చీడపీడల యాజమాన్యం

Tea Mosquito Mugs (TMB): జీడిమామిడిలో ‘‘టీ’’ దోమ యాజమాన్యం.!

2
Tea Mosquito Bugs (TMB) in Cashew
Tea Mosquito Bugs (TMB) in Cashew

Tea Mosquito Bugs (TMB): ‘‘టీ’’ దోమ జీడి పంటను ఆశించే ప్రధాన కీటకం. తల్లి పురుగులు మరియు చిన్న పురుగులు రెండు కూడా లేత కొమ్మలు, పుష్ప గుచ్ఛాలు, కాయలు మరియు పండ్ల నుండి రసాన్ని పీల్చి చెట్టుకు హాని చేస్తాయి. ‘‘టీ’’ దోమ ఆశించిన చెట్లు కాలిపోయినట్లు కన్పిస్తాయి. మన దేశంలో హెలోపెల్టిస్‌ ఆంటోని, హెలోపెల్టిస్‌ బ్రాడీ, హెలోపెల్టిస్‌ థీవోరా, మరియు పాచిపెల్టిస్‌ మేసారమ్‌ అనే నాలుగు జాతులు కనిపిస్తాయి. వాటిలో, హెలోపెల్టిస్‌ ఆంటోని ఎక్కువగా వచ్చే జాతి. ప్రతి టీ దోమ 3 లేదా 4 కొమ్మలు, పుష్ప గుచ్ఛాలను నష్ట పరుస్తుంది. అనుకూల పరిస్థితులలో 20`80 శాతం వరకు నష్టాన్ని కలుగజేస్తుంది. అదే విధంగా, ‘‘టీ’’ దోమ వ్యాధికారక శిలీంద్రాలైన గ్లోయోస్పోరియం మాంజిఫెరే మరియు ఫోమోప్సిస్‌ అనకార్డితో కలిసి పూత ఎండు తెగులుకు కారణమవుతుంది. గ్లోయోస్పోరోయిడ్స్‌ మరియు బోట్రియోడిప్లోడియా థియోబ్రోమే శిలీంధ్రాలు కొమ్మ ఎండు తెగులు కలగజేయుటంలో కూడా ‘‘టీ’’ దోమ ఒక ముఖ్య కారకంలా వ్యవహరిస్తుంది.

జీవిత చక్రం:
తల్లి పురుగు సన్నగా, పొడుగుగా, 6 నుండి 8 మి.మీ పొడవు కలిగి ఎరుపు గోధుమ రంగులో ఉండును. తల నలుపుగా, ఉదరం ఎరుపుగా, కడుపు తెలుపుగా ఉండును. గుడ్డు వ్యవధి 6-12 రోజుల వరకు ఉంటుంది. చిన్న పురుగు దశ ఐదు ఇన్‌స్టార్‌లను కలిగి ఉండి 11-13 రోజుల్లో పూర్తవుతుంది. తల్లి పురుగులు 8 – 12 రోజులు జీవించి ఉంటారు మరియు ఒక ఆడ పురుగు తన జీవిత కాలంలో దాదాపు 60 – 80 గుడ్లు పెడుతుంది. మొత్తం జీవిత చక్రం 25-35 రోజుల్లో పూర్తవుతుంది. తల్లి పురుగు గుడ్లును ఒక్కొక్కటిగా లేదా 2 నుండి 6 సమూహాలలో లేత రెమ్మలలోకి, పుష్పగుచ్ఛము యొక్క కాడ పై, ఆకు మధ్యభాగంలో లేదా ఆకు కాడలలో ఏదో ఒక భాగంలో లోపలికి చొప్పించబడతాయి.

‘‘టీ’’ దోమ ఆశించే పంటలు :
‘‘టీ’’ దోమ చాలా రకాల పంటలను మరియు కలుపు మొక్కలను ఆశిస్తుంది. అవి నీలగిరి, వేప, మామిడి, జామ, రేగు, మహాగని,, కోకో, మునగ, మిరియాలు, ప్రత్తిలాంటి పంటలలో ఉండి జీడి మామిడి చిగురు వేసేటప్పుడు, పూత దశలో మరియు కాయ దశలో దాడి చేస్తుంది.
మన దేశంలో జీడి మామిడి పండిరచే చాలా ప్రాంతాలలో ఈ పురుగు వ్యాప్తి చెందుతుంది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ మరియు ఒరిస్సాలలో ఉంది. , ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు మరియు కర్ణాటకలలో వేప ప్రాధమిక అతిథేయిగా వ్యవహరిస్తుంది. ఈ ప్రాంతాల్లో వేప నుండి జీడిమామిడికు ‘‘టీ’’దోమ వ్యాపిస్తుంది.

Also Read: Watermelon Pests: ఖర్బూజ`పుచ్చకాయ పై ఆశించే పురుగులు.!

Tea Mosquito Bugs (TMB)

Tea Mosquito Bugs (TMB)

‘‘టీ’’ దోమ ఆశించే లక్షణాలు :
‘‘టీ’’ దోమ యొక్క పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు జీడిమామిడి లేత ఆకులు, కొమ్మలను, పూత రెమ్మలను, కాయలను మరియు జీడి ఆపిల్‌ ను ఆశించి వాటి రసాన్ని పీల్చుతుంది. రసాన్ని పీల్చడం వలన ఎర్రని జిగురు బిందువులు, పూత రెమ్మలపై లేత నల్లని పొడవైన కండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగు రసం పీల్చే సమయంలో కొన్ని విషపూరిత స్రావాలను కూడా విడుదల చేస్తుంది. దాని వలన రసం పీల్చిన భాగాల కణజాలం చనిపోయి నల్లని గాయాలుగా ఏర్పడును. పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్న పరిస్థితులలో కొమ్మలపై ఉన్న నల్లని గాయాలు కలిసిపోయి చివరికి కొమ్మలు ఎండిపోతాయి. పూత దశలో అయితే పూత రెమ్మలు ఎండిపోతాయి, పూత పిందెలు మాడిపోయి రాలిపోవడం జరుగుతుంది. దోమ సోకిన అపరిపక్వ కాయలు ముడుచుకుపోయి ఎండిపోతాయి, అదేవిధంగా పాత కాయలు మరియు ఆపిల్స్‌పై గజ్జి మచ్చలు వస్తాయి.

‘‘టీ’’ దోమ ఆశించే సమయం :
‘‘టీ’’ దోమ యద్దడి నైరుతి రుతుపవనాల విరమణ తర్వాత కొత్త చిగురులు వచ్చే అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో ప్రారంభమై, మే నెల వరకు కొనసాగును. గరిష్ట స్థాయి జనాభా జనవరి- మార్చి నెలలో ఉండును. కొత్తగా వేసిన తోటల్లో ‘‘టీ’’ దోమను నిరంతరం గమనించవచ్చు. సాధారణంగా వర్షాకాలంలో (జూన్‌ – సెప్టెంబర్‌) పురుగు ఉదృతి కనిష్టంగా ఉంటుంది.

‘‘టీ’’ దోమ యాజమాన్యం :
‘‘టీ’’ దోమ ఆశించే వేప, మామిడి మరియు మునగ లాంటి చెట్ల పై అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో ‘‘టీ’’ దోమ సంఖ్య పై నిఘా పెట్టాలి మరియు ‘‘టీ’’ దోమను జీడి మామిడిలో లేత చిగుర్లు వేసే దశ, పూత దశ, మరియు కాయ దశలలో నిఘాలో ఉంచి అదుపులో ఉంచాలి. 5-8 శాతం దెబ్బతిన్న లేత కొమ్మలు లేదా పుష్ప గుచ్ఛాలను ఆర్దిక పరిమిత స్థాయిగా పరిగణిస్తారు. సరైన పోషక నిర్వహణ మరియు చీడ పీడల యాజమాన్యం ఆరోగ్యకరమైన పంటకు, అధిక దిగుబడులు సాధించడానికి చాలా అవసరం. ఈ క్రింది విధంగా 1-3 సార్లు పురుగు ఉధృతిని అనుసరించి పురుగు మందులు వాడాలి.
మొదటి సారి: లామ్డా సైహలోత్రిన్‌ 0.6 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.6 మి. లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
రెండవ సారి: లామ్డా సైహలోత్రిన్‌ 0.6 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్‌ 2.0 మి.లీ. ఒక లీటరు. నీటికి కలిపి పిచికారి చేయాలి.
మూడవ సారి: లామ్డా సైహలోత్రిన్‌ 0.6 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్‌ 1.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయవలెను.

చిగుర్లు వేసే దశలో 5-8 శాతం కంటే ఎక్కువ పురుగు ఉదృతి గమనిస్తే మొదటి సారి పిచికారి చేయాలి. ‘‘టీ’’ దోమ జనాభా ఇంకా కొనసాగితే, స్ప్రేని 2-3 వారాలలోపు రెండవ సారి చేయాలి. నివారణా చర్యలను తీసుకోవాలి. రెండవ స్ప్రే తర్వాత కూడా పురుగు కొనసాగితే అవసరంను బట్టి మూడవ సారి పిచికారి చేయాలి. ఒక రౌండ్‌లో వాడిన పురుగు మందును వేరే రౌండ్‌కి వాడకూడదు. జీడి మామిడి అనేది కీటకాల ద్వారా పరాగసంపర్క జరిగే పంట అయినప్పటికీ, ఈ పురుగు మందుల పిచికారీ పుష్పించే కాలంలో కాయలు ఏర్పడడానికి ఎక్కువగా ప్రభావితం చేయదు. అయితే పిచికారీ చేసేటప్పుడు తేనెటీగలు నేరుగా పురుగుమందుకి తాకకుండా అవి ఎక్కువగా పరాగసంపర్కం చేసే సమయమైన ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల మధ్య స్ప్రే చేయక పోవడం మంచిది.

Also Read: Winter Calf Management: శీతాకాలంలో దూడల పెంపకం, వాటి యాజమాన్య పద్ధతులు.!

Leave Your Comments

Watermelon Pests: ఖర్బూజ`పుచ్చకాయ పై ఆశించే పురుగులు.!

Previous article

Sulfide Toxicity in Rice: వరిలో ‘‘సల్ఫైడ్‌’’ దుష్ప్రభావం యెక్క లక్షణాలు, నివారణ చర్యలు

Next article

You may also like