Pest Control in Cocoa Crop: కోకో వాణిజ్య పంట, దీన్ని ప్రధానంగా చాక్లెట్లు, ఆహార పానీయాలు, ఔషధములు వంటి తయారీలో వినియోగిస్తారు. కోకో (థియోబ్రోమో కోకోవా) మార్వేసి కుటుంబానికి చెందినది. దక్షిణ అమెరికాలోగల ‘అమెజాన్’ నదీతీరము దీని జన్మస్థలముగా భావించబడుతోంది. భారతదేశంలో కోకో 20 వ శతాబ్దపు తొలిదశలో ప్రవేశ పెట్టబడిరది. మనదేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సుమారు 1,03,376 హెక్టార్లలో సాగు చేయబడుతోంది. సుమారుగా 27,072 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కలిగి ఉంది.
మన రాష్ట్రం సుమారుగా 39,174 హెక్టార్ల సాగు మరియు 10,903 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ప్రధమ స్థానంలో ఉంది. సరాసరి మన దేశ ఉత్పాదకత 669 కేజి / హె. ఉండగా, 950 కేజి / హె. తో ఉత్పాదకతతో మన రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉంది. కోకో పంటను రాష్ట్రంలో ప్రధానంగా కోస్తా జిల్లాలలోని, కొబ్బరి, ఆయిల్‌పామ్ మరియు వక్క (పోక) తోటలలో శాశ్వత అంతర పంటగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలలో గల కొబ్బరి తోటలలో అంతర పంటగా కోకో అత్యంత లాభదాయకంగా ఉంది.
గాలిలో సుమారు 80 ` 1000 శాతం తేమ గల ఉష్ణమండల ప్రదేశాలు, సగటు ఏడాది వర్షపాతం 1,250 మి.మీ. మరియు 15 ` 39 డిగ్రీల ఉష్ణోగ్రత గల ప్రాంతాలు కోకో సాగుకు అనుకూలం. అదేవిధంగా మురుగునీరు సదుపాయము గల సారవంతమైన బంకమన్ను మరియు గరప నేలలలో ఈ పంటను సాగుచేయవచ్చు.
కోకో పంటను సుమారు 50 రకాల జాతులకు చెందిన పురుగులు ఆశించి, ఉత్పత్తిపై ప్రభావం చూపగలవు. వాటిలో ఆకుతినే గొంగళిపురుగులు, రసం పీల్చే పిండినల్లి, పేనుబంక, బుట్టపురుగు, ఆకు తినే పురుగులు ప్రధానమైనవి.
2012 నీలం తుఫాన్ తరువాత కోకోలో బెరడు తొలుచు పురుగు ఉనికి గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ పురుగు ఉధృతి తీవ్రస్థాయిలో గమనించడమైనది. ఈ పురుగు కోకోలో మాత్రమే కాకుండా, మామిడి, పనస, జామ, ఉసిరి వంటి సుమారు 70 రకాల పంటలను ఆశించి ఉత్పత్తిపై ప్రభావం చూపగలదు. ఈ పురుగు ఇండార్ బెల్లా జాతికి చెందినది. ఇతర పంటలలో సాధారణంగా ఇండార్ బెల్లా టెట్రానిస్, ఇండార్ బెల్లా క్వాడ్రినోటాటా పురుగులు ఆశించి, నష్టం కలుగ చేస్తున్నాయి. మనరాష్ట్రంలో కోకో ఆశించే పురుగు మాత్రం ఇండార్ బెల్లా ఆబ్లిక్యూఫెషియోటాగా గుర్తించడం జరిగింది.
బెరడు తొలుచు పురుగు యొక్క తల్లి పురుగు సాధారణంగా మే ` జూలై నెలలలో కోశస్థ దశ నుంచి బయటకు వచ్చి, బెరడు వదులుగా ఉన్న ప్రదేశాలలో గ్రుడ్లు పెడతాయి. పిల్ల గొంగళిపురుగులు బెరడును తిని, కాండంలోకి తొలుచుకుని పోతాయి. పగటిపూట కాండంలో ఉంటూ, రాత్రి సమయాలలో అవి విసర్జించిన పదార్ధాలతో తయారైన, గొట్టము వంటి ఆకారములో ఉన్న దారి ద్వారా బయటకు వచ్చి, బెరడును తింటాయి. చెట్టు కాండంపైన చూస్తే, ఈ పురుగు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని సార్లు రైతులు ఈ లక్షణాలు గమనించి, చెద పురుగులు ఆశించాయని అపోహ పడతారు. దీని గొంగళిపురుగు దశ సుమారు 9 నుండి 10 నెలల వరకు ఉండడం వలన, కాండంపై బెరడును కోల్పోతాయి. కోకో చెట్లలో పూత చెట్ల కాండం పై మాత్రమే ఉంటుంది. ఈ పురుగు ఆశించిన చెట్ల కాండంపై ఉన్న బెరడు కోల్పోవడం వలన, సరైన ఆధారం లేక పుష్పగుచ్ఛాలు రాలి పోయి, పిందెలు ఏర్పడవు.
బెరడు తొలుచు పురుగు యొక్క తల్లి పురుగు సాధారణంగా మే ` జూలై నెలలలో విడుదల అవుతుంది. ఆడ తల్లి పురుగు సాధారణంగా జూన్ నెలలో వదులుగా ఉన్న చెట్టు బెరడులో గ్రుడ్లు పెడుతుంది. ఈ గ్రుడ్ల నుండి 15 ` 25 రోజులలో పిల్ల గొంగళిపురుగు విడుదల అవుతుంది. గొంగళిపురుగు తొలిదశలో చెట్ల బెరడును తింటూ, క్రమేపీ కాండం పై నుండి రంధ్రం చేసుకుని, లోపల నివసిస్తుంది. ఇవి సాధారణంగా 15 ` 20 సెం.మీ. వరకు రంధ్రాన్ని ఏర్పరచగలవు. గొంగళి పురుగు ఉన్న చెట్లపై అవి విసర్జించిన పదార్ధాలతో తయారైన, గొట్టము వంటి నిర్మాణాన్ని ఏర్పరచుకొని, రాత్రి సమయాలలో బయటకు వచ్చి, బెరడును తింటాయి. ఈ దశలో సుమారుగా 9 నుండి 10 నెలల వరకు జీవిస్తుంది. తర్వాత గొంగళిపురుగు ఏర్పరచిన రంధ్రంలో కోశస్థ దశగా రూపాంతరం చెంది, 15 ` 25 రోజులలో తల్లి గొంగళిపురుగు విడుదల అవుతుంది. ఈ పురుగు యొక్క జీవిత కాలం దాదాపు ఒక సంవత్సరం వరకు ఉంటుంది.
పురుగులు అన్నింటిలో కెల్లా సుమారు 9 ` 10 నెలలు గొంగళి పురుగు దశలో ఉండే ఇండార్ బెల్లా జాతి ప్రధమ స్థానంలో ఉంది. అందువలన, ఈ పురుగు ఆశించిన యెడల కోకో పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. కొమ్మ కత్తిరింపులు చేపట్టినప్పుడు, కొమ్మలు పగుళ్ళు, గాయాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఏమైనా పగుళ్ళు ఏర్పడితే బోర్డో పేస్టు పూతగా పూయాలి.
Also Read: Coconut and Cocoa Crops in September: కొబ్బరి, కోకో పంటలలో సెప్టెంబర్ మాసంలో చేపట్టవలసిన పనులు.!
నివారణ :
1. సెప్టెంబర్ మాసం నుండి తోటలలో పురుగు యొక్క ఉనికిని నిశితంగా గమనించాలి.
2. విసర్జించిన పదార్ధాలతో ఏర్పడిన గొట్టాన్ని పూర్తిగా తీసివేసి, పురుగు రంధ్రాన్ని గుర్తించాలి.
3. పురుగు ప్రవేశించే రంధ్రం గుండా లామిడా సైహలోత్రిన్ 0.5 మి.లీ. / లీ. లేదా క్లోరంట్రనిలిపోల్ 0.3 మి.లీ. / లీ. నీటికి కలిపిన ద్రావణాన్ని సిరంజ్ సహాయంతో నింపాలి. తర్వాత ఆ రంధ్రాన్ని దూదితో మూసివేయాలి.
4. పురుగు మందులు వాడకుండా, సేంద్రియ పద్ధతిలో కోకోను పండిరచే రైతులు పురుగు రంధ్రాన్ని నాఫ్తలీన్ ఉండల పొడితో నింపి, దూదితో మూసివేసి, నివారించవచ్చు.
5. సేంద్రియ సాగు చేసే రైతులు పురుగు రంధ్రాన్ని 3 నుండి 5 మి.లీ. ఆముదం నూనె, కొబ్బరి నూనె లేదా పామాయిల్ నూనెను సిరెంజ్ సహాయంతో రంధ్రాన్ని నింపి, తర్వాత దూదితో మూసివేయడం ద్వారా కూడా నివారించవచ్చు.
-డా.ఎన్.బి.వి.చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ (ఎంటమాలజీ), డా.వి.అనూష, సైంటిస్ట్ (ఎంటమాలజీ),
-ఎ.కిరీటి సైంటిస్ట్ (హార్టికల్చర్), శ్రీమతి బి.నీరజ,సైంటిస్ట్ (ప్లాంట్ పేథాలజీ), -డా.వి.గోవర్ధన్ రావు, సైంటస్ట్ (ప్లాంట్ పేథాలజీ), డా.బి.శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ Ê హెడ్,ఉద్యాన పరిశోధన స్థానం.
-డా.వై.యస్.ఆర్.ఉద్యాన విశ్వవిద్యాలయం, అంబాజీపేట, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
Also Read: కోకో పంటలో అద్భుత లాభాలు…
Must Watch: