చీడపీడల యాజమాన్యంతెలంగాణతెలంగాణ సేద్యంమన వ్యవసాయంవ్యవసాయ పంటలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పైర్లలో ఏయే చీడపీడలు ఆశిస్తాయి ? వాటిని ఎలా నివారించుకోవాలి ?

0

ప్రస్తుతం రైతులు సాగు చేసుకోదగిన రబీ పంటలు, సాగు చేస్తున్న వ్యవసాయ, ఉద్యాన పంటల్లో వివిధరకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఆశించాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి, పత్తి, కంది, వేరుశనగ, మిరప, టమాటా, పసుపు, బత్తాయి పంటల్లో ఏయే పురుగులు, తెగుళ్లు సోకటానికి అనుకూల పరిస్థితులున్నాయి, వాటిని ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం.

రబీ పంటల సాగు:
తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షం కురిసే సూచనలున్నందున రైతులు ఆకాశంలో మేఘాలను గమనిస్తూ ధాన్యం వర్షం వల్ల తడవకుండా టార్పాలిన్ తో కప్పి ఉంచాలి. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి లేదా మార్కెట్ కి తరలించి టార్పాలిన్ తో కప్పి ఉంచాలి. వేరుశనగ, బొబ్బర్లు పంటలను నవంబర్ 30వ తేదీ వరకు, మినుము,పెసర పంటలను డిసెంబర్ 10వ తేదీ వరకు నాణ్యమైన విత్తనాలను వినియోగించుకొని విత్తుకోవాలి. యాసంగి వరి నారుమళ్ళను నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో పోసుకోవాలి. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలను డిసెంబర్ 31వ తేదీ వరకు విత్తుకోవచ్చు. కుసుమ, శనగ, ఆవాలు పంటలను నవంబర్ 15వ తేదీ వరకు  విత్తడం పూర్తిచేసుకోవాలి.

పంటల సంరక్షణ సలహాలు- సూచనలు:వరి:
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కంకినల్లి ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు 5 మి.లీ. డైకోఫాల్ లేదా 1 మి.లీ. స్పైరోమెసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వరిలో గింజమచ్చ తెగులు కనిపిస్తోంది. నివారణకు 1మి.లీ. ప్రొపికొనజోల్ + 1మి.లీ.స్పైరోమేసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పత్తి:- ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గులాబి రంగు పురుగు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు పొలం గట్లమీద ఉన్న వయ్యారి భామ కలుపు నివారించాలి. ఎకరాకు 8-10 లింగాకర్షక బుట్టలను సామూహికంగా అమర్చి రెక్కల పురుగులను బందించాలి లేదా ఎకరాకు 4 లిగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా 2-3 రోజులలో బుట్టకు 7-8 రెక్కల పురుగులు గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. నివారణకు 2మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2.5మి.లీ. క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ పురుగు నివారణకు మందుల పిచికారి ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 4గంటల తరువాత చేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో తెల్లదోమ ఆశించే వీలుంది. నివారణకు 2మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.2గ్రా. ఎసిటామిప్రిడ్ లేదా 1మి.లీ స్పైరోమేసిఫిస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కంది:కందిలో ఆకుచుట్టు పురుగు గమనించడమైంది. నివారణకు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. క్వినాల్ ఫాస్ లేదా 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కందిలో శనగపచ్చ పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. శనగ పచ్చ పురుగు లార్వాలను తినటానికి అనుగుణంగా ఎకరాకు 10-15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. శనగ పచ్చ పురుగుల ఉనికిని గమనించట్టానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు గుడ్లు. తొలిదశ లార్వాల నివారణకు 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారి చేయాలి. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 1.5గ్రా. ఎసిఫేట్ లేదా 2మి.లీ. క్వినాల్ ఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వేరుశనగ:-వేరుశనగలో టిక్కాఆకుమచ్చ తెగులు గమనించడమైంది.నివారణకు 1.0 మి.లీ. టెబ్యుకోనజోల్ లేదా 2 గ్రా. క్లోరోథాలోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. వేరుశనగలో ఆకుముడత పురుగు ఆశించినచోట్ల నివారణకు 2.5మి.లీ. క్లోరిపైరిపాస్ లేదా 1.5గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.వేరుశనగలో పొగాకు లద్దె పురుగు ఆశిస్తోంది. దీని నివారణకు జల్లెడ ఆకులు ఏరి పురుగులను నాశనం చేయాలి. ఎకరానికి 10-15 పక్షి స్థావరాలను ఏర్పర్చుకోవాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేపగింజల కషాయం పిచికారి చేయాలి. ఎదిగిన లార్వా నివారణకు 1మి.లీ. నోవాల్యూరాన్ లేదా 0.2మి.లీ. ప్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మిరప:- మిరపలో తెల్ల దోమ గమనించడమైంది. నివారణకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8-10 చొప్పున అమర్చాలి. 0.3గ్రా. థయోమిథాక్షమ్ లేదా 0.3మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో కొమ్మ ఎండు, కాయకుళ్ళు తెగులు గమనించినట్లయితే నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో కోయినోఫొర కొమ్మకుళ్ళు తెగులు గమనించడమైంది. నివారణకు 3 గ్రా.పైరాక్లోస్ట్రోబిన్ + మెటిరామ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో పొగాకు లద్దె పురుగు గమనించడమైంది. దీని నివారణకు 1.25 మి.లీ. నోవాల్యూరాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎకరానికి 8-10 (నీలం, పసుపు, ఎరుపు రంగు) జిగురు అట్టలను అమర్చాలి. లీటరు నీటికి 2మి.లీ. థయాక్లోప్రిడ్ లేదా 2మి.లీ. క్లోర్ ఫెనపిర్ లేదా 2.5మి.లీ. టోల్ ఫెన్ పైరాడ్ లేదా 1.2గ్రా. డైఫెన్ థయూరాన్ మందుతో పాటు 5మి.లీ. (1500 పిపియం) వేపనూనె చొప్పున కలిపి పిచికారి చేయాలి.

టమాట:టమాటలో పచ్చదోమ, తామర పురుగులు ఆశిస్తున్నాయి. వీటి నివారణకు 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 1.5గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పసుపు:ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పసుపులో దుంప, వేరుకుళ్ళు తెగులు ఆశించే వీలుంది. నివారణకు 2.5గ్రా. మేఫేనొక్షమ్ మరియు మాంకోజేబ్ లేదా 2గ్రా. కాప్టాన్ లేదా 3గ్రా. కాపర్ఆక్సీక్లోరైడ్ మందును మొక్కల మొదళ్ళు తడిచేలా పోయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పసుపులో దుంప తొలుచు ఈగ ఆశించటానికి అనుకూలం. ముందు జాగ్రత్త చర్యగా ఎకరాకు100కిలోల వేప పిండిని మొక్కల మధ్య వేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పసుపులో ఆకు మచ్చ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఒక గ్రాము థయోఫానేట్ మిథైల్ లేదా 1మి.లీ. ప్రోపికొనజోల్ లేదా 2మి.లీ. హెక్సాకొనజోల్ మందుతో పాటు 1మి.లీ. శాండోవిట్ లేదా ధనువిట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బత్తాయి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బత్తాయిలో ఆకుముడత పురుగు ఆశించటానికి అనుకూలంగా ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా నివారణకు 5మి.లీ. వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు 1.5మి.లీ. ప్రొఫెనోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బత్తాయిలో గజ్జి తెగులు ఆశించే వీలుంది. నివారణకు తెగులు సోకిన కొమ్మలను, ఆకులను కత్తిరించి కాల్చివేయాలి. పది లీటర్ల నీటికి 30 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ + 1గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ చొప్పున కలిపి పిచికారి చేయాలి.

డా. ఎస్.జి. మహాదేవప్ప,
సీనియర్ శాస్త్రవేత్త (అగ్రానమి),
వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం,  
పి.జె.టి.ఏ.యు., రాజేంద్రనగర్,
ఫోన్: 9492359789.

Leave Your Comments

రబీ వరిలో అధిక దిగుబడికి రకాల ఎంపిక కీలకం !

Previous article

You may also like