Weed Management in Direct Seeded Paddy: తెలుగు రాష్ట్రాలలో వరి ప్రధానమైన పంట. తెలంగాణ రాష్ట్రంలో 2021-22 వ్యవసాయ సంవత్సరం వానాకాలంలో 61 లక్షల ఎకరాలలో సాగుచేయబడి దాదాపు 1. 6 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడిని సాధించినది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వలన నీటి కొరత లేనందున వరి దిగుబడులు సగటును మించి రావడం పరిగణించాల్సిన అంశం. నారు మడిలో సస్య రక్షణ రసాయణాల ఖర్చులు, పెరుగుతున్న దుక్కి ఖర్చులు,నాటే అపుడు కూలీలా కొరత తద్వారా పెరిగే సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని రైతులు నేరుగా విత్తే పద్దతిని ఆదరిస్తున్నారు. ఈ పద్ధతి పాటించడం వలన రైతులకు దుక్కి, నారు మడి మరియు ప్రధాన పొలంలో నాటు వేసే ఖర్చులు తగ్గడం వలన వరి సాగు మీద దాదాపు 10,000/- నుండి 12,000/- వరకు ఆదా అవుతున్నాయి.

Weed Management in Direct Seeded Paddy
ఈ పద్దతిలో నారుమడి పెంచే పనిలేకుండా రైతులు మండె కట్టిన 24 గంటల తరువాత, ముక్కు పగిలిన వరి గింజలను దమ్ము చేయకుండా, ప్రధాన పొలాన్ని ఒకటి లేదా రెండు సార్లు దున్ని చదును చేసిన పొలంలో నాగలి చాలులో లేదా గొర్రుతో వరుసలలో నేరుగా విత్తుకోవాలి. ఈ పద్దతిలో జూన్ 10 నుండి జులై 10 లోపు విత్తుకోవడం మంచిది. దమ్ము చేయనందున కలుపు సమస్య, సుడిదోమ నష్టం అధికంగా ఉంటుంది. సకాలంలో కలుపు,చీడ పీడలను నివారించకపోతే దిగుబడులు 20-50% తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Paddy Cultivation: వరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు.!
కలుపు యాజమాన్యం :
1. విత్తిన 3-4 రోజుల లోపల ప్రేటిలాక్లోర్ మందును సఫనర్ తో కలిపి 600-800 మిల్లి లీటర్లు ఎకరాకు సరిపడు 200 లీటర్ల నీటితో కలిపి ద్రావణం చేసుకుని పిచికారీ చేసుకోవాలి.
2. ప్రేటిలాక్లోర్ అందుబాటులో లేకపోతే పైరజోసల్ఫ్యురాన్ 80 గ్రాములు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.
3. విత్తిన 10 రోజులలోపు కలుపు లేకుండా తరువాత కలుపు ఉదృతి పెరిగితే, విత్తిన 10-15 రోజులలోపు గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు సైహలోఫప్ బ్యూటైల్ 250-300 మిల్లి లీటర్లు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ గడ్డి మరియు తుంగ జాతి కలుపు మొక్కలు ఉన్నట్లైతే 800-1000 మిల్లి లీటర్ల ఫెనాక్యులమ్ మరియు సైహలోఫప్ బ్యూటైల్ ఫార్ములేషన్ గల కలుపు మందును ఎకరాకు 800-1000 మిల్లీ లీటర్లు పిచికారీ చేసుకోవచ్చు.

Paddy Fields
4. వరి విత్తిన 20-25 రోజుల సమయంలో, కలుపు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నపుడు అజీమ్ సల్ఫ్యూరాన్ మందును ఎకరాకు 28 గ్రాములు లేదా బిస్ పైరిబ్యాక్ సోడియం 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఇది గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపు మొక్కలను సమర్ధవంతంగా అదుపు చేస్తుంది.
5. విత్తిన తరువాత వరి ఏ దశలో ఉన్నా1 లీటర్ 2,4 డి ఈథైల్ ఎస్టర్ ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.
గమనిక : కలుపు మందుల సమర్ధవంతంగా పనిచేయడానికి పిచికారి ఒక రోజు ముందు వరి పొలానికి ఉదయం నీరు కట్టి సాయంత్రం తీసివేసి ఆ తరువాత రోజు కలుపు మందును పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసిన మరొక 24 గంటలు నీరు పెట్టకుండా మరుసటి రోజు మాత్రమే పొలానికి నీరు పెట్టాలి. పై పద్ధతులు పాటించి రైతులు 35-40 రోజుల వరకు కలుపును సమర్ధవంతంగా అదుపు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చు.
Also Read: BPH Management in Direcr Seed Paddy: నేరుగా విత్తిన వరి పొలంలో సుడి దోమ యాజమాన్యం.!