Pests of Papaya: బొప్పాయి ఏడాది పొడవునా ఆదాయాన్నిచ్చే పంట. ఆహారం, ఔషధ విలువలున్న బొప్పాయి ఉత్పత్తికి వైరస్ తెగుళ్లు ఆశించడం వాళ్ళ తీవ్ర నష్టం కలుగుతుంది. వైరస్ తెగుళ్ల వాళ్ళ దిగుబడులు తగ్గడమే గాకుండా ఉత్పత్తుల నాణ్యత లోపిస్తుంది. ఈ తెగుళ్లను సాధారణంగా నిరోధించడం కష్టం. రసం పీల్చు పురుగులు అయిన తెల్లదోమ, పేనుబంక వంటి పురుగులు ఈ తెగుళ్లను వ్యాప్తి చేస్తున్నాయి. ఈ తెగుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగులను పురుగు మందులతో పాటు సాగు పద్ధతుల ద్వారా నివారించుకొని నష్టాన్ని అధిగమించవచ్చు.
రింగ్ స్పాట్ వైరస్:
ఈ తెగులు ఎక్కువగా వర్షాకాలంలో ఆశిస్తుంది. విత్తనం, పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. తైవాన్ రకాలపై ఎక్కువగా ఆశిస్తుంది. తొలిదశలో తెగులు సోకిన మొక్క ఆకులు పచ్చదనం కోల్పోయి పసుపు పచ్చగా మారతాయి. ఈనెలు వంగి ఆకులు ముడుచుకుపోతాయి. ఆకుల పరిమాణం తగ్గుతుంది. ప్రధాన కాండం పై భాగంలో, ఆకు తొడిమల పైన, మొవ్వ భాగంలోనూ నీటితో కూడిన ముదురు ఆకుపచ్చని చారలు కనిపిస్తాయి. ఆకుల్లో కిరణజన్య సంయోగ క్రియ తగ్గిపోతుంది. తెగులు తీవ్ర దశలో చెట్టు పై భాగం కుంచించుకొని పోయి సన్నగా మారుతుంది. మొక్క ఎదుగుదల క్షీణిస్తుంది. పూత, పిందెలు, పండ్ల పైన గోధుమ రంగుతో రింగులు ఏర్పడతాయి. తెగులు సోకిన చెట్లు అంతగా పిందె కట్టవు. పిందెలు ఎదగవు. నాణ్యత తగ్గుతుంది. రింగులు ఉన్న కాయలు త్వరగా పండి మెత్తబడతాయి.
నివారణ:
* నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటేటప్పుడు తెగుళ్ల లక్షణాలు కలిగిన వాటిని నాటరాదు.
* తెగులు సోకిన మొక్కలను గమనించి వెంటనే పీకి నాశనం చేయాలి.
* కలుపు మొక్కలు పొలంలోనూ, పొలం గట్లపైన లేకుండా శుభ్రం చేసుకోవాలి.
* పశువుల ఎరువు, వేపపిండి లాంటి ఎరువులను తప్పకుండా వేయాలి. సూక్ష్మ ధాతు * మిశ్రమాన్ని 3, 4 నెలల వయసులో తప్పనిసరిగా పిచికారీ చేయాలి.
* పాదులో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
* అంతర పంటగా టమాటా, వంగ, మిరప, పుచ్చ, బీర వంటి పంటలను సాగు చేయరాదు.
* వైరస్ తెగులు వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు 2.0 మి.లీ. డైమిథోయేట్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లొప్రిడ్ లేదా 0.2 గ్రా. ఎసిటామిప్రిడ్ మందును లీటరు నీటికి పిచికారీ చేసుకోవాలి.
Also Read: Minimum Support Price: 40 కోట్ల మంది రైతులకు కనీస మద్దతు ధర పెంచనున్న కేంద్ర ప్రభుత్వం
మొజాయిక్ తెగులు:
ఆకులపైన వర్ణం కణజాలం ఏర్పడి మొజాయిక్ లక్షణాలు కనపడతాయి. ఆకు తొడిమలపై కూడా మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. కాయ పరిమాణం తగ్గి నాణ్యత కోల్పోతుంది. తెగులు ఆశించిన మొక్క సాధారణంగా పసుపు రంగుతో, ముడుచుకొని పోయి ఆకారం కోల్పోతుంది. ఆకులు పూర్తిగా కాని, పాక్షికంగా కాని తీగలా మారతాయి. పరిమాణం తగ్గుతుంది. ముదురు ఆకులు రాలిపోయి మొక్కల చివర్లలో లేత ఆకులు కుచ్చులుగా మారతాయి. పంట దిగుబడి నాణ్యత గణనీయంగా తగ్గుతుంది.
నివారణ:
తెగులు సోకిన చెట్లను తీసి కాల్చివేయాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు 2.0 మి.లీ. డైమిథోయేట్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లొప్రిడ్ లేదా 0.2 గ్రా. ఎసిటామిప్రిడ్ మందును లీటరు నీటికి చెట్లపై పిచికారీ చేసుకోవాలి.
ఆకు ముడత:
ఆకు ముడత తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన చెట్ల ఆకులు ముడతలుగా ఏర్పడి ఆకులు, ఈనెలు, తొడిమలు వంకర్లు తిరుగుతాయి. కాయ సహజ ఆకారాన్ని కోల్పోతుంది. చెట్ల పెరుగుదల ఆగిపోతుంది.
నివారణ:
తెగులు సోకిన చెట్లను కాల్చివేయాలి. పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి 15-20 వరకు పొలంలో అక్కడక్కడా అమర్చుకోవాలి. తెగులు వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు 1.0 మి.లీ. స్పైరోమెసిఫెన్ లేదా 2.0 మి.లీ. డైమిథోయేట్ మందును లీటరు నీటికి చెట్లపై పిచికారీ చేసుకోవాలి.
Also Read: Petunia Cultivation: పెటునియా పూల సాగు.!