Pearl Millet Management: మన రాష్టంలో ప్రస్తుతం మన మెట్ట ప్రాంత రైతులు వర్షపాతంలో అసాధారణ తేడాలతోపాటు, అనావృష్టి, వేడిగాలులు, భూసారం మరియు నీటి వనరులు తగ్గిపోవటం, పర్యావరణ అసమతుల్యత వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అందువలన మన రాష్టంలోని మెట్టప్రాంత రైతాంగ ఉత్పత్తి ఖర్చుని తగ్గించుకుని, స్థిరమైన మరియు నాణ్యమైన పంటలు మెట్ట ప్రాంత సాగుకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకొని సాగును చేపట్టవలసిన అవసరం ఎంతైనా వుంది.
సజ్జ పంట మెట్ట ప్రాంత సాగుకు అనుకూలమైన చిరుధాన్యపు మరియు పసుగ్రాసపు పంట. సజ్జ పంట అన్ని ఆహార పంటలలోకి ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకొని, అతి తక్కువ పెట్టుబడితో సాగు చేసుకోగల పంట. భారతదేశంలో సజ్జ పంటను సాగు చేసే ముఖ్యమైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సజ్జ పంట వర్షాధార ప్రాంతాలలో, ఉష్ణ ప్రదేశాలలో భూసారం తక్కువగా ఉన్న భూముల్లో మరియు నీటి నిల్వ శక్తిని తక్కువగా కలిగి ఉన్న భూముల్లో కూడా సాగు చేయటానికి అనుకూలమైన పంట. అంతేకాక ముఖ్యమైన ధాన్యపు మరియు తృణ ధాన్యపు పంటలైన వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటలను పండిచడానికి అనువులేని భూముల్లో కూడా పండిరచటానికి వీలైన, అత్యధిక పోషక విలువలను కలిగి ఉండి, అత్యధిక శక్తిని ఇవ్వగల ఆహార ధాన్యపు పంట.
నేలలు : తేలిక నుండి మధ్యరకం నేలలు, నీరు ఇంకే మురుగు నీటి పారుదల గల నేలలు సజ్జ సాగుకి అనుకూలమైనవి. మురుగు నీరు నిల్వ వుండే భూములు సజ్జ సాగుకి పనికిరావు. సజ్జ మొక్కకి భూమిలో ఉన్న క్షార గుణాలను కూడా తట్టుకొనే శక్తి స్వతహాగా కలిగి ఉండటం మూలాన అన్ని భూముల్లో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. భూమిలో ఇతర పంటల అవశేషాలను తప్పనిసరిగా తొలంగించాలి, లేని యెడల భూమి నుండి వ్యాపించే శిలీంధ్రాల వలన పంటకు నష్టం జరగొచ్చు. అందువలన వేసవిలో లోతుదుక్కులు దున్నుకోవాలి. ఇలా చేయటం వలన భూమిలో ఉన్న చీడపీడలు, కలుపు మొక్క విత్తనాలు బయటపడి ఎండ వేడికి చనిపోయి వాటి ఉధృతిని తగ్గించ్చుకోవచ్చు. విత్తే సమయం ముందుగానే నేలను 2-3 సార్లు మెత్తగా దుక్కిచేసి చదును చేసుకొని విత్తటానికి సిద్ధంగా ఉంచుకోవాలి.

Pearl Millet Management
విత్తే సమయం : సజ్జ పంట సాగుకు ఖరీఫ్ అంటే వర్షాకాలపు పంటగా జూన్, జూలై మాసాల్లో, రబీ కాలం పంటగా అక్టోబర్, నవంబర్‌లో, వేసవి పంటగా అయితే జనవరిలో విత్తుకోవాలి.
విత్తన నాణ్యత : సూటి రకాలైతే మంచి నాణ్యత గల సొంత విత్తనం ఎన్నుకోవాలి. హైబ్రీడ్ /సూటి రకాలను బయట నుండి తెచ్చుకోనుటకు నమ్మకమైన సంస్థల నుంచి ధృవీకరించిన విత్తనం వాడుకోవటం శ్రేయస్కరం. విత్తుటకు వారం రోజుల ముందు మొలక శాతం పరీక్షించి 90 శాతం పైన ఉన్న విత్తనాన్నే విత్తనంగా వాడుకోవాలి. మొలక శాతం తక్కువగా ఉంటే, మొలక శాతాన్ని బట్టి విత్తన మోతాదును నిర్ణయించుకోవాలి.
విత్తన మోతాదు : ఒక హెక్టారుకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. అంటే ఎకరాకు 1.6 కిలోలు విత్తనం సరిపోతుంది.
విత్తన శుద్ధి : 2% (20 గ్రా/లీ నీటికి) ఉవ్పు ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాలు వుంచడం ద్వారా ఎర్గాట్ శిలీంద్ర అవశేసాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చు. ఆరిన కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్‌ను లేదా అప్రాన్ 35 ఎస్.డి. మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
Also Read:Summer Crops: వివిధ వేసవి పంటలలో విత్తన ఎంపిక – అనంతర చర్యలు.!
విత్తే దూరం : వరుసల(చాళ్ళ) మధ్య 45 నుంచి 50 సెం. మీ., మొక్కల మద్య 12 నుంచి 15 సెం.మీ.ల దూరం ఉండేటట్లు గోర్రుతో విత్తుకోవాలి. లేదా నారుపోసి 15 రోజుల వయసు గల నారు మొక్కలను పైన తెలిపిన దూరంలో నాటవచ్చు. ఒక ఎకరాకు 58 వేల నుండి 78 వేల మొక్కల వరకు ఉండేటట్లు చూసుకోవాలి.
ఎరువులు : ఎకరాకు 2-3 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. సేంద్రీయ ఎరువులు వేయటం వలన భూభౌతిక పరిస్ధితులు మెరుగుపడటమే కాకుండా నీటిని నిల్వ ఉంచే గుణం అభివృద్ధి చెందుతుంది. తగినంత సేంద్రీయ పదార్ధం నిల్వ ఉండటమే కాకుండా కుళ్ళిన తరువాత పోషక పదార్ధాలను పంటకు అందిస్తాయి. ఎకరాకు నీటి పారుదల పంటకు 75 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. మొత్తం యురియాను రెండు భాగాలుగా చేసి విత్తేటప్పుడు సగం, విత్తిన 25-30 రోజులకు పంట మోకాలి ఎత్తు దశలో ఉన్నప్పుడు నేలలో తగిన తేమ చూసి మరో సగం వేయాలి. అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు మొత్తం మోతాదును దుక్కిలోనే వేసేయాలి.

Pearl Millets Farmer
కలుపు నివారణ అంతరకృషి : పంటవేసిన 30 రోజుల వరకు పొలంలో ఏ విధమైన కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. విత్తిన వెంటనే లేదా 2 రోజుల లోపల అట్రాజిన్ 50% పొడి మందును ఎకరాకు 600 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. విత్తిన రెండు వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. 25-30 రోజులపుడు గుంటక లేదా దంతితో అంతర కృషి చేయాలి.
నీటి యాజమాన్యం : నేల పరిస్థితిని బట్టి సజ్జ పంటకు నీరు పెట్టాలి. అంకుర దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ మరియు గింజ గట్టిపడే దశలో నేలలో తగిన తేమ ఉండటం చాలా అవసరం. మొక్కలకు 30 రోజుల వయసులో ఎకరాకు 2 టన్నుల వేరుశనగ పొట్టు నేల మేధపరచటం ద్వారా భుమిలో తేమను ఆవిరి కాకుండా కాపాడవచ్చు. నీటి ముంపు ఈ పంటకు పనికిరాదు మరియు హానికరం కాబట్టి అటువంటి భూములలో తగు మురుగు నీటి పారుదలను ఏర్పాటు చేయవలయును. నీటి ఎద్దడిని తట్టుకొనేందుకు పొలంలో చిన్న,చిన్న గుంటలు చేసి వర్షపు నీటిని నిల్వ ఉంచుకొని నీటిని పూత మరియు గింజ గట్టి పడే దశలలో పంటకు ఇవ్వవచ్చు.

Sajja crop (pearl millet)
పంట కోత, పంట నిల్వ చేయటం : పంట కోతకు వచ్చినపుడు కంకులలోని సజ్జ గింజ క్రింద భాగమును గమనించినట్లయితే ఒక చిన్న చుక్క కనిపిస్తుంది. మొక్కలలోని అధిక భాగం ఆకులు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే ఫిజియోలజికల్ మేచ్యురిటి (%ూష్ట్రవంఱశీశ్రీశీస్త్రఱషaశ్
అంతర పంట : రెండు వరుసల సజ్జ పంటకు ఒక వరుస కంది లేదా ఉలవ పంటలను (2:1 నిష్పత్తిలో), ఒక వరుస సజ్జ పంటకు ఒక వరుస ఆముదం పంటలను (1:1 నిష్పత్తిలో) అంతర పంటగా వేసుకోవచ్చును.
Also Read: Cropping Systems: రైతులకు అధిక దిగుబడులనిచ్చే సస్య వర్ధన వ్యవస్థలు.!
-కె. అరుణ్ కుమార్, శాస్త్రవేత్త (సేద్య విభాగం), డా.ఆర్.నరసింహులు, శాస్త్రవేత్త (ప్లాంట్ బ్రీడిరగ్),
-వై. ఎస్ . సతీష్ కుమార్, శాస్త్రవేత్త (సాయిల్ సైన్సు) మరియు డా.యన్.సి. వెంకటేశ్వరులు,
పరిశోధన సహా సంచాలకులు, ఆర్.ఎ.ఆర్.స్, నంద్యాల