మన వ్యవసాయం

శనగ పంటలో చీడపీడలు – యాజమాన్యం

0

శనగ పంట ప్రధానమైన పప్పు దినుసు పంట. ఈ పంటను అది పెరిగే వాతావరణ పరిస్థితులను బట్టి యాసంగి పంటగా సాగు చేస్తున్నారు. అయితే విత్తన ఎంపిక జాగ్రత్తగా చేసుకున్నప్పటికీ పంట వేసిన తరువాత కొన్ని రకాల చీడపీడలు ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి కావున చీడపీడలను సరైనటువంటి సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడలు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
శనగపచ్చ పురుగు :
తల్లి పురుగు లేత ఆకుపై లేదా లేత కొమ్మపై లేదా పిందె పై ఒక్కొక్కటిగా పసుపు రంగు గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల లద్దె పురుగు ఆకును తొలిదశలో తిని నష్టపరుస్తాయి. కాయలు ఏర్పడిన తరువాత కాయను తిని విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తాయి. కాయలోనికి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయట ఉంచి లోపల గింజను తిని డొల్ల చేస్తాయి. పురుగు ఆశించిన కాయకు గుండ్రటి రంధ్రాలు ఉంటాయి.
కాబట్టి ఈ పురుగు నివారణకు అంతరపంటగా ధనియాలు (16:4) సాగు చేయాలి. చుట్టుపక్కల నాలుగు వరుసలు జొన్న పంట వేయాలి. 50-100 బంతి మొక్కలు నాటాలి. పురుగు ఉధృతిని బట్టి తొలిదశలో వేప నూనె ఒక లీటరు ఎకరానికి పిచికారీ చేయాలి. పురుగు తొలిదశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్‌ 500 మి.లీ ఎకరాకు పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంధ్రానిలిప్రోల్‌ 60 మి.లీ. లేదా ఫ్లూబెండామైడ్‌ 40 మి.లీ. ఎకరాకు పిచికారీ చేయాలి.
రబ్బరు పురుగు:
తల్లి రెక్క పురుగు ఆకుపై గుడ్లను పెడుతుంది. పిల్ల పురుగు మొక్క దగ్గర పత్రహరితాన్ని గీరి తిని నష్టపరుస్తాయి. పైరు తొలిదశలో ఉన్నప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకును పూర్తిగా తిని నష్టపరుస్తాయి. పంట తొలిదశలో అనగా 20-25 రోజుల దశలో బెట్ట వాతావరణ పరిస్థితుల తర్వాత అధిక వర్షపాతం నమోదైతే ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్‌ 500 మి.లీ లేదా నోవోల్యురాన్‌ 200 మి.లీ. ఎకరాకు పిచికారీ చేయాలి. పురుగు ఉధృతిని బట్టి 2-3 సార్లు మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
ఎండు తెగులు:
ఈ తెగులు భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్క ఆకులు వడలిపోయి పసుపు రంగులోకి మారి రాలిపోవును. తెగులు వచ్చిన మొక్కలు అక్కడక్కడ గుంపు గుంపుగా చనిపోతాయి. ఈ తెగులు పంట యొక్క అన్ని దశల్లో ఆశించి నష్టాన్ని కలుగజేయును. ముఖ్యంగా కాయ ఏర్పడే దశలో ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది.
ఈ తెగుల నివారణకు తెగుళ్ళను తట్టుకొనే రకాలై ఐసిసివి -2, జెజి-11, నంద్యాల శనగ-1, నంద్యాల శనగ-47 ఎన్నుకొని విత్తుకోవాలి. అంతేకాకుండా విత్తనశుద్ధి ట్రైకోడెర్మా విరిడిలో 10 గ్రా. ఒక కిలో విత్తనానికి పట్టించి పెట్టుకోవడం వల్ల తెగుళ్ళను సమర్ధవంతంగా నివారించవచ్చు.
వేరుకుళ్ళు తెగులు:
బెట్ట పరిస్థితుల్లో మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. పూత మరియు కాయ దశలో ఎక్కువగా కనిపిస్తుంది. వేర్లు నల్లగా మారి పూర్తిగా కుళ్ళిపోతాయి.
పంట యాజమాన్యం :
పంట మార్పిడి అవలంభించడం.
శిలీంధ్ర నాశినులతో విత్తనశుద్ధి చేెయాలి.
సకాలంలో విత్తుకోవడం వల్ల పంట చివరి దశలో బెట్టకు మరియు అధిక ఉష్ణోగ్రతకు గురికాకుండా చూసుకోవడం వల్ల తెగుళ్ల తీవ్రతను తగ్గించవచ్చు.
రైజోక్టోనియా ఎండుతెగులు :
ఈ తెగులు ముఖ్యంగా పూత, కాయ ఏర్పడే సమయంలో కనిపిస్తుంది. ఈ తెగులు యొక్క లక్షణాలు అక్కడక్కడ ఆకులు పాలిపోయి మొక్క పూర్తిగా ఎండిపోతాయి. ఆశించిన మొక్కను తీసి చూసినట్లయితే వేర్లు నల్లగా మారి కుళ్ళినట్లుగా కనిపిస్తాయి. ప్రధాన వేర్లు కనబడువు. పిల్ల వేర్లు ఉండవు. వేరు బాగా గిడసబారి పోవును.
ఈ తెగులు సాధారణంగా భూమి ద్వారా వ్యాప్తి చెందును. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగితే ఈ తెగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
జెజి -11 అనే రకం కొంతవరకు తట్టుకుంటుంది. కావున ఈ రకాన్ని సాగు చేసుకోవాలి. అంతేకాక ట్రైకోడెర్మా విరిడిలో విత్తన శుద్ధి చేయాలి. ఈ విధంగా రైతు సోదరులు చీడ పురుగులు, తెగుళ్ల లక్షణాలు గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు.

 

Leave Your Comments

కృష్ణ వ్రీహి బియ్యాన్ని పండిస్తున్న..కౌటిల్య కృష్ణన్

Previous article

బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ ప్లూయంజా) వైరస్..

Next article

You may also like