Aquatic Weed Management: ప్రస్తుత కాలంలో చేపల చెరువుల్లో సహజంగా పెరిగే ఆహారమైన వృక్ష, జంతు ప్లవకాల పెరుగుదల కోసం, భూసార, నీటి పరీక్షలు చేసుకోకుండా ఎక్కువ మోతాదులో సేంద్రీయ, రసాయన ఎరువులు వాడటం వల్ల, ఇంకా ఎరువులు వాడిన పంటపొలాల్లోని నీరు అధిక వర్షాల కారణంగా చెరువుల్లోనికి చేరడం వలన, నీటిలోని కలుపు మొక్కలు ప్లాంక్టన్ బ్లూమ్ ఏర్పడడానికి కారణం అవుతుంది. సహజంగా కొన్ని రకాల నీటి మొక్కలు, ప్లాంక్టన్ పరిమితంగా అభివృద్ధి చెందడం వలన చెరువు ఆవరణం సమతుల్యంగా ఉండి, నీటి గుణాలు ఒక్కసారిగా మార్పు చెందకుండా ఉంచడానికి తోడ్పడతాయి. కానీ ఈ కలుపు మొక్కలు, ఆల్గే ఎక్కువగా పెరగడం వలన నీటిలోని, భూమిలోని పోషకాలు చేపలకు ఆహారంగా ఉండే ప్లవకాలకు అందుబాటులో ఉండకుండా పోతాయి. దీని ద్వారా చేపల పెరుగుదల మందగించి, ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితోపాటు చేపలు స్వేచ్ఛగా తిరుగాడే వీలు లేకపోవడం, సూర్యరశ్మి నీటిలోకి వెళ్ళకుండా అడ్డంగా ఉండడం వలన సడన్‌గా ఆక్సిజన్ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది. ఇంతే కాకుండా పట్టుబడి సమయంలో కూడా వలలకు అడ్డు తగలడం వంటి ఇబ్బందులు వస్తాయి.
చేపల చెరువులో కలుపు మొక్కల రకాలను చూస్తే, తేలియాడే రకాలైన పిస్టియా, ఐకార్నియా, నీటిలో వేళ్లతో ఉండి తేలియాడే రకాలయిన, తామర, కలువ వంటివి, పూర్తిగా మునిగి ఉండే హైడ్రిల్లా, వాలిస్నేరియా రకాలు చెరువు అంచుల వెంబడి పెరిగే ఐపోమియా, టైఫా వంటి రకాలు ముఖ్యమైనవి. ఈ కలుపు మొక్కల ఉద్రితిని బట్టి వాటి నివారణకు యాంత్రిక, రసాయన, జీవ సంబందమయిన పద్దతులు చేపట్టుకోవాలి. సాధారణంగా చెరువులో ఉండే కలుపు మొక్కలు సాంద్రత, అవి వ్యాపించి ఉండే విస్తీర్ణాన్ని బట్టి మనుషులతో గానీ యాంత్రికంగా చైన్లు తాళ్లతో కూడిన వలతో ఒకవైపు లాగించి తీసేయడం ద్వారా తగ్గించుకోవచ్చు. చెరువు అంచుల వెంబడి పెరిగే కలుపు మొక్కలను తరచూ కూలీల సాయం తో కత్తిరించుకోవడం ద్వారా వాటి పెరుగుదలను నియంత్రించే పోవచ్చు. తేలియాడే రకాలైన పిస్టియా, ఐకార్నియా వంటి వాటి ఉధృతి ఎక్కువగా ఉంటే కూలీల ద్వారా గాని చైన్ ల ద్వారా గానీ తీయడం వీలుకాని పరిస్థితుల్లో ఉదృతిని బట్టి హెక్టారుకు రెండు నుంచి ఏడు కేజీల 24 సోడియం సాల్ట్‌ను 0.1 శాతం డిటర్జెంట్ తో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఒక వారం రోజుల్లో కలుపు మొక్కలు ఒక్కసారిగా చనిపోతాయి. ఈ చనిపోయిన కలుపు మొక్కలు అడుగునకు చేరి, కుళ్లడం ద్వారా నీరు పాడయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ రకమైన కలుపు మందులను విడతలవారీగా ఒక వారం వ్యవధిలో వాడుకోవాలి. ఈ కలుపు మందులు పిచికారీ చేసిన నాలుగు రోజుల తర్వాత ఒక్కసారిగా ప్రాణవాయువు తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎకరాకు 10`15 కేజీల కాల్షియమ్ పెరాక్సైడ్‌ను వాడుకుని ఆక్సిజన్ ప్రాబ్లం నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
Also Read: Tobacco Weed Management: పొగాకులో కలుపు యాజమాన్యం.!
నీటిలో పూర్తిగా మునిగి ఉండే రకాల మొక్కలయిన హైడ్రిల్లా, వాలిస్నేరియా వంటి జాతులు ఎక్కువగా ఉన్నట్లయితే కాపర్ సల్ఫేట్‌ను 4-6 కేజీల మట్టిలో కలిపి వెదజల్లుకుంటే 7 నుండి 10 రోజుల్లో ఈ మొక్కలు చనిపోతాయి, వాటిని మనుషులతో తొలగించుకోవచ్చు.
జీవ సంబంధమైన నివారణ పద్ధతులు విషయానికి వస్తే చెరువుల్లో గడ్డి, నాచుతో పటు ఇతర రకాల మొక్కలను తినే గడ్డి చేప, కామన్ కార్ప్ వంటి రకాలను ఎక్కువ సంఖ్యలో వేసుకుంటే ఈ కలుపు మొక్కలను తిని ప్రాథమిక దశలోనే పెరగకుండా ఆపేస్తాయి. చెరువుల్లో చేపలతోపాటు రైతులు హెక్టారుకు 10 నుండి 15 బాతులను పెంచుకోవడం ద్వారా కూడా ఈ కలుపు మొక్కలను ప్రాథమిక దశలో తగ్గించుకోవచ్చును.
ఈవిధంగా కలుపు మొక్కల తో పాటు వృక్ష ప్లవకాలు నాచు ఎక్కువగా పెరిగి, ముద్దలుగా, కానీ చాపలు గా బంతులు రూపంలో గానీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితులను ‘‘ప్లాంక్టన్ బ్లూమ్’’ అంటాము. ఈ పరిస్థితులు ఫిలమెంట్ ఆల్గే జాతులైన స్పైరులినా, ఫైటోస్పోరా వంటి జాతులు చెరువు అంతా వ్యాపించి నష్టాన్ని కలిగిస్తాయి. వీటితో పాటు నీలి రంగులో ఉండే మైక్రోసిస్టిస్ అనే జాతులు పెరగడం వలన ప్లాంక్టన్ బ్లూమ్ ఏర్పడడానికి కారణం అవుతూ ఉంటుంది. వీటి సాంద్రత ఎక్కువైతే ఇవి విడుదల చేసే మైక్రోసిస్టిన్ అనే విష పదార్థం వల్ల చేపలు ఆహారాన్ని తీసుకోకుండా ఉండి పెరుగుదల మందగిస్తుంది.
ఈ ప్లాంక్టన్ బ్లూమ్ పరిస్థితుల్లో రాత్రి సమయంలో ఎక్కువ సాంద్రత లో ఉన్న ప్లవకాలు అందుబాటులో ఉన్న ఆక్సిజన్నువినియోగించుకుంటాయి. అందువల్ల ఆక్సిజన్ లోప పరిస్థితులు ఏర్పడి ప్లాంక్టన్ ఒక్కసారిగా చనిపోవడం గమనిస్తూ ఉంటాం. ఈ పరిస్థితులను ‘‘ప్లాంక్టన్ క్రాష్’’ అని అంటాము. ఇలాంటి సమయాల్లో అమోనియా పరిమాణం పెరగడం ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవడం వలన చేపలు అధిక సంఖ్యలో ఒక్కసారిగా చనిపోవడం జరుగుతుంది. అందుచేత ఈ ప్లాంక్టన్ బ్లూమ్ లేదా క్రాష్ పరిస్థితులను గమనించుకుని ఎరువుల వాడకాన్ని మేతల వాడకాన్ని ఆపివేసి వాటి పెరుగుదలను స్థిరీకరించుకోవాలి.
ఈ ఫిలమెంటస్ ఆల్గే లేదా నాచు నివారణకు 1 %జూజూఎ% కాపర్ సల్ఫేట్ అంటే ఎకరాకు మూడు నుండి నాలుగు కేజీల చొప్పున నీటిలో కలిపి వెదజల్లుకుని నివారించుకోవచ్చు. ఈ ప్లాంక్టన్ బ్లూమ్ వున్న చెరువు నీరు సాధారణంగా ఆల్కలైన్ స్థితిలో ఉంటే (అనగా పిహెచ్ 8 కన్నా ఎక్కువ) ఈ పరిస్థితుల్లో కాపర్ సల్ఫేట్ మోతాదును పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మైక్రోసిస్టిస్ వల్ల ఏర్పడిన బ్లూమ్‌లు నీలి ఆకుపచ్చ రంగులో ఏర్పడి, గాలివాటుగా ఒకవైపుగా చేరి నీలి ఆకుపచ్చ పెయింట్ వేసినట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితులను గమనించుకుని సిమజినే అనే మందును 0.3 మోతాదులో వాడడం వలన 7 నుండి 10 రోజులలో నివారించుకోవచ్చును.
ఈ విధంగా చెరువులోని నీటి, మట్టి లో ఉండే పోషక పదార్థాలను పరీక్షించుకుని వాటి ఆధారంగా ఎరువుల మోతాదు నిర్ణయించుకోవడం, చెరువుల అంచుల వెంబడి లోతు చేయడం, బయట నుండి తేలియాడే మొక్కలు రాకుండా ఇన్‌లేట్‌ల వద్ద అమర్చుకోవడం ద్వారా కలుపు మొక్కల పెరుగుదలను నివారించుకోవచ్చును. చేపల రొయ్యల చెరువులలో కలుపు మొక్కలు పెరగకుండా నివారణ చర్యలు చేపట్టడం, వాటి కంట్రోల్ పద్ధతులపై రైతులు అవగాహన కలిగి ఉంటే పంటకాలంలో చేపల పెరుగుదల బాగా ఉండి అధిక దిగుబడులు సాధించి అధిక ఆదాయం పొందవచ్చు.
-డా. సి హెచ్. బాలకృష్ణ, మత్స్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళడా.9440792616
Also Read: Oilseed Crop Weed Management: నూనె గింజల పంటలో కలుపు యాజమాన్యం ఎలా చేపట్టాలి?
Must watch: