Watermelon Pests: వేసవి రానే వచ్చింది, మార్చి మొదట్లోనే ఎండలు మండి పోతున్నాయి. అయితే వేసవి వస్తు వస్తూనే కొన్ని పండ్లును వెంట తీసుకొస్తుంది. అలాంటి వాటిలో ఖర్చూజ మరియు పుచ్చకాయలు ఒకటి. ఇటీవలి కాలంలో ఖర్చూజాను ఆహారంలో భాగం చేసుకునే వారి సంఖ్య పెరగటంతో మారెట్లో ఈ పంటకు మంచి గిరాకీ లభిస్తుంది.
ఈ పంటలలో వచ్చే పురుగులు`వాటి నివారణ చర్యలు :
1. కాయను ఆశించే ఈగ :
పూత దశలో తల్లి పురుగులు పువ్వులపై గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు పూత, పిందెలలోకి చేరి కాయలను తిని నష్ట పరుస్తాయి. ఈ పిల్ల పురుగులు పండిన పండులోనికి తొలుచుకొని పోయి గుజ్జును కుళ్ళింప చేస్తుంది. ఈ పురుగులు పండ్లను చిన్న దశలోనే ఆశించినట్లయితే పక్వానికి రాకముందే రాలిపోతాయి.
నివారణ :
. పురుగు ఆశించిన పండ్లను కోసి నాశనం చేయాలి. పండ్లు ఏర్పడగానే కాగితపు సంచులలో కప్పాలి.
. పురుగులు తట్టుకునే రకాలైన అర్కాటిండ పుచ్చకాయ రకాన్ని సాగు చేయాలి. పండ్లు పక్వానికి రాకముందే కోయాలి.
. మొక్క క్రింద మట్టిని తిరగ తోడాలి, ఇలా చేయడం ద్వారా కోశస్థ దశను నాశనం చేయవచ్చు.
. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే సెయాంట్రానిప్రోల్ 10. 26 ఓ.డి. 100 మి. లీ. G 100 గ్రాములు చక్కెర /బెల్లం 10. లీటర్ల నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. ఇది ఎరువుగా పనిచేస్తుంది.
. క్యూలూర్ అనే లింగాకర్షక బుట్టలు ఎకరానికి ఆరు చొప్పున పూతదశ ముందే పెట్టాలి. తోట తీసి వేసిన తర్వాత భూమిని లోతుగా దున్ని భూమిలో ఉన్న కోశస్థదశను నాశనం చేయాలి.
2. పెంకు పురుగు :
ఈ పెంకు పురుగులు ఆకులను మరియు పువ్వులను ఆశించి రంధ్రములను ఏర్పరుస్తాయి. పిల్ల పురుగులు మొక్క వేళ్ళలో గాని కాండంలోనికి గాని భూమిని ఆనుకొని ఉన్న పండ్లలోనికి చేరి గాయపరుస్తాయి. మొక్క లేత దశలో ఆశించినట్లయితే ఆకులను మరియు పువ్వులను తిని నష్టపరుస్తుంది.
నివారణ :
. వేసవిలో లోతుగా భూమిని దున్ని లద్దె పురుగు, కోశస్థ దశలను నాశనం చేయాలి.
. పురుగుల యొక్క జనసాంద్రత ఎక్కువ ఉన్నప్పుడు సెయాంట్రానిప్రోల్ 10.26 ఓ.డి 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
. వేప గింజల కషాయం 50 మి.గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read: Winter Calf Management: శీతాకాలంలో దూడల పెంపకం, వాటి యాజమాన్య పద్ధతులు.!
3. పొట్ల నాశించు సెమిలూపర్ :
లద్దె పురుగులు ఆకుల అంచులను కత్తిరించి, మడిచి ఆ మడత లోపల ఉండి ఆకులను తింటుంది. ఇవి చిన్న మొక్కలను చాలా నష్టం కలిగిస్తాయి. అదేవిధంగా కాయలను కూడా తొలుస్తాయి. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులను మొత్తం తిని మొక్కలను మోళ్ళుగా చేస్తాయి.
నివారణ :
. లద్దె పురుగులను ఏరి నాశనం చేయాలి.
. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంట్రానిప్రోల్ 18.5 ఎస్.సి. 3 మి.లీ. 10 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా సెయాంట్రానిప్రోల్ 10.26 ఓ.డి. 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
4. పేను బంక :
పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. ఇవి చిగురు కొమ్మలను కూడా ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించిన భాగాలు పసుపు వర్ణంలోకి మారి వంకరటింకరగా తిరిగి ఆకారాన్ని కోల్పోతాయి. తర్వాత ఎండి రాలిపోతాయి తద్వారా మొక్కల పెరుగుదల క్షీణిస్తుంది. ఇవి విసర్జించే తేనె వంటి పదార్థం వల్ల ఆకులు, కొమ్మలు మరియు కాయలపై మసి తెగులు వ్యాపిస్తుంది. ఈ విధంగా ఆశించిన పండ్లు నాణ్యత కోల్పోతాయి.
నివారణ :
. పసుపు జిగురు అట్టలు ఒక హెక్టారులో 20 చొప్పున పెట్టాలి.
. వేప మరియు వెల్లుల్లిపాయల పేస్ట్‌ని తయారు చేయాలి (తయారు చేయు విధానం 20. మి.లీ. వేప నూనెం20 గ్రాముల వెల్లిపాయ పేస్ట్, 5 గ్రాములు ఎదైనా బార్ సోప్ ఒక లీటరు నీటిలో వేసి తయారు చేయాలి) ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని పిచికారి చేయాలి.
. ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యూ.జి. 1 గ్రాముని 10 లీటర్ల నీటిలో కలిపి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పిచికారి చేయాలి.
5. ఆకు తొలిచే పురుగు :
పిల్ల పురుగులు మొక్క యొక్క తొలిదశలో ఆకుల పొర కణజాలములోకి వెళ్ళి సొరంగాలుగా తొలచి ఆకులను తింటాయి. దీనిని పాముచార మచ్చలు అని అంటారు. ఉద్భతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పూర్తిగా ఎండి రాలిపోతాయి. తొలిదశలో ఈ పురుగు ఉధృతి గమనించగానే వేపనూనె 50 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
. పురుగుల ఉధృతి తగ్గకపోతే సెయాంట్రానిలిప్రోల్ 10.26 ఓ.డి. 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
. ఆముదపు మొక్క టమాట లేదా బంతిపూల మొక్కలను ఎరపంటగా వేయాలి.
. పసుపు జిగురు అట్టలు ఎకరానికి 10 చొప్పున పెట్టాలి.
. వేప గింజల కషాయం 50 మి.లీ. గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
Also Read: Organic Fertilizer: సేంద్రియ ఎరువు – ప్యాకింగ్ జాగ్రత్తలు.!