Summer Chickpea (part I): తెలంగాణ రాష్ట్రంలో వేసవి (ఎండాకాలం)లో పండించే పప్పుదినుసులలో శనగ పంట ప్రధానమైనది. అయితే అన్నీ పంటలకు ఉన్నట్లు గానే సహజంగా శనగ పంటకు కూడా చీడపీడల బెడద ఉంటుంది. కానీ మనం ఏ కొంచెం అశ్రద్ధ చేసినా జరిగే నష్టం ఎక్కువ మొత్తం లో ఉంటుంది. అయితే శనగని ఆశించు పురుగుల్లో శనగపచ్చపురుగు, రబ్బరు పురుగులు ప్రధానమైనవి..
శనగ పంట నాశించు పురుగులు- వాటి యాజమాన్యం:
శనగపచ్చపురుగు: ఇది పంటను తొలిదశనుండే ఆశించినప్పటికి ముఖ్యంగా మొగ్గ ,పూత , పిందె దశల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి , చిన్నపాటి జల్లులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి పురుగులు లేతపసుపు రంగు గుడ్లను లేతచిగుళ్లు , పూమొగ్గలపై పెట్టడం వల్ల గుడ్లనుండి వచ్చే పిల్లపురుగులు పూమొగ్గలు, పిందెలు ,కాయల్ని గోకి తింటాయి. ఎదిగిన లార్వాలు కాయలపై గుండ్రని రంధ్రం చేసి సగం శరీరం కాయలోపల ,సగం బయట ఉంచి గింజల్ని తిని కాయల్ని డొల్ల చేస్తాయి.
Also Read: ఇంటి మొక్కల్లో స్టింక్ బగ్స్ – నివారణ చర్యలు
యాజమాన్యం:
★ వానాకాలం పంట కోసినతరువాత లోతు దుక్కులు చేయాలి. దానివల్ల నిద్రావస్థలో ఉన్న పురుగులు బయట కి వచ్చి చనిపోతాయి.
★ శనగపంటలో అంతరపంటగా ధనియాలను 8:2 లేదా పెసర/ మినుముని 7:3 నిష్పత్తిలో వేయాలి.
★ ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగుల ఉనికిని గమనిస్తూ , వాటిని తినే పక్షులను ఆకర్షించుటకు ఎకరాకు 10-12 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
★ విత్తిన 30 రోజులకు శనగ మొక్క కొనలను తుంచడం వల్ల పురుగుల గుడ్లను నాశనం చేయవచ్చు.
★ పురుగు ఉధృతి ఆర్థికంగా నష్టపరిచే స్థాయిని మించిఉన్నప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రా లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా లేదా క్లోరాంత్రానిలిప్రోల్ 0.3
మి. లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
రబ్బరు పురుగు : ఇది పంట తొలిదశలో బెట్ట వాతావరణం ఉన్నప్పుడు , వెంటనే వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. పంట తొలిదశలో ఆశిస్తే ఆకులను తింటాయి. ఉదృతి ఎక్కువగా ఉంటే ఆకులు పాలిపోయి , రాలిపోతాయి.
యాజమాన్యం:
★పక్షి స్థావరాలు ఎకరానికి 10-12 పంట తొలినాళ్లనుండే ఏర్పాటు చేయాలి. లద్దెపురుగులను చేతిలో ఏరి నాశనం చేయాలి.
★ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరోఫైరిఫాస్ 2 మి. లీ లేదా నొవాల్యూరాన్ 1 మి. లీ లేదా థయోడికార్బ్ 1.5 గ్రా లీటర్ నీటికి కలిపి మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.
Also Read: రబీ సీజన్ పంటల్లో చీడపురుగుల నివారణ చర్యలు