Disease Management in Black Gram – పల్లాకు తెగులు: ఈ తెగులును కలుగచేయు వైరస్ కలుపు మొక్కలు మరియు తెగులు సోకిన ఇతర పంట మొక్కల నుండి తెల్లదోమల ద్వారా మినుము మరియు పెసర పంటలకు వ్యాప్తిచెంది ఆధిక నష్టం కలుగచేస్తుంది. తెగులు సోకిన మొక్కలలోని ఆకులపై పసుపు మరియు ఆకుపచ్చ రంగు మచ్చలు కనబడతాయి. అందువలనే దీనికి మోజాయీక్ అనే పేరు వచ్చింది. తొలిదశలోనే ఈ తెగులు ఆశించినట్లయితే పైరు అంతా పసుపు రంగుకు మారిపోయి పూత మరియు పిందే ఏర్పడక అత్యధిక నష్టం కలుగుతుంది. పూత మరియు పిందె దశలో ఈ తెగులు ఆశించినట్లయితే పిందెలు, కాయలు పసుపు రంగులోకి మారి వంకరలు తిరిగి తాలు కాయలుగా మారిపోతాయి. కాయదశలో ఈ తెగులు ఆశించినట్లయితే దిగుబడిలో పెద్దగా నష్టం కలుగానప్పటికి గింజలు పసుపు రంగుకు మారి నాణ్యత తగ్గడానికి అవకాశం ఉంది.
ఆకుముడత, తలమాడు తెగులు/ మొవ్వుకుళ్ళు
ఈ వైరస్ తెగులు ఉదృతి వర్షాభావ పరిస్థితులలో ఎక్కువగా ఉంటుంది. ఇది తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల అంచులు వెనుకకు ముడుచుకుని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగములోని ఈనెలు రక్తవర్నమును పోలిఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడిపోయి, గిడసబారి మొక్కలు ఎండిపోతాయి. పైరు ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి తలలు మాడిపోయి అతి తక్కువ కాపు ఉంటుంది. తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన తామర పురుగులను నివారించుకోవాలి.
సీతాఫలం తెగులు/బొబ్బర తెగులు
ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది.ఈ తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల కాడలు మరియు ఆకులు పెద్దవిగా అయ్యి ఆకుపై ఉబ్బెత్తుగా అయ్యి ముడుతలు పడి సీతాఫలం కాయ లాగా కనబడుతుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారతాయి. ఈ తెగులుసోకిన మొక్కలలో పూత, పిందె అభివృద్ధి చెందక కాయలు ఏర్పడవు. ఈ తెగులు 70% వరకు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. కనుక తెగులు సోకని పంట నుండి విత్తనం సేకరించుకోవాలి. తెగులు వ్యాప్తికి కారణమైన పేనుబంక పురుగులను నివారించుకోవాలి.
వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం
వైరస్ తెగుళ్ళు తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగుల ద్వారా, కలుపు మొక్కల నుండి పంట మొక్కలకు, పంటలో ఒక మొక్క నుండి ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ ల నిర్మూలనకు ఎలాంటి క్రిమిసంహారక మందులులేవు కాబట్టి తెగులు వ్యాప్తి కరాకలైనటువంటి తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగులను అరికట్టడం ద్వారా మాత్రమే ఈ తెగుళ్ళను నివారించాగలము.
Also Read: Pomagranate Farming: అధునాతన పద్ధతిలో దానిమ్మ సాగు లక్షల్లో ఆదాయం
1. పల్లాకు తెగులు తట్టుకొనే రకాలను సాగు చేసుకోవాలి.
పెసర: ఎల్.బి.జి. 460, ఎల్.బి.జి.407 , ఐ.పి. యం. 2-14, డబ్లూ.బి.జి. 42.
మినుము: ఎల్.బి.జి 460, పి.యు. 31, టి.బి.జి. 104, టి 9 మరియు జి.బి.జి. 1
2. విత్తన శుద్ధి: పంట విత్తుకొనే 24-48 గంటల ముందుగా ఒక కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 600ఎఫ్.ఎస్. 5 మి.లీ. లేదా థయోమిదాక్సిం 70 డబ్లూ.ఎస్. 5 గ్రా. మరియు కార్బెండజిం లేదా మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయవలెను.
౩. పంట విత్తుకొనే సమయంలో పొలం చుట్టూ నాలుగు వరుసలలో మొక్కజొన్న/జొన్న/సజ్జ పంటను వితుకొన్నట్లయితే ప్రక్క పొలాల నుండి తెల్ల దోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగులను రాకుండా నివారించవచ్చు.
4. పొలంలోనూ, గట్లమీద కలుపు లేకుండా చూసుకోవాలి. గట్లమీది కలుపు మొక్కలను, ఇతర రకాల పంట మొక్కలను గమనిస్తూ వైరస్ తెగుళ్ళు సోకిన కలుపు మొక్కలను, పిల్లిపెసర వంటి ఇతర పంట మొక్కలను పీకి తగులబెట్టాలి.
5. పొలంలో తెగులు సోకినా మొక్కలను గమనించిన వెంటనే పీకి నాశనం చేయవలెను.
6. ఎకరాలో అక్కడక్కడా తెల్లదోమకు 20 చొప్పున పసుపురంగు జిగురు అట్టలు/ రేకులు/పల్లాలను, తామర పురుగులుకు 20 నీలిరంగు జిగురు అట్టలను ఉంచటం ద్వారా ఆయా పురుగుల ఉనికిని మరియు ఉధృతిని అంచనా వేసుకోవచ్చు. అంతేకాక తెల్లదోమ మరియు తామర పురుగులు అట్టలకు అంటుకోవటం ద్వారా కొంత వరకు నివారిoచబడతాయి. కానీ పల్లాకు తెగులు వ్యాప్తికి ఒకటి లేక రెండు తెల్లదోమలు వున్నా సరిపోతుంది. తెల్లదోమ కనిపించిన వెంటనే పురుగుమందులు పిచికారీ చేసినట్లయితే పల్లాకు తెగులు బారి నుండి పంటను రక్షించుకోవచ్చు.
7. విత్తిన 15 లేక 20 రోజులకు ఒకసారి వేపనూనె5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి లేక 5% వేప గింజల కషాయము కాని పిచికారీ చేసినట్లయితే పంటను రసంపీల్చే పురుగులు ఆశించకుండా కాపాడుకోవచ్చు. అంతేకాక అప్పటికే పంటలో ఉన్న రసం పీల్చే పురుగుల గ్రుడ్లను మరియు పిల్ల పురుగులను కూడ నాశనం చేసినట్లు అవుతుంది.
8. తెల్లదోమ నివారణకు అంతర్వాహిక కీటకనాశినులైన ట్రైజోఫాస్ 1.5 మి.లీ. లేక ఎసిఫేట్ 1.0 గ్రా. లేక ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ. లేక్స్ ఎసిటామీప్రిడ్ 0.2 గ్రా. ఏదేని ఒకాదానిని ఒక లీటర్ నీటికి కలిపి తెల్ల దోమ ఉధృతిని బట్టి మందును మార్చి మార్చి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
9. తామర పురుగుల నివారణకు ఎసిఫేట్ 1 గ్రా. లేక ఫిప్రోనిల్ 1.5 మి.లీ. లేదా డైమిథోయేట్ 2.0 మి.లీ. లేదా థయోమిదాక్సాం 0.2 గ్రా.లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. ఏదో ఒక మందును ఒక లీటరు నీటికి కలిపి తామర పురుగుల ఉధృతిని బట్టి వారం నుంచి పది రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారి చేయాలి. పైరు పూత దశలో ఉన్నపుడు తామర పురుగులఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ 0.3 మి.లీ. నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తామర పురుగులతోపాటు మారుక మచ్చల పురుగును కూడా నివారించుకోవచ్చు.
10. పేనుబంక పురుగు నివారణకు ఎసిఫేట్ 1.0 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. థయోమిదాక్సాం 0.2 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. ఏదో ఒక మందును ఒక లీటరు నీటికి కలిపి పేనుబంక ఉధృతిని బట్టి వారం నుంచి పది రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారి చేయాలి.
Also Read: Farmer Support: రైతులకు భరోసాని ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం