మన వ్యవసాయం

ధాన్యానికి మద్ధతు ధరలు దక్కాలంటే రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ..

0

యాసంగిలో వరి విస్తీర్ణం మిగిలిన పంటలతో పోలిస్తే అమాంతం పెరిగింది. రైతులు ఎంతో కష్టపడి ఆరుగాలం శ్రమించి పండిస్తే ఒకవైపు అకాల వర్షాలు మరో వైపు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఇంకోవైపు దళారీల వ్యవస్థ, ఇవన్నీయు రైతులు పండించిన పంటను సరైన ధరకి అమ్ముకోలేక సర్ధిచెప్పుకొని ఎంతకో అంతకు అమ్ముకోవడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో రైతు సోదరులు సరైన సమయంలో నూర్పిడి మరియు నూర్పిడి అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదే విధంగా ఆరబెట్టడం, తేమశాతం, జడపదార్థాలు అన్ని ప్రమాణాలు పాటిస్తూ స్వచ్ఛమైన విత్తనాన్ని మార్కెటింగ్ కి తీసుకెళ్లినప్పుడు ధాన్యపు పంటకి మద్ధతు ధరలతో పాటు అధిక గిట్టుబాటు ధరలు లభిస్తాయి.
కోత సమయం నిర్ధారణ:
ధాన్యపు పంటను నూర్పిడి చేయాలనుకునప్పుడు దాని పరిపక్వత రోజులు, పంట నిలుపుదలని గమనించుకోవాలి. గడ్డి పొడి పొడిగా కాకముందే, నిమ్మపండు రంగులోకి మారినప్పుడు మరియు ఎర్ర గొలుసుగా మారి క్రిందికి కంకులు వంగినప్పుడు కోతలను కానీ నూర్పిడి గాని చేసుకోవాలి. వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటం మూలాన కోతలు సరైన సమయం కోయకపోవడం లేదా ముందస్తు జాగ్రత్తగా కోత కోయడం మరియు మార్పిడి అధిక తేమశాతం మీదనే నూర్పిడి చేయడం జరుగుతుంది కొన్నిసార్లు. కోత మిషన్లు దొరక్క పోవడం, పంటకోతలు అదును తప్పి అకాల వర్షాలకి లోనవుతున్నాయి. దీని వలన ధాన్యపు రంగు క్షీణించిపోయి, కొన్ని సార్లు మసి తెగులు రావడం జరుగుతుంది. తద్వారా మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధరలలో లభ్యం కావడం లేదు.
చాలా మంది రైతులు ఈ రబీ / యాసంగి సమయంలో కాలువ నీళ్ల మీద ఆధారపడుతూ ధాన్యపు పంటలు సాగు చేయడం జరిగింది. రైతులు కొద్దిగా ఆలస్యంగా నాట్లు వేయడం జరిగింది. కోతకు కూడా ఆలస్యమవ్వడం జరిగింది. వాతావరణంలోని పలు మార్పులు, తుఫానులా మారి రాష్ట్రంలో పలు జిల్లాలో మూడు నాలుగు రోజులు ఓ మోస్తరు వానలు పడ్డాయి. అది కూడా పంట తడితప్పినప్పుడు లేదా రేపో మాపో నూర్పిడి చేసేలోపు కొన్ని నూర్పిడి జరిగి కల్లాలో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భంలో రైతు సోదరులు మొక్కవోని ధైర్యంతో తగిన జాగ్రత్తలు, సూచనలు పాటించినట్లయితే సత్ఫలితాలు ఉంటాయి.
పంటలు పొట్టదశలో, మరియు నూర్పిడికి ముందు అకాల వర్షాలకి లోనవుతే కాండం కుళ్ళు, తెగులు, మసి తెగులు రావడం జరుగుతుంది. పంటంతా నెలకు ఒరిగిపోతుంది. ఈ సమస్యకి పరిష్కారంగా కూలీల సమయంతో లేదా రైతులు స్వయంగా జడలుగా కట్టుకోవాలి. పొలమంతా జడకట్లు వేసుకోవాలి. దీని వలన నీరు జారిపోయి త్వరగా ఆరిపోతుంది. ఒకవేళ నీటి నిలుపుదల పొలంలో ఉన్నట్లైయితే నీటి పారుదల సౌకర్యంగా కాలువలు ఏర్పాటు చేసుకొని బయటకు తీసివేయాలి. దీని వలన కాండం కుళ్ళు తెగుళ్లున్ని నివారించవచ్చు. అదే మాదిరిగా రసాయనికంగా హెక్సాకొనజోల్ మరియు ప్రొపికోనజోల్ మందులను పంటపై పిచికారీ చేసుకోవాలి.
కోతకి ముందు వర్షాలు పడినప్పుడు 50 గ్రాములు ఉప్పు నీటిని 50 లీటర్ల లో కలిపి పొలమంతా తడిచేలా పిచికారీ కానీ లేదా చల్లుకోవాలి. దీని వలన గింజ రంగు, నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.
నూర్పిడి అనంతరం కల్లా లో తడిసినట్లయితే నాణ్యత, రంగు మారకుండా, పిలకలు రాకుండా ధాన్యం మీద ఉప్పు రాళ్లు చల్లుకోవడం శ్రేయస్కరం. ఈ విధంగా పంట పలు దశలలో వివిధ పద్ధతులతో అకాల వర్షాలకి లోనయినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మార్కెట్ లో సరైన గిట్టు బాటు ధర పలుకుతుంది.
నూర్పిడి తదనంతరం ధాన్యం ఆరబెట్టడం:
నూర్పిడి చేస్తున్న సమయంలో ధాన్యపు పంటలలో గడ్డిజాతి గింజలు లేకుండా చూసుకోవాలి.
నూర్పిడి చేసిన తరువాత ఒక్కసారైనా తూర్పార పట్టుకోవాలి. దీని మూలానా ఏవైనా పంట అవశేషాలు, తాలుగింజలు, జడపదార్థం, కలుపు గింజలు, ఎలుకలు మరియు కీటకాల వ్యర్థ పదార్థాలు అన్ని తొలగిపోయి స్వఛ్చమైన నాణ్యత విత్తనం ఉంటుంది.
కోత మిషన్లతో ధాన్యపు పంటలను నూర్పిడి చేసినప్పుడు 25 – 26 తేమ శాతం ఉంటుంది. కావున ధాన్యం కుప్పలను సిమెంట్ కల్లా లపై లేదా టార్పలిన్ షీట్లపై ఆరబెట్టాలి. రెండు, మూడు రోజులు బాగా ఎండేలా తిరగబోయాలి. అది యంత్రాల సహాయంతో లేదా కాళ్లతో కలియతిప్పాలి.
పంటను ఆరబెట్టే సమయంలో రాళ్లు, మట్టి పెళ్లలు, చెత్త, చెదారం వంటి వ్యర్థ పదార్థాలు చేరకుండా జాగ్రత్త వహించాలి.
పంటకోసిన తర్వాత సరిగా ఆరబెట్టకపోతే గింజలు రంగు మారి పంట నాణ్యత తగ్గే అవకాశం ఉంది .
మద్ధతు ధరలు, సరైన గిట్టుబాటు ధర ధాన్యపు పంటకి పలకాలంటే 17 – 18 తేమ శాతం ఉండేలా చూసుకోవాలి.
జడపదార్థం, ఇతర అవశేషాలు 5 శాతం కంటే ఎక్కువగా మించకూడదు. ఒక వేళ రైతులు అవసరాన్ని బట్టి పంటల నిల్వలో జాగ్రత్తలు పాటించుకోవాలి. గోనె సంచుల విషయంలో నిల్వ వుండే ప్రాంతం, స్థితి గతులు పరిగణనలోకి తీసుకొని తగు జాగ్రత్తలు పాటించినట్లయితే విత్తన నాణ్యత మరియు జీవశక్తి, తేజం కాపాడవచ్చు. భవిష్యత్తులో మంచి విత్తనాలుగా వాడుకోవచ్చు. రంగు, నాణ్యత కాపాడటం వల్ల మార్కెట్ లో ఏ సమయంలో తీసుకెళ్లినా సరైన గిట్టుబాటు ధరలు లభిస్తాయి. కానీ విత్తన నిల్వలో 10 – 12 తేమ శాతం ఉండేలా చూసుకోవాలి. అంతకు మించకూడదు. కాబట్టి సరిగ్గా ఆరబెట్టి నిల్వ చేసి మార్కెట్ కి తీసుకెళ్ళాలి.
ఈ విధంగా రైతులు సలహాలు, సూచనలను, ధాన్యపు పంటలకి మద్ధతు ధరలు దక్కించుకోవడానికి తగు జాగ్రత్తలను పాటిస్తే విత్తన నాణ్యత, రంగు కాపాడుకొని మార్కెట్ సరైన గిట్టుబాటు ధరలు
పొందవచ్చు. తద్వారా నికర ఆదాయం ఆర్జించవచ్చు.

డా. యస్. మధు సూదన్ రెడ్డి, డా. కె. గోపాలకృష్ణ మూర్తి,                                                                     డా. యం. రాంప్రసాద్ మరియు డా. యం. మాధవి                                                                                 వ్యవసాయ కళాశాల, అశ్వారావు పేట.

 

Leave Your Comments

‘మే’ మాసంలో ఉద్యాన పంటల్లో చేయవలసిన సేద్యపు పనులు..

Previous article

అపరాల నిల్వ కొరకు గాలి చొరవని మూడు పొరల సంచులు (హెర్మాటిక్ బ్యాగులు) వినియోగం

Next article

You may also like