్లో సహ పంటగాను వేయవచ్చు.
పంటకాలం : సెప్టెంబర్ – అక్టోబర్
నేలలు : నల్లరేగడి నేలలు అనుకూలం. మురుగు నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు.
రకాలు :
రకం | పంటకాలం (రోజుల్లో) | దిగుబడి (క్వి /ఎ) | లక్షణాలు |
పి .డి .యం | 105 | 6 – 6.5 | గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయి |
వి .జడ్ .యం 1 | 90-95 | 6-6.5 | గింజలు నలుపు రంగులో ఉంటాయి |
పి.హెచ్ .జి . 62 | 85 | 6-6.5 | గింజలు నలుపు రంగులో ఉంటాయి |
పి.హెచ్ .జి 9 | 90-100 | 6 | గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయి .పల్లాకు తెగులును తట్టుకుంటుంది |
Also Read : ప్రపంచ నూనెగింజల విస్తీర్ణం 20 % భారత్ లోనే
విత్తనశుద్ధి : కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండిజమ్ మందు చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి.
నేల తయారీ : ఖరీఫ్ లో మొదటి పంటకోసిన తరువాత తగినంత తేమ చూసుకోని, భూమిని నాగలితో ఒకసారి, గొర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని తరువాత చేసుకోవాలి.
విత్తనం , విత్తేదూరం : గొర్రుతో వరుసలతో విత్తే పద్ధతిలో ఎకరాకు 8 – 10 కిలోలు, వెదజల్లే పద్ధతిలో 12 – 15 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 30 సెంటీ.మీటర్ల , మొక్కల మధ్య 10 సెంటి.మీటర్ల దూరం పాటించాలి.
ఎరువులు : ఎకరాకు 4 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో విత్తే ముందు వేసుకోవాలి.
అంతరకృషి : విత్తిన 25 – 30 రోజుల మధ్య నెలలో తగినంత తేమ ఉన్నప్పుడు, గొర్రు వేసి కలుపు నివారణ చేసుకోవాలి.
సస్య రక్షణ : కాయతొలుచు పురుగు :పూత మరియు పిందె ఏర్పడే సమయంతో పంటకు నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేయాలి.
బూడిద తెగులు :వాతావరణంలో అధిక తేమ ఉండి, రాత్రి, పగటి ఉష్ణోగ్రతలలో ఎక్కువగా వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజమ్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. తెగులు ఉదృతంగా ఉన్న ఎడల 15 రోజుల వ్యవధిలో రెండో సారి కూడా పిచికారి చేసుకోవాలి.
పి.సౌజన్య , ఎస్ . రమేష్ బాబు, డాక్టర్. కె తేజేశ్వరరావు మరియు డాక్టర్ జి. రామారావు కృషి విజ్ఞాన కేంద్రం ,కుటుంబ విజయనగరం జిల్లా
Also Read : కందిలో తెగుళ్ళు – యాజమాన్యం