Use Of Neem in Agriculture: భారతదేశం లో ఎంతో ప్రాధాన్యత ఉన్న వృక్షం వేప. వేప వృక్షం లోని అన్ని భాగాలు ఉపయోగపడేవే. వేపని ఆయుర్వేద మందుల్లో , కొన్ని సౌందర్య ఉత్పత్తుల తయారీలోనే మాత్రమే కాక, క్రిమి సంహరక గుణం ఉన్నందున వివిధ పంటలనాశించే చీడపీడల నియంత్రణకి వాడతారు. పంటలనాశించే చీడపీడలని నియంత్రించడానికి సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించితే చీడపీడల ఉధృతి తక్కువగా ఉండి , రసాయనిక పురుగు,తెగుళ్ల మందుల వాడకం తగ్గుతుంది. వృక్ష సంబంధ మందులలో వేప ప్రధానమైనది. ఇతర రసాయన మందులతో పోలిస్తే , వేప మందుల వల్ల పర్యావరణానికి , క్షీరదాలకు, తేనెటీగలకి, మిత్రపురుగులకి హాని కలగదు. వేపచెట్టు అన్ని భాగాలు క్రిమిసంహారక స్వభావం కలిగిఉండి దాదాపు 200 రకాల పురుగులను అదుపులో ఉంచగలదు.
వేపలోని వివిధ భాగాలు -సస్యరక్షణలో వాటి ఉపయోగం
వేప ఆకులు : ధాన్యం నిలువ చేసే బుట్టలు, గాదెలు అలకడానికి వాడే మట్టి-పెండ మిశ్రమంలో వేపాకులు కలిపినట్లైతే , వాటిని నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులు (Stored Grain Pests) తక్కువగా ఆశిస్తాయి. గృహావసరాలకు వాడుకునే ధాన్యం అయితే కిలోకి 5 గ్రాముల వేపాకు పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి.
Also Read: ఎండుతున్న వేపకు నీరే మందు
వేపగింజలు :సేకరించిన వేప గింజలను పొడి చేసుకొని 5% వేపగింజల కషాయం పురుగుల తొలిదశల్లో.పిచికారీ చేసినట్లైతే వాటి సంతతిని అలాగే ఉధృతిని తగ్గించవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న, కంది, పెసర, మినుము, ప్రత్తి,వేరుశెనగ లాంటి పంటల్లో ఆకులను కొరికి తినే పురుగులు ఆశించినపుడు గుడ్లు మరియు పిల్లపురుగులు ఎక్కువగా ఉంటే 5% వేపగింజల కషాయం బాగా పనిచేస్తుంది.దీన్ని పత్తిలో రసం పీల్చే పురుగులకి కూడా పిచికారీ చేయవచ్చు. ధాన్యం నిల్వ చేసే సంచులను 10% వేపగింజల కషాయంలో 15-30 నినిషాలు నానబెట్టి ఆరిన తరువాత వాడుకుంటే పురుగులు తక్కువగా ఆశిస్తాయి.
వేపగింజలు :సేకరించిన వేప గింజలను పొడి చేసుకొని 5% వేపగింజల కషాయం పురుగుల తొలిదశల్లో.పిచికారీ చేసినట్లైతే వాటి సంతతిని అలాగే ఉధృతిని తగ్గించవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న, కంది, పెసర, మినుము, ప్రత్తి,వేరుశెనగ లాంటి పంటల్లో ఆకులను కొరికి తినే పురుగులు ఆశించినపుడు గుడ్లు మరియు పిల్లపురుగులు ఎక్కువగా ఉంటే 5% వేపగింజల కషాయం బాగా పనిచేస్తుంది.దీన్ని పత్తిలో రసం పీల్చే పురుగులకి కూడా పిచికారీ చేయవచ్చు. ధాన్యం నిల్వ చేసే సంచులను 10% వేపగింజల కషాయంలో 15-30 నినిషాలు నానబెట్టి ఆరిన తరువాత వాడుకుంటే పురుగులు తక్కువగా ఆశిస్తాయి.
వేపపిండి : వేపపిండిని ఆఖరిదుక్కిలో వేసి కలియదున్నినట్లయితే ప్రధాన పొలంలో నష్టం కలుగజేసే పురుగులు,తెగుళ్లు,నులిపురుగులను నియంత్రించవచ్చు. ముఖ్యంగా మిరపలో నులిపురుగులు,వేరు పురుగు, పసుపుతో దుంప ఈగ ల ఉధృతి తగ్గించవచ్చు. వరిలో కాండం తొలుచు పురుగు,ఆకుముడత పురుగులను నివారించడానికి ఎకరాకు సరిపడా యూరియాకి 10 కిలోల వేపపిండి కలిపి చల్లాలి. ప్రత్తిలో ఎకరానికి 10 కిలోల వేపపిండి చల్లితే కాండం ముక్కు పురుగుని నివారించవచ్చు. చీని , నిమ్మ తోటల్లో నులిపురుగులను నివారించడానికి ఒక్కో మొక్కకి 15 కిలోల వేపపిండిని వాడాలి.
వేపనూనె : వేపగింజల నుండి తీసే వేపనూనె క్రిమి సంహరక గుణం కలిగి ఉంటుంది. దానిలో ఉండే ఆజాడిరక్టిన్ శాతంను బట్టి వివిధ గాఢత లలో దొరుకుతుంది. పెసర,మినుము ,కంది పంటలో కాయతొలుచుపురుగులపై, పత్తిలో కాయతోలుచు మరియు రసం పీల్చు పురుగులపై 1500 PPM గాఢత ఉన్న వేపనూనె ని 5 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. జామలో తెల్లసుడిదోమ నివారణకు, మామిడి కాయతోలుచు పురుగు నివారణకి 10000 PPM గాఢత ఉన్న వేపనూనె ను 3 మి. లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వేపమందులు పనిచేసే విధానం :
వేపమందులు వికర్షకాలుగా పనిచేసి తల్లిపురుగులు గుడ్లుపెట్టకుండా, అలాగే పిల్ల,పెద్దపురుగులు చేరకుండా చేస్తాయి. వేపమందు పిచికారీ చేసిన మొక్కలను పురుగులు సరి తినలేవు, తిన్నా సరిగా జీర్ణించుచుకోలేక పెరుగుదల తగ్గడమే కాక, నిద్రావస్థకు వచ్చేముందు లేదా నిద్రావస్థలో చనిపోతాయి. ఒక వేళ పెద్దపురుగుల దశకు చేరుకున్నా కూడా బాహ్య చర్మం సరిగ్గా అభివృద్ధి చెందక సులువుగా చనిపోతాయి. తల్లిపురుగుల్లో గుడ్లు పెట్టె శక్తి తగ్గిపోతుంది. వేపమందులు పిచికారీ చేసినపుడు పురుగులు 3 -14 రోజులలో చనిపోతాయి.
వేపమందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
వేపమందులని వీలైనంత వరకు ఉదయం పూట లేదా సాయంత్రం పూట పిచికారీ చెయ్యాలి.ఎండలో పిచికారీ చేస్తే అతినీల లోహిత కిరణాల వల్ల వాటి పనితనం తగ్గుతుంది.పంట తొలిదశలో అలాగే పురుగు ఆశించిన తొలిదశల్లో వేపమందులు సమర్థవంతంగా పనిచేస్తాయి.వేపగింజల కషాయాన్ని నిల్వ ఉంచుకున్న గింజలనుండి ఎప్పటికప్పుడు తయారుచేస్కోవాలి.లేదంటే వాటిలో ఉన్న అజాడిరక్టిన్ శాతం తగ్గి, కషాయం సమర్థవంతంగా పనిచేయదు.వేపగింజల కషాయం లేదా వేపనూనె మందు ద్రావణం సర్ఫ్ పొడిని కలిపి పిచికారీ చేసినపుడు మొక్క భాగాలకు మందు ద్రావణం బాగా అతుక్కొని సమర్థవంతంగా పనిచేస్తుంది.
Also Read: వేపనూనెతో మొక్కలకు ఎంతో మేలు..