Troublesome Weeds – ఊద:- తెలుగు రాష్ట్రాలలో వరి ప్రధానమైన పంట. అందువలన ఊద అన్నింటికన్నా సమస్యాత్మకమైన కలుపు మొక్క దీని శాస్త్రీయ నామం ఎకినోక్లోవా కోలోన. ఊద వరిలో కాక, నీరు తక్కువగా ఉన్నప్పుడు ఆరు తడి చేసే భూములలో, మాగాణి అపరాలలోను, పండ్ల తోటలలోను, ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా దుబ్బుల వలె ఉండి 60 నుండి 120 సెం. మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. మొలిచిన 6 వ రోజు నుండి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తన ఆహారం తానే తయారుచేసుకొని చాలా వేగంగా పెరిగి పైర్లను అణగద్రోక్కుతుంది.
ఒక్కొక్క మొక్కనుండి సరాసరి 110 విత్తనాలు వస్తాయి. ఊద మొక్క చిన్నగా ఉన్నపుడు వరిమొక్కకు, ఊద మొక్కకు తేడా కనుక్కోవడం చాలా కష్టం. మనుషులతో తీయించటానికి ఖర్చు చాలా ఎక్కువ. కొన్ని సందర్బాలలో ఊద కారణంగా పోసిన నారును రైతులు విడిచిపెట్టడం మనం చూస్తున్నం.
ఈ మొక్క పశు గ్రాసానికి ప్రత్యేకించి పూతకు ముందు బాగా ఉపయోగపడుతుంది. దీని నిర్మూలించుటకు పూర్తిగా నీటిలో మునిగేటట్లు ఉంచితే చాలా వరకు చనిపోతుంది. కాబట్టి వరిమగాణి పోలల్లో పొలం దమ్ము చేసి నీటిలో నిలకట్టితే దీని ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ ఊదను రసాయన పద్దతి ద్వారా అతి తక్కువ ఖర్చుతో నిర్మూలించవచ్చు.
వరి నారుమడిలో:- నారుమడిలో విత్తిన రెండు, మూడు రోజులలో ఎకరాకు నారుమడికి 400 మీ. లీ అనిలోఫాస్ 30% ద్రావకం లేదా 400 మీ. లీ. ప్రిటిలాక్లోర్ 50% ద్రావకం లలో ఏదో ఒక దానిని 200లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మందు స్ప్రే చేయడం కుదరనపుడు పైరు విత్తిన 15 రోజున ఎకరం నారుమడికి 400మీ. లీ సైహాలోఫాప్ బ్యూటైల్ 10% ద్రావకం 200 మీ. లీ. నీటిలో కలిపి స్ప్రే చేయాలి.
Also Read: Solid Materials Decomposition: నిలువ పదార్ధాలు చెడిపోవుటలో సూక్ష్మ జీవుల పాత్ర.!
వరినాటిన వెంటనే:- మాగాణి వరిలో ఊద వస్తున్నపుడు వరినాటిన 3 నుండి 5 రోజులలోపు ఎకరానికి 400 మీ. లీ. అనిలోఫాస్ 30% ద్రావకం లేదా 35-50 గ్రా. ఆక్సడయార్జల్ 80% పొడి మందును లేదా 80 గ్రా. పైరజోసల్పురాన్ ఇథైల్ 10% పొడిమందులలో ఏదో ఒక దానిని మందుగా ½ లీ. నీటిలో కలుపుకొని ఆ ద్రావణాన్ని 20 కిలోల పొడి ఇసుకతో కలిపి పొలం అంతా సమానంగా వెదజల్లాలి.
మందు చల్లునపుడు పొలంలో 2.3 సెం. మీ నీరు నిలవ ఉండాలి. మందు చల్లిన తర్వాత 2,3 రోజుల వరకు పొలంలో నీటిని బయటకు , బయట నీటిని లోపలకు పోకుండా చూడాలి లేదా మాగాణి వరి నాటిన 15 రోజులపుడు పొలంలో నీరు తీసి ఎకరాకు 400 మీ. లీ. సైహాలోఫాప్ బ్యూటైల్ 10% ద్రావకం 200. లీ నీటిలో కలిపి స్ప్రే చేయాలి.
జొన్న మల్లె:- దీని శాస్త్రీయనామం స్ట్రైగా ఎషియాటికా. ఇది ముఖ్యంగా జొన్న, సజ్జ , రాగి, మొక్కజొన్న పైర్లలో వస్తుంది. ఇది పైరు మీద జీవించే పాక్షిక పరన్నాజీవి. జొన్న పైరుకు ఎక్కువ నష్టం కలుగుతుంది. దీని విత్తనోత్పత్తి శక్తి చాలా ఎక్కువ. కనుక ఈ మొక్కలను పుష్పించక ముందే నిర్మూలించాలి.
దీని నిర్మూలనకు పలు ప్రదేశాలలో జరిగిన పరిశోధనలలో 2,4-డి సోడియం సాల్ట్ 80% పొడిమందు ఎకరాకు 400 గ్రా. చొప్పున జొన్న విత్తిన 30 రోజుల తర్వాత ఒకసారి ,70 రోజుల తర్వాత మరలా రెండవసారి 200 లీ. నీటిలో కలిపి స్ప్రే చేయుటవలన పూర్తిగా నిర్మూలించవచ్చని తేలింది. లేదా పంటమార్పిడి చేయుట మంచిది.
Also Read: Pests of Mulberry Plants: మల్బరీని ఆశించే పురుగులు – నివారణ