భారతదేశంలో పండించే వాణిజ్య పంటల్లో పత్తి ప్రధానమైనది. మన రాష్ట్రంతో పాటు దేశీయంగా పత్తి సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతున్నా ఉత్పాదకతలో ఆశించిన వృద్ధి నమోదుకావడం లేదు. కారణం రైతులు పత్తిలో అధిక దిగుబడులు సాధించే ప్రయత్నంలో భాగంగా పంటనాశించు కీటకాల నివారణకు విచక్షణారహితంగా పురుగుమందులను అధిక మోతాదులో వాడుతున్నారు. దీనివల్ల కీటకాలు పురుగు మందులను తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడం. మిత్రపురుగులు నశించడం, బీటీ ప్రభావం రసంపీల్చే పురుగుల మీద లేకపోవడం, వాతావరణ కాలుష్యానికి దారితీస్తుంది.
బీటీ పత్తి రకాలు మొక్కలకు 90 రోజుల వరకు కాయతొలిచే పురుగులను తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ తర్వాత బీటీ విషప్రభావం అంతగా వుండదు. దీంతో పాటు తీవ్రవర్షాభావ పరిస్థితుల్లో, అధిక వర్షాలు ఉన్నప్పుడు కూడా బీటీ ప్రభావం తక్కువ. ఇటీవల కాలంలో కాయతొలుచే పురుగులను సులభంగా నివారించడానికి పలు పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధన ఫలితాల ఆధారంగా రైతులకు పలు నూతన సస్యరక్షణ విధానాలు సూచించారు.
శనగపచ్చ పురుగు:
ఈ పురుగు కాయల లోపలి తల ఉంచి, మిగతా శరీరాన్ని బయటే ఉంచి కాయలను తింటాయి. ఈ కాయలపై పెద్ద గుండ్రని రంధ్రాలను చేసి లోపలి భాగాన్ని దోల్లచేసి నష్టపరుస్తాయి.
శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 10లీటర్ల నీటికి 10 మి.లీ. ఇండాక్సాకార్బ్ లేదా 3మి.లీ. స్పైనోసాడ్ కలిపి చల్లాలి.
పొగాకు లద్దె పురుగు:
ఈ పురుగు ఆకుల పైభాగంలో సమూహాలుగా వందలకొద్ది గుడ్లు పెట్టి వాటిపై గోధుమ రంగు నూగును కప్పేస్తాయి. మొదటి దశలో పిల్లపురుగులు ఆకులపై గుంపులు గుంపులుగా ఉండి, ఆకులను గోకి తిని జల్లెడలాగా తయారుచేసి పత్తికి అపార నష్టాన్ని కలిగిస్తాయి.
పొగాకు లద్దెపురుగులను నియంత్రణకు లీటరు నీటికి 1.5 గ్రా. థయోడికార్బ్ లేదా ౧మి.లీ. నొవాల్యురాన్ కలిపి పిచికారీ చేయాలి.
పెద్ద పురుగులను అదుపు చేయటానికి 10కిలోల తవుడు + కిలో బెల్లం + 1 లీ. క్లోరిఫైరిఫాస్, తగినంత నీరు కలిపి చేసిన ఎరను సాయంత్రం వేళల్లో మొక్కల మొదళ్ళ వద్ద పడేలా చల్లాలి.
మచ్చల పురుగు:
ఈ పురుగు తన గుడ్లను చిగుర్లు, మొగ్గలు, పిందెల మీద పెడుతుంది. ఈ గుడ్లనుంచి వెలువడిన చిన్న లార్వాలు మొక్కల చివర్లను తొలిచి తింటాయి. అందువల్ల కొమ్మల చివర్లు ఎండిపోతాయి. అందువల్ల దీనిని “తలనత్త” పురుగు అని అంటారు.
తలనత్త పురుగు నియంత్రణకు లీటరు నీటికి 2 మి.లీ. క్లోరిఫైరిఫాస్ లేదా 3గ్రా. కార్బరిల్ కలిపి పిచికారీ చేయాలి.
గులాబిరంగు పురుగు:
ఈ పురుగు తన గుడ్లను ఒక్కొక్కటిగా ఆకుల తొడిమపైన పూత, పిందెలపైన పెడుతుంది. చిన్న పురుగులు మొగ్గ లోపలికి తొలుచుకొనిపోయి లోపలి పదార్థాలను తింటాయి. తద్వారా గడ్డిపూలుగా మారుతాయి.
గులాబి రంగు పురుగును నివారించడానికి పంట చివరికాలంలో లీటరు నీటికి 2 మి.లీ. సైపర్ మెథ్రిన్ కలిపి చల్లాలి.
సస్యరక్షణ పద్ధతులు:
- బీటీ పత్తిపై బీటీ మందులను పిచికారీ చేయకూడదు.
- మందులను మార్చి, మార్చి పిచికారీ చేసుకుంటే మంచి ఫలితముంటుంది. ఒకే మందు ఎక్కువ సార్లు పిచికారీ చేయకూడదు.
- ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా మగ పురుగులు ఆకర్షితమై బుట్టలో పడుతాయి. దీంతో పురుగుల సంతతి తగ్గుతుంది. పత్తిలో శనగపచ్చ పురుగు నివారణలో లింగాకర్షక బుట్టలో రోజుకు 8 పురుగులు వరుసగా మూడు రాత్రులు పడితే నివారణ చర్యలు చేపట్టాలి.
- పొగాకు లద్దెపురుగుల వలసల నియంత్రణకు పొలం చుట్టూ అడుగులోతున నాగాలిచాలు తీసి అందులో “ఫాలిడాల్” పొడిచల్లాలి.
- గుడ్డిపూలను ఏరి నాశనం చేయాలి.
- ఎకరాకు 15పక్షి స్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా వాటిమీద పక్షులు వాలి పంటలపై ఆశించే పురుగులను ఏరుకుని తింటాయి.
- ఎకరాకు 4 చొప్పున పసుపు రంగు రేకులకు ఆముదం లేదా గ్రీజు రాసిపెడితే తెల్లదోమలు వీటికి ఆకర్షితమై అతుక్కుంటాయి.
- పురుగు మొదటి దశలను నివారణ చేయడానికి 5 శాతం వేపగింజల ద్రావణాన్ని చల్లాలి.
- 200 లార్వాలకు సమానమైన వైరస్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.
- ఆకులపై పెట్టే గుడ్ల సముదాయాన్ని ఏరినాశనం చేయడం ద్వారా పురుగుల వ్యాప్తిని అరికట్టవచ్చు.
- చీడపీడలు సోకిన మొక్కలను వెంటనే పీకి నాశనం చేయడం ద్వారా తెగుళ్ళు వ్యాప్తిని అరికట్టవచ్చు.