మన వ్యవసాయం

లాభసాటిగా పుట్టగొడుగుల పెంపకం..

0
పుట్టగొడుగులు అనేవి ఫంగస్(శిలీంధ్ర) జాతికి చెందిన చిన్న మొక్కలు. వీటిలో బాగా పోషక విలువలు వున్నందున, పోషకాలలేమితో బాధపడే వారికి మహిళలకు, పిల్లలకు చాలా మంచి ఆహారం. పుట్టగొడుగుల్లో మాంసకృత్తులు, విటమిన్లు(బి,సి) మరియు ఖనిజలవణాలు(భాస్వరం, సున్నం, పొటాషియం, విటమిన్లు, రాగి మరియు ఇనుము), పీచు పదార్ధలు అధికంగా ఉండి క్రొవ్వు పదార్ధము మరియు పిండి పదార్ధము తక్కువ మోతాదులో ఉంటాయి. ప్రతి 100 గ్రా. పుట్టగొడుగుల నుండి 43 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2000 రకాలకు పైగా పుట్టగొడుగులు ఉన్నప్పటికీ 200 రకాలు మాత్రమే తినగలిగినవిగా గుర్తించడమైనది. వాటిలో  కృత్రిమంగా 3 లేక 4 రకాలు మాత్రమే పెంచుతున్నారు.
పుట్టగొడుగులు పోషక విలువలు – ఉపయోగాలు
పుట్టగొడుగుల్లో అనేక రకాలైన పోషక పదార్ధాలు ఉన్నాయి. మాంసకృత్తులు, పిండిపదార్ధాలు కలిగి 60-70 శాతం అధిక జీర్ణశక్తిని కలిగి ఉండటం వలన వీటిని చిన్న పిల్లలకు, వృద్ధులకు పెట్టవచ్చును. మాంసకృత్తులలో పెరుగుదలకు కావలసిన లైసిన్, ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాలు ఉన్నాయి. చక్కెర, క్రొవ్వు పదార్ధాలు చాలా తక్కువ మోతాదులో ఉండటం వల్ల స్థూలకాయం కలవారు తమ బరువుని తగ్గించుకోటానికి వాడవచ్చును. విటమిన్లలో ‘సి’ మరియు ‘బి’ గ్రూప్ విటమిన్లలో నియాసిన్, పాంటోధినిక్ ఆమ్లం, ఫోలిక్ ఆమ్లం ఎక్కువ మోతాదుల్లో ఉన్నాయి. ఖనిజలవణాలు విషయానికొస్తే ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, రాగి, ఇనుము సమృద్ధిగా ఉండటం వల్ల దంతాల పటిష్టతకి మరియు కంటి చూపుకు తోడ్పడుతుంది. సాధారణంగా మనం తినే పుట్టగొడుగుల్లో 89-91 శాతం నీరు, 0.97-1.26 శాతం లవణాలు, 2.78-3.94 శాతం మాంసకృత్తులు, 0.25-0.65 శాతం క్రొవ్వు పదార్ధాలు, 0.09-1.67 శాతం పీచు పదార్ధాలు, 5.3-6.28 శాతం పిండి పదార్ధాలు మరియు ప్రతి వంద గ్రాముల తాజా పుట్టగొడుగుల నుండి 43 కిలో కెలరీల శక్తిని అందిస్తాయి.
పుట్టగొడుగులు పెంచుట వలన లాభాలు
తక్కువ వ్యవధిలో (35-40 రోజుల్లో) పంట చేతికి వస్తుంది. ఇంత తక్కువ వ్యవధిలో ఏ పంటను పండించలేము. గృహిణులు చిన్న తరహా కుటీర పరిశ్రమగా చేపట్టవచ్చును.
వీటిని పెంచటానికి పెద్ద పెద్ద భావనాలుగానీ పెద్ద యంత్రాలుగాని, ఎక్కువ పెట్టుబడిగాని  అవసరం లేదు.
నిరుద్యోగ యువతకు పుట్టగొడుగుల పెంపకం వరదాయకం.
వ్యవసాయం వ్యర్ధ పదార్ధాలయిన గడ్డి, చొప్ప ఇతర పదార్ధాలతో కొద్దిపాటి ఖర్చుతో వీటిని పెంచవచ్చును.
పుట్టగొడుగుల ప్రాముఖ్యత విదేశాలలో విరివిగా తెలిసినా మనదేశంలో వీటి విలువలు ఇప్పుడిప్పుడే గుర్తించడం జరిగింది. దీనిని చిన్న తరహా కుటీర పరిశ్రమగా ఇంటి ఆవరణలోనే పెంచుకొని లాభాలు గడించవచ్చును.
మనదేశంలో కృత్రిమంగా సాగుకు అనువైన పుట్టగొడుగుల రకాలు
పుట్టగొడుగుల రకాలు: తెల్లగుండీ పుట్టగొడుగులు
శాస్త్రీయ నామము : అగారికాస్ బైస్ఫోరస్
ఉష్ణోగ్రత(సెం.గ్రే) : 16-18 సెం.గ్రే
తేమ శాతం : 85-90
పుట్టగొడుగుల రకాలు: అయిస్టర్/ముత్యపు చిప్ప పుట్టగొడుగులు
శాస్త్రీయ నామము :  ప్లురోటస్ ఫ్లోరిడా , ప్లురోటస్ సాజర్ కాజు, ప్లురోటస్ ఈవోస్
ఉష్ణోగ్రత(సెం.గ్రే) : 25-28 సెం.గ్రే
తేమ శాతం :75-86
పుట్టగొడుగుల రకాలు: ఎల్మ్ అయిస్టర్ పుట్టగొడుగులు
శాస్త్రీయ నామము :  హిప్సిజైగన్  అల్మీరియస్
ఉష్ణోగ్రత(సెం.గ్రే) : 25-28 సెం.గ్రే
తేమ శాతం : 75-85
పుట్టగొడుగుల రకాలు: మిల్క్/పాల పుట్టగొడుగులు
శాస్త్రీయ నామము :  కాలోసైబ్ ఇండికా
ఉష్ణోగ్రత(సెం.గ్రే) : 28-35 సెం.గ్రే
తేమ శాతం : 80-90
పుట్టగొడుగుల రకాలు: వరిగడ్డి పుట్టగొడుగులు
శాస్త్రీయ నామము :  వాల్వేరియల్లా వాల్వేసియా, వాల్వేరియల్లా సపిడిన్
ఉష్ణోగ్రత(సెం.గ్రే) : 28-35 సెం.గ్రే
తేమ శాతం : 80-90
వైట్ బటన్ పుట్టగొడుగులు (యూరోపియన్ పుట్టగొడుగులు)
వాతావరణంలో తేమని, ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి మాత్రమే సాగు చేయగల రకం. వీటిని పెంచటానికి 85-90 శాతం తేమ, 16-18 సెం.గ్రే. ఉష్ణోగ్రత అవసరం. వరి, గోధుమ గడ్డి, ఇతర రసాయన ఎరువులతో తయారైన కంపోస్ట్ లో పెంచాలి. వీటి పెంపకానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం. సబ్ స్ట్రేట్ (ఆధారం)అత్యంత నాణ్యమైనదిగా వుండాలి.
అయిస్టర్ (ముత్యపు చిప్ప) పుట్టగొడుగులు (డింగ్రీ పుట్టగొడుగులు)
ఈ పుట్టగొడుగుల పెంపకమునకు 25-32 సెం.గ్రే. ఉష్ణోగ్రత, 75-85 శాతం తేమ అవసరమై ఉన్నది. జూన్ నుండి ఫిబ్రవరి వరకు వీటి పెంపకమునకు అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటుంది. వీటి పెంపకానికి తక్కువ పెట్టుబడి, సాధారణ సాంకేతిక పరిజ్ఞానం సరిపోతుంది.
మిల్క్ (పాల) పుట్టగొడుగులు (కాలోసైబ్ ఇండికా)
ఈ పుట్టగొడుగుల పెంపకము కొద్దిపాటి చిన్న మార్పులతో అయిస్టర్ పుట్టగొడుగుల పెంపకమును పోలి ఉండును. వీటి పెంపకానికి 30-35 సెం.గ్రే ఉష్ణోగ్రత, 85-95 శాతం తేమ మరియు తగిన వెలుతురు అవసరం. మార్చి నుండి అక్టోబర్ వరకు వాతావరణం చక్కగా అనుకూలిస్తుంది. పరిస్థితులకనుగుణంగా తగుపాటి జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరమంతా పుట్టగొడుగులను పండించవచ్చును.
వరిగడ్డి ( చైనీస్) ఎండుగడ్డి పుట్టగొడుగులు
ఇవి ఉష్ణమండలపు పుట్టగొడుగులు (వాల్వేరియాల్లా వాల్వేసియా, వాక్విరియల్లా డిప్లిసియా అనే జాతులు).
ఎల్మ్ అయిస్టర్ పుట్టగొడుగులు (హిప్సిజైగన్ అల్మీరియస్)
ఈ పుట్టగొడుగుల పెంపకం విధానం ముత్యపుచిప్ప పుట్టగొడుగులను పోలి ఉంటుంది. వీటి పెంపకానికి 25-28 సెం.మీ ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం 75-85 శాతం అవసరం.
పుట్టగొడుగుల విత్తనం తయారీ 
తల్లి  కల్చరు తయారు చేయుట
స్పాన్ ( పుట్టగొడుగుల విత్తనాలు) తయారు చేయుట
పుట్టగొడుగుల పెంపకం
పుట్టగొడుగుల పెంచడానికి కావల్సిన విత్తనాలను స్పాన్ అంటారు. దీనిలో తెల్లని దారం వంటి పదార్ధం మరియు జొన్నలు సబ్ స్ట్రేట్ ఉంటాయి. విత్తనం(స్పాన్) తయారీకి స్వచ్చమైన కల్చర్ అవసరం. పరిశుభ్రమైన జొన్నలతో తయారు చేసిన కల్చర్ నుండి శుభ్రమైన జొన్నలలో ఈ కల్చర్ ని చేర్చి మైసీలీయం పూర్తిగా పెరిగిన తరువాత మైసీలియం వ్యాపించిన జొన్నలను స్పాస్ అంటారు. మనం వాడే స్పాస్ స్వచ్ఛత  మీదే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది.
ముత్యపు చిప్ప/ఎల్మ్ ముత్యపు చిప్ప పుట్టగొడుగుల సాగు చేయువిధానం 
శుభ్రమైన వరిగడ్డిని తీసుకొని 3-5 సెం.మీ వరకు ముక్కలుగా కత్తిరించి, 10 కిలోలగడ్డి ముక్కలను 100 లీటర్ల నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు నానబెట్టిన గడ్డి ముక్కలను తీసుకొని మరుగుతున్న నీటిలో 100 సెం.గ్రే ఉష్ణోగ్రత మధ్య అరగంట సేపు ఉడకబెట్టి శుద్ధిచేయాలి లేదా రసాయన పద్ధతిలో అయితే 100 లీటర్ల నీటిలో 7.5 గ్రా బావిస్టిన్ (కార్బెండామ్) మరియు 250 మి.లీ ఫార్మల్డిహైడ్ కలిపి దానిలో 10 కిలోల గడ్డిమొక్కల్ని నీటిలో మునిగే విధంగా 12-16 గంటలపాటు ఉంచి శుద్ధి చేయాలి. ఈ గడ్డిని బయటకు తీసి అరగంట సేపు చల్లని ప్రదేశంలో ఆరబెట్టాలి. స్వచ్చమైన స్పాన్ (పుట్టగొడుగుల విత్తనాన్ని) డేట్టాల్ తో శుభ్రపరిచిన ట్రేలో ఇనుపరాడ్ తో తీసికొని ఉండలు లేకుండా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత 100 గేజి మందము గల పాలీధీన్ సంచులు 12 x 18 అంగుళాలు లేదా 14 x 24 అంగుళాల సైజు కవర్లను తీసుకొని వాటికి 1 మి.మీ సైజు గల 12 నుండి 15 రంధ్రాలు చేయాలి. ప్లాస్టిక్ కవరులో శుద్ధి చేసిన మొక్కల్ని 5 సెం.మీ మందము వరకు వేసి ఉపరితలంపైన గుప్పెడు విత్తనాన్ని చల్లాలి. ఇలా చేసిన పాలీధీన్ సంచులను మూడవ వంతు వరకు నింపి రబ్బరు బ్యాండుతో మూసివేయాలి. ఒక కిలో స్పాన్ ( విత్తనానికి) 10 బ్యాగులు వస్తాయి. ప్రతి పాలీధీన్ కవరులో 100 గ్రా విత్తనాన్ని వేయాలి. ఇలా చేసిన తరువాత 10 x 12 అడుగుల గదిలో కొయ్య లేదా ఇనుపరాక్స్ ని ముందుగా ఫార్మాల్డిహైడ్ 2 శాతముతో శుద్ధి చేసిన గదిలో వరుస క్రమంలో అమర్చుకోవాలి. శుభ్రంగా, చల్లగా ఉన్న గదిలో  ఎప్పటి కప్పుడు తడిగా వుండేలా నీళ్ళు చల్లుకోవాలి. మూడు నుండి నాలుగు వారాలలో గడ్డిముక్కలపైన తెల్లని శిలీంధ్రము దట్టంగా వ్యాపిస్తుంది. ఇలా తయారైన బెడ్లను శుద్ధిచేసిన బ్లేడుతో కత్తిరించాలి. గదిలో గాలి మరియు వెలుతురు సరఫరా అయ్యేలా చూసుకోవాలి. పాలీధీన్ సంచులను బ్లేడుతో కత్తిరించాలి. ఇలా చేసిన తర్వాత  6 నుండి 7 రోజులకు మొదటి పంట వస్తుంది. బెడ్లను రోజుకి రెండు సార్లు తడిపి తేమ 65 శాతం ఉండేలా  చూసుకోవాలి. తరువాత 15 రోజుల వ్యవధిలో రెండవ మరియు మూడవ పంట వస్తాయి. బెడ్లను ప్రతి రోజు పరిశీలిస్తూ నలుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగు ఉన్న బెడ్లను తీసి దూరంగా గుంటలో వేయాలి. లేకుంటే ఇతర బెడ్లకు వ్యాపించే అవకాశమున్నది. ప్రతి కిలో ఎండుగడ్డి నుండి దాదాపుగా కిలో పచ్చి పుట్టగొడుగులు వస్తాయి. వీటిని తాజాగా ఉన్నప్పుడే 24 గంటల్లో మార్కెటింగ్ చేయాలి. ఫ్రిజ్ లో అయితే 3 రోజులు వరకు నిల్వ ఉంటాయి. అదే ఎల్మ్ పుట్టగొడుగులయితే గది ఉష్ణోగ్రత వద్ద 3 రోజులు ఫ్రిజ్ లో అయితే 7 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కోసిన పచ్చిపుట్టగొడుగుల్ని 10 శాతం ఉప్పు ద్రావణంలో ఊరవేసి పచ్చళ్ళు చేయవచ్చును. ఎండబెట్టి ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చును. ముత్యపు చిప్పపుట్టగొడుగులు 10-12 కిలోలు ఎండబెడితే 1 కిలో ఎండిన పుట్టగొడుగులు వస్తాయి. వాటిని కిలో రూ 750 నుండి రూ 1000 వరకు అమ్ముకోవచ్చును, లేదా ఎండిన పుట్టగొడుగుల్ని పొడిచేసి మసాల పొడి, నూడిల్స్, సూప్స్, అప్పడాలు వంటి ఉప ఉత్పత్తులు చేసి అమ్మటం లాభదాయకం.
పాలపుట్టగొడుగుల పెంపకం: వీటి పెంపకం ముత్యపు చిప్ప పుట్టగొడుగుల్ని పోలి ఉంటుంది. వీటి పెంపకంలో కూడా వరిగడ్డిని 3-5 సెం.మీ ముక్కలుగా చేసిన తర్వాత, గడ్డిముక్కలను 12 గంటలు మంచి నీటిలో నానబెట్టి మరుసటి రోజు బాగా మరుగుతున్న వేడి నీటి ద్వారా (పాచ్శ రైజే షన్)లేదా రసాయన పద్ధతిలో శుద్ధి చేసుకోవాలి. గడ్డిని బయటకు తీసి అరగంట సేపు నీడలో ఆరనివ్వాలి. స్వచ్చమైన తెల్లని స్పాన్ ని ఇనుపరాడ్ తో తీసి డేట్టాల్ తో శుద్ధి చేసిన ట్రేలో ఇనుపరాడ్ సహాయంతో తీసి గడ్డలు లేకుండా చూసుకోవాలి. తరువాత పాలీధీన్ సంచులు 12 x 18 లేదా 14 x 24 అంగుళాల సైజు కవర్లను తీసుకొని 15 నుండి 20 రంధ్రాలు చేయాలి.  పాలీధీన్ సంచిలో శుద్ధి చేసిన వరిగడ్డి మొక్కల్ని 5 సెం.మీ మందాన వేసి విత్తనాన్ని అంచులవెంటే కాకుండా మధ్యలో కూడా  వెయ్యాలి. ఇలా వేసిన తర్వాత 5 నుండి 6 వరుసలు వేసి ఉపరితలంపై విత్తనాన్ని వెదజల్లాలి. ఇలా 30 రోజులు చీకటి గదిలో ఉంచిన తర్వాత శిలీంధ్రము బూజు దట్టంగా వ్యాపిస్తుంది. పుట్టగొడుగుల బెడ్లను 30 వ రోజున రెండు సమభాగాలుగా కోసి మధ్యలో బెడ్లను కేసింగ్ చేయాలి. కేసింగ్ మట్టిని వారం రోజుల ముందు రసాయనములు ద్వారా ఫార్మాల్డిహైడ్ (2%) లేదా ప్రెషర్ కుక్కర్ లో ఒక రోజు ముందుగా శుద్ధి చేసి బెడ్ల పై వాడాలి. వాడే ముందు మట్టికి 20 గ్రా కాల్షియం కార్బోనేట్ కలిపి వాడాలి. ఇలా చేసిన తర్వాత బెడ్లను వెలుతురు గదిలో గురించి తేమశాతం, ఉష్ణోగ్రత పైన తెలిపిన విధంగా ఉండాలి. ఇలా చేసిన బెడ్ల నుండి 10 నుండి 15 రోజులలో కేసింగ్ మధ్య నుంచి మొలకలు వస్తాయి. పుట్టగొడుగులు 6-10 సెం.మీ డయామీటర్ పెరిగినప్పుడు కోసి మార్కెటింగ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత 15 రోజుల వ్యవధిలో రెండవ మరియు మూడవ పంట చేతికి వస్తుంది. పుట్టగొడుగులు తీసుకున్న తర్వాత బెడ్లను కంపోస్ట్ గుంటలో వేసి పంట పొలంలో ఎరువుగా ఉపయోగించుకోవచ్చును.
పుట్టగొడుగుల్లో వచ్చే చీడపీడలు
పుట్టగొడుగుల బెడ్లను ఆశించే ఫంగస్ బ్యాక్టీరియా మచ్చలను ఎప్పటికప్పుడు గమనిస్తూ బావిస్టిన్ (0.1 శాతం), నువాన్ (0.1 శాతం) మరియు ఫార్మాల్డిహైడ్ (2 శాతం) వారం రోజులవ్యవధిలో పిచికారి చేసినట్లయితే బెడ్లలో చీడపీడలు నివారణ జరిగి ఆరోగ్యవంతమైన పుట్టగొడుగులు వస్తాయి.
పుట్టగొడుగుల పెంపకంలో జాగ్రత్తలు
శుభ్రత పాటించాలి.
పురుగులు కీటకాలు ప్రవేశించకుండా కిటికీలకు సన్నటి  తెరలు అమర్చాలి.
నెలకు 2 సార్లు, 2 శాతం ఫార్మాల్డిహైడ్ ను గది అంతా చల్లాలి.
బెడ్స్ ఉన్న గదిలో మంచి వెలుతురు, గాలి వచ్చే వీలు ఉండాలి.
బెడ్లు ఉన్న గదిలో చీమలు, బొద్దింకలు, ఎలుకలు రాకుండా జాగ్రత్తపడాలి.
బెడ్లు తయారు చేసే సమయంలో నాణ్యమైన స్పాన్ నే వాడాలి.
పుట్టగొడుగులు కోసిన తర్వాతనే బెడ్ పై నీరు పిచికారి చేయాలి.
బెడ్లపై నలుపు, ఆకుపచ్చ రంగు మచ్చలు వస్తే వాటిని తొలగించాలి.
మొత్తం పంట అయిన తర్వాత బెడ్లను కంపోస్ట్ గుంటలో వేసి ఎరువుగా వాడవచ్చు.
పుట్టగొడుగులు – నిల్వ పద్ధతి
1. తాజా పుట్టగొడుగులు 24 గంటల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు. కనుక వీటిని సూర్యరశ్మిలో గాని విద్యుత్ శక్తి ఉపయోగించి కానీ ఎండబెట్టి నిల్వ చేయవచ్చును.
2. తాజా పుట్టగొడుగులను 0.5 శాతం నుండి 1.5 శాతం పొటాషియం మెటాబైసల్ఫేట్, 600 మి.గ్రా సాధారణ ఉప్పు, లీటరు నీటిలో కరిగించి ఏర్పడిన ద్రావణంలో 5 నిమిషాలు కడిగి వైర్ మెష్ మీద పెట్టడం వల్ల రంగు మారవు.
3. ఇలా ఎండబెట్టిన పుట్టగొడుగులను గాలి సోకని డబ్బాలో ప్యాక్ చేయాలి. నిల్వ ఉంచినప్పుడు కొద్దిగా సిలికాజెల్ ఒక చిన్న ప్యాక్ లో వేసి డబ్బాలో వేసినట్లయితే పుట్టగొడుగులు మెత్తబడకుండా ఉంటాయి. ఎండిన పుట్టగొడుగులు ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి.
4. ఎండబెట్టి ఊర వేసి పచ్చళ్ళు చేసి నిల్వ చేసుకోవచ్చును.
5. పుట్టగొడుగులను 0.5 శాతం నిమ్మ ఉప్పుతో కడిగితే కొంతవరకు రంగు మారవు.
పుట్టగొడుగులతో వంటకాలు
పుట్టగొడుగులతో వేపుడు, ఫ్రైడ్ రైస్, పులావ్, పకోడీలు, సమోసా, బోండా, కట్లెట్, బజ్జీలు, సూప్, ఆమ్లెట్, కుర్మా మొదలైన వంటకాలు చేసుకోవచ్చును.
మార్కెటింగ్: మార్కెట్ అంచనా ప్రకారం బెడ్లను ప్రతిరోజు పంట తీసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. తాజా పుట్టగొడుగుల్ని రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్, రైతు బజార్లు, చైనీస్ రెస్టారెంట్లు, ఫస్ట్ ఫుడ్ సెంటర్లకు  మార్కెట్ చేయాలి.
                           డా॥ బి. రాజేశ్వరి, సీనియర్ సైంటిస్ట్ మరియు 
    డా॥ వి. కృష్ణారావు, ప్రొఫెసర్ అండ్ యూనివర్సిటీ హెడ్ పుట్టగొడుగుల పెంపక విభాగం, మొక్కల తెగుళ్ళ శాస్త్ర విభాగము వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ – 30 
Leave Your Comments

ఏపీ ప్రభుత్వం వ్యవసాయరంగం అభివృద్ధి లక్ష్యంగా సంపూర్ణ శిక్షణ..

Previous article

చిన్నపిల్లలకు – ఆరోగ్యకరమైన స్నాక్స్

Next article

You may also like