Vermi Compost: సాధారణంగా గ్రామాల్లో రైతులు పశువుల పేడను, వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలను కుప్పలుగా వేస్తారు. ఇలా చేయడం వలన అవి ఎండకు ఎండి, వానకు తడిసి సహజ పోషకాలను చాలావరకు కోల్పోతాయి. కాబట్టి ప్రత్యామ్నాయంగా సేంద్రీయ వ్యర్ధ పదార్ధాలను గుంటలో సేకరించి వీటిలోనికి ప్రత్యేకమైన వానపాములను ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే ఎరువునే వానపాముల ఎరువు (Vermi Compost) లేదా వర్మి కంపోస్టు అంటారు.
మాములుగా తయారుచేసే ఎరువు కన్నా వర్మి కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా వర్మి కంపోస్టులో నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ వంటి పోషకాలు సరాసరిన 1.23 నుండి 2.40, 0.67 నుండి 1.93 మరియు 0.35 నుండి 0.63 శాతం వుంటాయి (వేసిన వ్యర్థ పదార్థంపై ఆధారపడి వుంటాయి). ఇదే విధంగా వర్మి కంపోస్టులో పైరు ఎదుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రీయ రసాయనాలు ఉన్నాయి.
వర్మి కంపోస్టు యొక్క విశిష్టత ఏంటి ?
మాములుగా తయారుచేసే ఎరువు కన్నా వర్మి కంపోస్టులో గుణాలున్నాయి. ముఖ్యంగా వర్మి కంపోస్టులో
నత్రజని – 1.23 %
ఫాస్ఫేట్ – 2.40 %
పొటాష్ – 0.67-1.93 %
జ/చీ నిష్పత్తి – 11.64
సేంద్రీయ పదార్ధాలు – 20.46 %
సేంద్రీయ కర్బనం – 11.88 %
వంటి పోషకాలతో పాటు వర్మి కంపోస్టులో పంట ఎదుగుదలకు దోహదపడే ఇతర సేంద్రీయ రసాయనాలు ఉన్నాయి.
వర్మీ కంపోస్టును ఎలా తయారు చేసుకోవాలి?
వర్మీ కంపోస్టు తయారీకి అవసరమైనవి :
1. వానపాములు
భూమిపై పొరలలో ఉంటూ బొరియలు చేయని వానపాములు సేంద్రీయ వృద్ధి పదార్ధాల నుండి కంపోస్టు చేయడానికి పనికి వస్తాయి. చదరపు మీటరుకు 1000 (1 వీ) చొప్పున ఒక టన్ను వర్మీ కంపోస్టు తయారు చేయడానికి సుమారు 3000 (3-వీ) వానపాములు అవసరం అవుతాయి. ఇవి
1. యూడ్రిలన్ యుజీనిఏ, 2. అయిసీనియా ఫొయిటిడా, 3. పెరియానిక్స్ ఎక్స్ కవేటస్
2. సేంద్రీయ తేమ వ్యర్థ పదార్థాలు :
వ్యవసాయ మిగుల వ్యర్థ పదార్ధాలు, ముఖ్యంగా చెత్త, ఎండిపోయిన ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్ధాలు వర్మి కంపోస్టు తయారీకి ఉపయోగపడతాయి. ఒక టన్ను వర్మీ కంపోస్టు తయారీకి 2 టన్నుల వ్యర్థ పదార్థాలు అవసరం అవుతాయి.
3. ఇతర అవసరాలు : వానపాములు ఎండను తట్టుకోలేవు. కాబట్టి వాటి రక్షణ కొరకు తగిన నీడను కల్పించాలి.
Also Read: ప్రత్తితీత అనంతరం గులాబీ రంగు కాయ తొలిచే పురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
షెడ్ నిర్మాణం : తూర్పు – పడమర దిశలో ఉండే విధంగా ఏటవాలుగా నిర్మించాలి.
బెడ్ తయారీ : 8 మీ. పొడవు, 3 మీ. వెడల్పు 2 అడుగుల ఎత్తు ఉండే విధంగా నాపరాయితో నేల పైన బెడ్ ఏర్పరచుకోవాలి. బెడ్ అడుగుభాగాన్ని మూడు అంగుళాల మందంతో గడ్డి లేదా ఇసుక లేదా మట్టి నింపి తగినంత నీటితో తడిపి గట్టిపరచాలి.
బెడ్ నింపే పద్ధ్దతి:
మొదటి పొర: 2,3 అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలు నింపి, వాటి పైన పేడనీటిని చిలకరించాలి.
రెండవ పొర: పశువుల ఎరువు, వ్యవసాయ వ్యర్థాలు కలిసి చివికిన పదార్ధాన్ని 6 అంగుళాల మందంతో బెడ్ అంతటా సమానంగా తగినంత నీటితో తడిపి ఉంచాలి. అందువల్ల నెమ్మదిగా కుళ్ళి మెత్తగా తయారవుతుంది. ఇలా 20-25 రోజుల (3వారాలు) నీటితో తడపాలి. ఆ తరువాత వానపాములను ప్రవేశపెట్టాలి.
వానపాములను వదిలిన బెడ్‌లపై ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతుండాలి. ఈ విధంగా చెయ్యటం వలన వ్యర్ధ పదార్ధాలను 60 నుండి 90 రోజుల్లో వర్మి కంపోస్టుగా తయారుచేసే వీలుంది.
వర్మి కంపోస్టు తయారైనది లేనిది తెల్సుకోవటమెలా?
1. గుళికలు ఉండి తేలికగా ఉంటుంది.
2. వానపాములు ఉండలుగా చుట్టుకొని ఉంటాయి. వర్మీ కంపోస్టు గోధుమ నుండి నల్ల రంగుకు మారుతుంది.
3. వర్మీ కంపోస్టు వాసనరాదు.
4. రంగు రూపు మారిన వర్మి కంపోస్టు గమనించిన వెంటనే బెడ్ తడపడం ఆపేయాలి. నాలుగు రోజుల తరువాత బెడ్లో గల పదార్థాలను కుప్పగా చేసి ఉంచాలి. ఇందువలన వానపాములు బంతిలా చుట్టుకుని కుప్పలోని అడుగుభాగానికి చేరుకుంటాయి. మెత్తగా పైన ఉన్న వర్మీ కంపోస్టు జల్లెడ లేదా జల్లించే మిషను ద్వారా జల్లించి ఆరబెట్టి సంచులలో నింపాలి.
వర్మి కంపోస్టు వాడే విధానం-మోతాదు :
- పండ్లు, కూరగాయలు, పూల తోటలలో వర్మీ కంపోస్టును మొక్క మొదలులో వేసి దానిపై మట్టితో కప్పి పలుచగా నీళ్లు ఇవ్వాలి.
- పంటలు : 3-4 టన్నులు/హెక్టారుకు వేయాలి.
- పండ్ల తోటలు : ప్రతిచెట్టుకు 5 – 10 కిలోలు వేయాలి.
- పూల తోటలు : ఎకరానికి 200 – 300 కిలోలు, గులాబీ మొక్కకి ఒక్కింటికి 200 – 300 గ్రా. వేయాలి. వర్మి కంపోస్టును వినియోగించడం వల్ల కలిగే లాభాలు: వర్మి కంపోస్టును పంటలపై వినియోగించడం వల్ల దానిలో ఉండే మిత్ర సూక్ష్మజీవులు భూమిలో అభివృద్ది చెంది అక్కడ వాటి సంఖ్యను పెంచుకుంటూ నిర్జీవ భూములు నుంచి జనసహిత భూములుగా చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.
1. వర్మి కంపోస్టులో మొక్కకు అవసరమయ్యే అన్ని రకాల స్థూల సూక్ష్మపోషక పదార్థాలు కావాల్సిన మోతాదుల్లో లభ్యమవుతాయి. పోషక పదార్థాలు పుష్కలంగా అందడం వల్ల వర్మి కంపోస్టు వాడి సాగు చేసిన వంటలు ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి.
2. దీని వల్ల ఆయా పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే సస్యరక్షణ కొరకు వాడే మందుల వాడకం తగ్గుతుంది.
3. వర్మి కంపోస్టులో సహజమైన హార్మోన్లు, విటమిన్లు లభిస్తాయి. వీటిని భూమిలో కలిపినప్పుడు పెరుగుతున్న మొక్కల వేర్ల పెరుగుదల, మొక్క బాహ్య అంతర లక్షణాలలో గణనీయమైన అభివృద్ధి జరిగి మొక్కలు బలంగా పెరుగుతాయి.
4. వర్మి కంపోస్టును ఉపయోగించి పండిరచిన పంటలు కోసిన తరువాత తాజాగా ఉండి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. వర్మీ కంపోస్టును వాడటం వల్ల స్వాభావిక పర్యావరణ కాలుష్యం అవకుండా ఉంటుంది.
వానపాముల ఎరువు తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
5. బెడ్లలో ప్లాస్టిక్ పదార్థాలను గానీ, గాజు ముక్కలు రాళ్ళు, కోడిగుడ్ల పెంకులు గానీ ఉండరాదు.
6. బెడ్ పైన పక్షులు, ఉడతలు, తొండలు, ఎలుకలు ఆశించి వానపాములను తినకుండా గడ్డితో లేదా జాలితో లేదా గోనెతట్టుతో బెడ్లను అడుగు మందం కప్పాలి.
7. వర్మి కంపోస్టు షెడ్ చుట్టూ జాలి కట్టి కాకులు గద్దలు, కొంగలు, పాములు, ఎలుకలు రాకుండా చూసుకోవాలి.
8. బెడ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
డి.విజయ రాణి, అగ్రనామి – శాత్రవేత్త
ఎం.అనురాధó, పి.సి, కెవికె- కందుకూరు
Also Read: కుక్కల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?