తెలుగు రాష్ట్రాల్లో పండించే వివిధ రకాల వాణిజ్య పంటల్లో మిరప ప్రధానమైంది. మిరపను ప్రధానంగా పచ్చి మిరప, ఎండు మిరప కోసం వివిధ రకాల హైబ్రీడ్స్ ను సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్టంలో 85 వేల హెక్టార్లలో సాగుచెస్తూ, 3.28 లక్షల టన్నుల మిరప దిగుబడిని సాధిస్తున్నారు. వివిధ రకాల మిరపను ముఖ్యంగా జూలై, ఆగష్టు మాసంలో నారు పోసి, ఆగష్టు లేదా సెప్టెంబర్ మాసంలో నాటుతారు. ఈ నేపథ్యంలో మిరప సుమారుగా జూలై నుంచి మార్చి, ఏప్రిల్ వరకు ఉండటం వల్ల వివిధ రకాల వాతావరణ పరిస్థితులకు గురవుతుండడంతో పలు రకాల పురుగులు, తెగుళ్ళు ఆశించి నష్టపరుస్తుంటాయి. ప్రస్తుతం మారుతున్నవాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరగడం ద్వారా వివిధ రకాల వైరస్ తెగుళ్లు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా జెమిని వైరస్ ఉధృతి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మిరపను ఆశించే వైరస్ తెగుళ్ళు, యాజమాన్య పద్దతుల గురించి తెలుసుకుందాం.
మిరపను ఆశించే ప్రధాన చీడపీడల్లో వైరస్ తెగుళ్ళు ముఖ్యమైనవి. మిరపలో మూడు రకాల వైరస్ తెగుళ్ళు ప్రధానంగా ఆశిస్తాయి. అందులో మొదటిది జెమిని వైరస్ (ఆకు ముడత), రెండవది కుకుంబర్ మొజాయిక్ వైరస్, మూడవది పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ (మొవ్వు కుళ్ళు తెగులు). ఈ మూడు రకాల వైరస్ తెగుళ్ళు మూడు రకాల కీటకాల ద్వారా వ్యాపిస్థాయి. ఈ వైరస్ తెగుళ్ళను అరికట్టడానికి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి.
1. జెమిని వైరస్ (ఆకుముడత):
మిరపను ఆశించే మూడు రకాల వైరస్ తెగుళ్ళలో జెమిని వైరస్ అధిక శాతం మిరప తోటల్లోఆశించి నష్టపరుస్తుంది. ఈ వైరస్ బిగోమోవైరస్ కి చెందింది. ప్రధానంగా తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెల్లదోమలు15 మి.మీ పొడవుతో లేత పసుపు శరీరంతో మైనపు తెల్లని రెక్కలు కలిగి, ఆకుల కింద ఎక్కువగా కన్పిస్తాయి.
తెగులు లక్షణాలు:
- ఆకు అంచులు పైకి ముడుచుకు పోవడం ఆకు ముడత వైరస్ తెగులు ముఖ్య లక్షణం.
- మొక్కల ఆకులు చిన్నవిగా మారుతాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగా, ఈనెల మధ్య లేత ఆకు పచ్చగా లేదా పసుపు పచ్చ రంగుకి మారి, కణపుల మధ్య దూరం తగ్గుతుంది.
- పాత ఆకులు గట్టిగా తోలు వలె మారి,పెళుసుగా అవుతాయి.
- ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి ముడుచుకుంటాయి.
- ఈ తెగులు పైరు తొలిదశలో ఆశిస్తే మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది. కాయలు సరిగా అభివృద్ధి చెందక దిగుబడి మీద ప్రభావం పడే అవకాశముంది.
తెగులు ఉధృతికి దోహదపడే పరిస్థితులు: - చాలా కలుపు మొక్కలు వైరస్ కు స్థావరాలు. కలుపు మొక్కలు వ్యాధి కారక వైరస్ వృద్ధి చెందటానికి ఉపయోగపడతాయి.
బెట్ట పరిస్థితులు, పొడి వాతావరణం ఈ తెగులు వ్యాపించడానికి చాలా అనుకులం.
వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ శాతం పెరిగె కొద్దీ ఈ తెగులు వ్యాప్తి పెరిగే అవకాశముంది.
వైరస్ సంక్రమించిన మొక్కలు, కలుపు మొక్కల ఉనికి ఈ తెగులు వృద్ధికి అనుకూలంగా ఉంటాయి.
2. కుకుంబర్ మొజాయిక్ వైరస్: - పేనుబంక కీటకం ద్వారా ఈ వైరస్ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ కుకుమొ వైరస్ కి చెందింది.
- తెగులు లక్షణాలు:
- తెగులు సోకిన మొక్కల్లో వాతావరణ పరిస్థితులను బట్టి లక్షణాలు మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వైరస్ ఉన్నా కానీ లక్షణాలు కనిపించకుండా ఉంటాయి.
- తెగులు సోకిన మొక్కల ఆకుల్లో పచ్చదనం కోల్పోయి, ఆకారం మారిపోయి కొనలు సాగి మొజాయిక్ లక్షణాలు కన్పిస్తాయి.
- లేత ఆకుల మీద ముడత ఏర్పడి, కుచించుకుపోయి లేత ఆకుపచ్చ రంగుకి మారిన ఆకులు కన్పిస్తాయి.
- మొక్కలు గిడసబారి, ఎదుగుదల లోపిస్తుంది. పూత కుడా ఉండదు.
- తెగులు సోకిన మొక్కల్లో కాయల సంఖ్య తక్కువగా ఉండి, గోధుమ రంగు మచ్చలు లేదా పసుపు రంగు వలయాలు కాయల మీద ఏర్పడి, కాయలు పెళుసుగా మారతాయి.
తెగులు ఉధృతికి దోహదపడే పరిస్థితులు:
- బెట్ట పరిస్థితులు, పొడి వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి చాలా అనుకూలం.
- ఈ వైరస్ దీర్ఘకాలంగా ఉండే కలుపు మొక్కల మీద, అప్పుడప్పుడు పంట మీద, పూల మీద వృద్ధి చెందుతుంది.
- వైరస్ సోకిన మొక్కలను పేనుబంక వంటి కీటకాలు ఆశించి, వేరే చోటుకు వ్యాధిని వ్యాపిస్తాయి.
- 3. పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ (మొవ్వు కుళ్ళు తెగులు):
ఈ వైరస్ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది.
తెగులు లక్షణాలు:
- తెగులు ఆశించిన మొక్కల్లో లేత ఆకులు ఆకుపచ్చదనాన్నికోల్పోయి ముదురు లేదా ఇటుక రంగులోకి మారుతాయి.
- ఆకులపై వలయాలుగా నెక్రోసిస్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి.
- నెక్రోసిస్ మచ్చలు మొక్కల చిగుర్లపై ఏర్పడి, చిగుర్లు ఎండి పోతాయి.
- తెగులు ఉధృతి ఎక్కువున్నప్పుడు మొక్కల్లో ఎదుగుదల తగ్గి, గిడసబారి పోతాయి.
- కాండంపైన నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి.
- తొలి దశల్లో కాయలు ఏర్పడక ముందు తెగులు సోకిన మొక్కల్లో కాయలు వికారంగా మారి అసమానంగా పండి ఉంటాయి.
- కాయలు ఏర్పడ్డాక తెగులు సోకిన మొక్కల్లో కాయలపై నెక్రోసిస్ మచ్చలు ఏర్పడతాయి. ఒక్కోసారి మొక్కల్లో కొమ్మలు ఉన్నప్పటికీ, కాయలు ఏర్పడ్డాక దిగుబడి మీద ప్రభావం చూపుతుంది.
- తెగులు ఉధృతికి దోహదపడే పరిస్థితులు:
- బెట్ట పరిస్థితులు, మోతాదుకు మించి నత్రజని ఎరువులను వేసినప్పుడు, తామర పురుగుల ఉధృతి ఎక్కువై వైరస్ వ్యాప్తి చెందుతుంది.
- తక్కువ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశముంటుంది .
- ఈ తెగులుకి చాలా కలుపు మొక్కలు స్థావరాలుగా ఉండి, వైరస్ వృద్ధికి దోహదపడతాయి. కలుపు మొక్కలతోపాటు లెగ్యుమ్ జాతి, సోలనేసియస్ జాతికి సంబంధించిన పంటల్లో కూడా వ్యాపిస్తుంది.
వైరస్ తెగుళ్ళ సమగ్ర యాజమాన్యం:
మిరపలో ఆశించే మూడు రకాల వైరస్ తెగుళ్ళయిన జెమిని వైరస్, కుకుంబర్ మొజాయిక్ వైరస్, పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ మూడు రకాల కీటకాల ద్వారా వ్యాపిస్తాయి. కాబట్టి కీటకాలను నాశనం చేసినట్లయితే వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశముంటుంది. దీని కోసం దిగువ చూపిన సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. - రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 8 గ్రా. చొప్పున కిలో విత్తనానికి పట్టించాలి. దీని వల్ల విత్తిన 20-25 రోజుల వరకు రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గే అవకాశముంటుంది.
- మిరప పంట చుట్టూ 2-3 వరసల జొన్న, మొక్కజొన్న లేదా సజ్జ పంటలను రక్షణ పంటలుగా వేసుకోవాలి.
- నారుమడి యాజమాన్యంలో భాగంగా సెంటు నారుమడికి ఫిప్రోనిల్ గుళికలు 80 గ్రా.చొప్పున వేసుకోవాలి. మిరప నాటిన 15, 45 రోజులకు ఎకరాకు 8 కిలోల చొప్పున ఫిప్రోనిల్ గుళికలు తగినంత తేమ ఉన్నప్పుడు వేయాలి.
- ఎప్పటికప్పుడు పంటను పరీశీలిస్తూ తొలి దశలో వైరస్ లక్షణాలు కలిగిన మొక్కలను గుర్తించి, పీకి నాశనం చేయాలి. తద్వారా వేరే మొక్కలకు వైరస్ సోకకుండా వ్యాప్తిని అరికట్టవచ్చు.
- గట్ల మీద, పంటలో ఉన్న వైరస్ క్రిములకు స్థావరాలైన కలుపు మొక్కలను లేకుండా శుభ్రం చేయాలి. వేరే జాతికి చెందిన పంట మొక్కలను కూడా పీకి పంటను శుభ్రంగా ఉంచుకోవాలి.
- నారును రసం పీల్చే పురుగుల బెడద నుంచి కాపాడుకోవటానికి నైలాన్ నెట్ లో నారు పెంచుకోవాలి.
- రసం పీల్చే పురుగుల బెడదను నివారించడంలో భాగంగా ప్రధాన పొలంలో సిల్వర్ లేదా బ్లాక్ మల్చింగ్ షీట్ ను వేసుకోవాలి.
- సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి.
- సేంద్రియ ఎరువులను కూడా వాడి ఎరువుల యాజమాన్యంలో సమతుల్యత పాటించాలి.
- పంటను బెట్టకు గురిచేయకుండా ఎప్పటికప్పుడు పరిశిలీస్తు నీటి తడులు ఇవ్వాలి. బెట్టకు గురైన పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది.
- జెమిని వైరస్, పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ లను వ్యాప్తి చేసే తెల్లదోమ, తామర పురుగుల నియంత్రణ కోసం మిరప తోటల్లో పసుపు, నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 10-15 పెట్టుకోవాలి.
- పంటపై 5 శాతం వేప గింజల కషాయం లేదా వేపనూనె (1500 పి.పి.ఎం.) 5 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేసి పైరు తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు.
- మొక్కలు దృఢంగా పెరగడానికి పైపాటుగా పొటాషియం నైట్రేట్ (13-0-45) లేదా 19-19-19 వంటి పోషకాలను మొక్క వయస్సు బట్టి 5-10 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
- వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల ఉధృతిని సకాలంలో గమనించి సస్యరక్షణ మందులను పిచికారి చేయాలి.
- జెమిని వైరస్ ను వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు 5 శాతం వేప గింజల కషాయం లేదా ఫైరిఫ్రాక్సిపెన్ 1.6 మి.లీ. లేదా ఫైరిఫ్రాక్సిపెన్ + ఫెన్ఫ్రొపోత్రిన్ 1 మి.లీ. లేదా ఫెన్ఫ్రొపోత్రిన్ 0.34 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారి చేయాలి.
- కుకుంబర్ మొజాయిక్ వైరస్ ను వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఆక్సీడెమటాన్ మిథైల్ 3 మి.లీ లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా ఫైరిఫ్రాక్సిపెన్ 1.6 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారి చేయాలి.
- పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ ను వ్యాప్తి చేసే తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 2 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.25 మి.లీ. లేదా స్పైనటోరం 1 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా సయాంట్రానిలిప్రోల్ 1.2 గ్రా. లేదా థయాక్లోప్రిడ్ 0.6 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారి చేయాలి.
డా. కె. రవి కుమార్, డా. వి. చైతన్య,
డా. జెస్సీ సునీత, పి.ఎస్.ఎం ఫణిశ్రీ,
కృషి విజ్ఞాన కేందం, వైరా.