Sulfide Toxicity in Rice: వానాకాలం మరియు వేసంగిలో ఒకే పొలంలో సంవత్సరాలు తరబడి వరి సాగుచేయడం వలన వరిలో ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావాన్ని గమనిస్తాము. ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావం వలన 30-50 శాతం వరకు పంట దిగుబడి నష్టపోవడం జరుగుతుంది. వరిలో ఇటువంటి పరిస్థితికి కారణం స్థానికంగా అధిక నీటి ముంపు, తగిన రీతిలో పంట వేర్లకు గాలి అందకపోవటం నేలలో రసాయన చర్యల వలన మార్పు చెందడం. ఇనుము ధాతువు లోపం ఉండే పొలాల్లో అలాగే బరువు నేలల్లో సల్పైడ్ (గంధకం) కలిగిన 20-20-0-15 లాంటి కాంప్లెక్సులను అధికంగా వాడటం లేదా సింగిల్ సూపర్ ఫాస్పెట్‌ని గాని లేదా అమ్మేనియం ‘‘సల్ఫైడ్’’ని గాని ఎక్కువగా వాడటం వలన ఈ ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావాన్ని పొలంలో గమనించవచ్చు.
అలాగే సాధారణంగా చెరువుల క్రింద పొలాల్లో, కాలువల కింద నీటి పారుదల ఎల్లప్పుడూ ఉండే పొలాల్లో ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావాన్ని ఎక్కువగా గమనిస్తాము. ఈ ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావం వలన వరి నేలల్లో, పంట మధ్యకాలంలో అక్కడక్కడ గుంపులు గుంపులుగా బాగా పెరిగిన పంట మొత్తము పసుపు వర్ణములోకి మారి ఎదుగుదల క్షీణిస్తుంది. పొలంలోకి దిగి గమనించినట్లయితే మట్టి మెత్తగా ఉండి కాలు చాలా లోతుగా దిగబడిపోతుంది. అలాగే మట్టి నుంచి కుళ్ళిన వాసనను మనం గమనిస్తాము. పొలంలో నడుస్తున్నప్పుడు బుడగల రూపంలో గాలి బయటికి రావడం చూస్తాము. నేల నుంచి దుర్గందపు వాసన మరియు మొక్కను వేర్లతో సహా బయటికి తీసినప్పుడు కూలిపోయిన గుడ్ల వాసన వస్తుంది. వేర్లు పూర్తిగా నల్లగా మారి జీవములేక కుళ్ళిన వాసన వస్తుంది. ఈ ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావం వలన మొక్కలు ఎదుగుదల క్షీణించి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Also Read: Tea Mosquito Mugs (TMB): జీడిమామిడిలో ‘‘టీ’’ దోమ యాజమాన్యం.!
సాధారణంగా ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావం వర్షాకాలంలో వరి పొలంలో కంటే వేసవిలో ఉండే వరి పొలంలో ఎక్కువగా గమనిస్తాము. దీని గల ప్రధాన కారణం వర్షం యొక్క వర్షపు నీటి వలన భూమిలో ఉండే సల్ఫర్ కరిగిపోతుంది. కావున ఎక్కువగా మనం వేసంగిలో ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావాన్ని వరి పొలంలో గమనిస్తాము.
పై లక్షణాలు గమనిస్తే ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావంగా భావించి సమగ్ర నివారణ చర్యలను చేపట్టవలసి ఉంటుంది. దీని దుష్ప్రభావం నివారణకు పైరు వేయటానికి మడిని తయారు చేయుటకు ముందు ఇటువంటి ప్రాంతాల్లో 1-2 బండ్ల ఎర్రమట్టిని వేసి బాగా కలియబెట్టి ఆరబెట్టడం, భూమిని ఎత్తు చేయటం చేయాలి. పొలంలో ఎత్తు వంపులు లేకుండా సమానంగా ఉండే విధంగా పొలాన్ని తయారు చేసుకోవాలి.
నీరు ఎక్కువగా నిలువ ఉంటే ఈ ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావం గమనిస్తాం. పంట కాలంలో దుష్ప్రభావం కనిపించినప్పుడు మొక్క వేర్లకు తగిన గాలి తగిలే విధంగా మురుగు నీటిని తీసి పంటను ఆరబెట్టాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెట్టెలు వచ్చే వరకు ఆరగట్టి అప్పుడప్పుడు మళ్ళీ నీరు అందివ్వాలి. అమ్మోనియం ‘‘సల్ఫైడ్’’ వంటి ఎరువులను ఇలాంటి పొలాల్లో వాడరాదు. అలాగే పైపాటుగా 100`150 గ్రా. స్ప్రింట్‌ను 25 కేజీల యూరియాతో కలిపి ఒక ఎకరానికి చొప్పున వేయాలి లేదా కంటఫ్ ప్లస్ / హెక్సాకొనజోల్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి ఒక ఎకరాకు మందు ద్రావణం పిచికారీ చేయాలి. ఇలా చేసినట్లైతే పంటను ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావం నుండి కాపాడుకోవచ్చు.
Also Read: Watermelon Pests: ఖర్బూజ`పుచ్చకాయ పై ఆశించే పురుగులు.!