Weed Management Practices: పంట దిగుబడిని ప్రభావితం చేసే వాటిల్లో కలుపు నివారణ అతి ముఖ్యమైనది. వివిధ పంటలలో జరిగే నష్టం 90 శాతం వరకు ఉండవచ్చు. విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు పంటలో పంటకు తీవ్ర నష్టం చేసురుస్తాయి. కలుపు మొక్కలు పంటలో నీరు, పోషకాలు, సూర్యరశ్మికి పోటీపడుతూ పంట దిగుబడిని తగ్గిస్తాయి. పంట నాణ్యతను తగ్గిస్తాయి. అంతే కాక కలుపు మొక్కలు చీడపీడలకు ఆశ్రయమిచ్చి వాటి వ్యాప్తికి సహకరించి తద్వారా రైతుకు సస్యరక్షణ పై ఖర్చును కూడా పెంచుతాయి. కలుపు మొక్కలు పంట వేసిన 15-60 రోజుల వరకు పంటతో పోటీపడతాయి. కావున పంటల వారిగా తగిన యాజమాన్య పద్ధతులు పాటించి కలుపు ని అరికట్టడం వలన అధిక దిగుబడులు పొందవచ్చును.
వరి:
నారుమడిలో: వరి నారుమడిలో సాధారణంగా ఊదా ఎక్కువగా వస్తుంది. దాని నిర్మూలనకు ఒక ఎకరం నారుమడికి ప్రెటిలాక్లోర్ 50% ద్రావకం 400 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి నారుమడి విత్తిన 2 లేక 3 రోజులలో పిచికారీ చేయాలి లేదా విత్తిన 14-15 రోజులప్పుడు ఊద నిర్మూలనకు ఎకరం నారుమడికి 400 మి.లీ. సైహాలోఫాప్ బ్యుటైల్ 10% 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలెను. ఊద మరియు వెడల్పాకు కలుపు మొక్కలు నివారించడానికి విత్తిన 15 రోజులకు ఎకరాకు 100 మి.లీ. బిస్ పైరిబాక్ సోడియం 10% ద్రావకం 200 మి.లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
నాటిన వరి పొలంలో: వరి నాటిన మూడు నుండి అయిదు రోజులలోపు పొలంలో మూడు నుండి అయిదు సెంటీమీటర్ల నీరు నిలువగట్టి లీటరు నీటికి 80గ్రా. పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ 10% డబ్ల్యూపి లేదా 35 గ్రా. ఆక్సాడియార్జిల్ 80% పొడి లలో ఏదో ఒకదానిని ముందుగా 500 మి.లీ. నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని 20 కిలోల పొడి ఇసుకతో కలుపుకొని ఒక ఎకరం పొలంలో సమానంగా చల్లుకోవాలి. నాటిన 15-25 రోజుల సమయంలో గడ్డి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 100మి.లీ. బిస్ పైరిబాక్ సోడియం 10% 200 లీ. నీటిలో కలిపి పొలంలో నీరు తీసి పిచికారీ చేయాలి. నాటిన 25-30 రోజులప్పుడు పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు కిలో 2,4-D 80 డబ్ల్యూపి లేదా ఒక లీటరు ఎమైన్ సాల్ట్ లేదా 50గ్రా. ఇథాక్సిసల్ఫూరాన్ 15% 200 లీటర్ల నీటిలో కలిపి కలుపుపై పడేటట్లు పిచికారీ చేయాలి.
నేరుగా విత్తిన వరి: విత్తనం విత్తుటకు ముందు తుంగ, గరిక, దర్భగడ్డి, బొంత ఊద వంటి మొండి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు 1.0 లీ.నీటికి 10 మి.లీ. గ్లైఫోసేట్ 41 ఎస్ఎల్ + 10గ్రా. యూరియా లేదా అమ్మోనియంసల్ఫేట్ కలిపి, ఎక్కడ కలుపు ఉంటే అక్కడ పిచికారీ చేయాలి. విత్తిన 1-2 రోజులలోపు తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1.0లీ. పెండిమిథాలిన్ 30% లేదా 400మి.లీ. 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి మరియు వెడల్పాటి కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 100 మి.లీ. బిస్పైరిబాక్ సోడియం 10% 200 లీ. నీటిలో కలిపి విత్తిన 15-25 రోజుల మధ్య పిచికారీ చేయాలి.
Also Read: శనగ పంటలో – సమగ్ర సస్యరక్షణ
మొక్కజొన్న: విత్తిన వెంటనే 0.8-1.0 కి. అట్రజిన్ 50% డబ్ల్యూపి లేదా 1.0 నుండి 1.5లీ. పెండిమిథాలిన్ 30% లేదా 300 మి.లీ. ఆక్సీఫ్లోరోఫెన్ 23.5% 200 లీ. నీటిలో కలిపి విత్తిన 24 నుండి 48 గంటల లోపు నేలపై పిచికారీ చేసుకోవాలి. విత్తిన 20-25 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కల నివారణకు ఎకరాకు 1 కిలో 2,4-డి 80 డబ్ల్యూపి, సోడియం సాల్ట్ మరియు గడ్డిజాతి కలుపు నివారణకు 115 మి.లీ. టెంబోట్రియోన్ 34.4% 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
రాగి: విత్తిన వెంటనే లేదా నారు నాటటానికి ముందు ఎకరాకు 1.0లీ. పెండిమిథాలిన్ 30% 200లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 20-25 రోజులప్పుడు వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు ఎకరాకు ఎకరాకు 1 కిలో 2,4-డి 80 డబ్ల్యూపి, సోడియం సాల్ట్ 200లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ప్రత్తి: విత్తిన వెంటనే లేదా 1-2 రోజులలో ఎకరాకు 1.0-1.3లీ. పెండిమిథాలిన్ 30% 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 25-30 రోజులకు మరియు 50-55 రోజులకు గుర్రు మరియు గుంటకలతో అంతర కృషి చేయాలి. వర్షాలు ఎక్కువగా ఉండి అంతరకృషి కుదరనప్పుడు ఎకరాకు 250 మి.లీ. పైరిథయోబ్యాక్ సోడియం 10% ద్రావకం మరియు 400 మి.లీ. క్విజాలోఫాప్-పి-ఇథైల్ 5% 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
చెఱకు: ముచ్చెలునాటిన వెంటనే లేదా 2-3 రోజులలో ఎకరానికి 1.25 కిలోల అట్రజిన్ 50 డబ్ల్యూపి 200లీ. నీటిలో కలిపి పిచికారీ చేసి ఒక నెల వరకు కలుపు నివారించుకోవచ్చు. లేదా ఎకరాకు 400మి.లీ. ఆక్సీఫ్లోరోఫెన్ 23.5 ఇసి 200లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన నేల తరువాత 20-25 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2-3 సార్లు గుర్రుతో లేదా దంతితో అంతరకృషి చేయాలి లేదా వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 2,4-డి 80 డబ్ల్యూపి, సోడియం సాల్ట్ 30,60 తర్వాత పిచికారీ చేయాలి లేదా ఎకరాకు 500గ్రా. 2,4-డి 80 డబ్ల్యూపి, సోడియం సాల్ట్ +500గ్రా. మెట్రిబుజిన్ 70డబ్ల్యూపి 200లీ. నీటిలో కలిపి వరుసల మధ్య మాత్రమే పైరుపై పడకుండా 30,60 రోజులప్పుడు పిచికారీ చేస్తే కలుపు సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది.
అపరాలు:
కంది, పెసర, మినుము, సోయాచిక్కుడు, బొబ్బర్లు:
ఎకరానికి 1.3-1.6 లీటర్ల పెండిమిథాలిన్ 30% ద్రావకం 200 లీటర్ల చొప్పున విత్తిన 24-48 గంటల లోపు తేమగల నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొఱ్ఱుతో అంతరకృషి చేయాలి. ఇమిజితాపిర్ 10% ద్రావకం ఎకరాకు 200 మి.లీ అనగా లీటరు నీటికి 1మి.లీ. చొప్పున కలిపి 15-20 రోజుల మధ్యన పిచికారీ చేయడం వలన గడ్డిజాతి మరియు వెడల్పాటి కలుపు మొక్కలను నివారించవచ్చు. గడ్డిజాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లైతే క్విజాల్ ఫాప్-ఇథైల్ 5% ద్రావకం ఎకరాకు 400 మి.లీ. లేదా ఫెనాక్సీప్రాప్-ఇథైర్ 9% ద్రావకం మందును 250 మి.లీ. 200 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
శనగ: పెండిమిథాలిన్ 30% ద్రావకం మందును ఎకరాకు 1-1.5 లీ. 200 లీటర్ల నీటికి చొప్పున కలిపి విత్తిన 24-48 గంటల లోపు తేమగల నేలపై పిచికారీ చేయాలి.
నూనెగింజలు:
వేరుశనగ: పెండిమిథాలిన్ 30% ద్రావకం 1.3లీ. 200 లీటర్ల నీటికి చొప్పున కలిపి విత్తిన 24-48 గంటల లోపు తేమగల నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొఱ్ఱుతో అంతరకృషి చేయాలి లేదా ఇమిజితాపిర్ 10% ద్రావకం మందును ఎకరాకు 300-400 మి.లీ. 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.
నువ్వులు: విత్తిన వెంటనే లేదా 1,2 రోజులలో ఎకరాకు 1.0లీ. పెండిమిథాలిన్ 30% ద్రావకం 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులకు గడ్డిజాతి కలుపు నిర్మూలనకు 400 మి.లీ. క్విజాల్ ఫాప్ ఇథైల్ 5% లేదా 250 మి.లీ. ఫెనాక్సాఫాప్ ఇథైల్ 9% ద్రావకం 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆముదం: ఎకరాకు1.0-1.25 లీ. పెండిమిథాలిన్ 30% 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24-48 గంటల లోపు పిచికారీ చేయాలి. విత్తిన 25-30 రోజులకు గడ్డిజాతి కలుపు నిర్మూలనకు ఎకరానికి 400 మి.లీ క్విజాల్ ఫాప్ ఇథైల్ 5% లేదా 250 మి.లీ. ఫెనాక్సాఫాప్ ఇథైల్ 9% ద్రావకం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Also Read: మిరప చీడపీడల – యాజమాన్య పద్ధతులు