Pest Prevention in Monsoon Rice Cultivation – ఆకుముడత పురుగు:
పురుగు గుర్తింపు: తల్లి పురుగు చిన్నగా ఉండి, రెక్కలు లేత పసుపు రంగులో ఉండి ముందు జత రెక్కలపైన అలల మాదిరిగా రెండు గోధుమ రంగు చారలు మరియు వెనుక జత రెక్కపైన ఒక చార ఉంటుంది.
లక్షణాలు: గ్రుడ్ల నుండి వెలువడిన గొంగళి పురుగులు మొదట ఆకులోని పత్ర హరితాన్ని గోకి తింటాయి. తరువాత దశలో ఆకుల అంచులను దగ్గరకి కలిపి గొట్టం లాగా ముడతగా చేసి, లోపల ఉండి పత్రహరితాన్ని గోకి తింటాయి. అందుచేత ఆకులు తెల్లగా ఎండిపోయినట్లు కనిపిస్తాయి. పూర్తిగా పెరిగిన పురుగులు ముడతలోనే ఉండి కోశస్థ దశలోకి పోతాయి. ఆకు ముడతను తీసి చూసినట్లయితే లోపల లద్దెపురుగు మలము మరియు కోశస్థ దశ గమనించవచ్చు.ఈ పురుగులు వరి పైరును పిలక వేసే దశ నుండి ఆశిస్తాయి. చిరుపొట్ట దశ నుండి అభివృద్ధి చెందే దశలో దీని ఉధృతి అధికమౌతుంది.
నివారణ చర్యలు: నత్రజని సంబంధమైన ఎరువును ఎక్కువగా వేసినట్లయితే పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటుంది. కనుక సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేయాలి.పైరు పైన పిలక దశలో కొబ్బరి తాడును చేసుకుని అడ్డంగా 2-3 సార్లు లాగితే పురుగులు క్రింద పడిపోతాయి.రసాయనిక పురుగు మందులైన మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేక క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లేక కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రాములు లేదా క్లోరాంట్ర నిలిప్రోల్ 0.3 మి.లీ.లను ఒక లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచే విధంగా పిచికారి చేయాలి. పురుగు ఉధృతిని బట్టి 8-10 రోజుల వ్యవధిలో మరొకసారి పిచికారి చేయాలి.దుబ్బుకు 1-2 పూర్తిగా నష్టపోయిన ఆకులు ఉంటే నివారణ చర్యలు చేపట్టాలి.
Also Read: Brown Rice Health Benefits: బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే లాభాలు
తాటాకు తెగులు:
లక్షణాలు: గ్రుడ్డు నుండి బయటకు వచ్చిన గొంగళి పురుగు ఆకు పాఠల మధ్యలోకి చేరి ఆకుపచ్చని పదార్థాన్ని గోకి తింటుంది. దీనివలన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. తల్లి పెంకు పురుగుల ఆకుల పైభాగంలోని పత్ర హరితాన్ని ఛారలు ధారలుగా గోకి తినడం వలన ఆకు దీర్ఘచతురస్రాకారపు చారలు గమనించవచ్చు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎండిపోతాయి.దీని వలన మనకు పొలమును దూరం నుండి చూసినట్లయితే సున్నం వేసినట్లుగా కనిపిస్తుంది. దీనినే “సున్నపు తెగులు” అని కూడా అంటారు.
నివారణ చర్యలు: ఈ పురుగు నారుమడిలో ఆశించినట్లయితే నారు నాటే ముందు కొనలను త్రుంచి నాటుకోవాలి.రసాయనికి పురుగు మందులైన మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీలు లేక క్వినాల్ఫాస్ 2.0 మి.లీ.లు లేక క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీలు లేక ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీలు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read: Rice Milling Machine: ధాన్యం మిల్లు పట్టు యంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.!