Pink bollworm: ఆర్ధిక నష్టపరిమితి స్థాయిని గుర్తించే విధానం – గులాబీ రంగు పురుగు ఉనికిని గుర్తించడానికి పంటపై ప్రత్యేక నిఘా ఉంచాలి. పొలంలో అక్కడక్కడా 50 పువ్వులను గమనించినప్పుడు వాటిలో 5 గుడ్డి పూలు ఉన్నట్లయితే లేదా పొలంలో అక్కడక్కడ ఒక మొక్కకు ఒక కాయ చొప్పున 20 కాయలను సేకరించి కోసి చూసినప్పుడు, 20 కాయలకు రెండు గొంగళి పురుగులను గమనించినట్లయితే, నష్టపరిమితి స్థాయిగా నిర్ధారించుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది.
పురుగు ఉనికిని నిర్ధారించే లక్షణాలు :
. గుడ్డి పూలు
. కాయ పై భాగంలో పురుగు బయటకు వచ్చే గుండ్రటి చిన్న రంధ్రం
. కాయ తొనలమధ్య గోడలపై గుండ్రటి రంధ్రం
. గుడ్డి పత్తి మరియు రంగు మారిన పత్తి
సమగ్ర యాజమాన్య పద్దతులు :
సమగ్ర యాజమాన్య పద్దతులను అనుసరించి గులాబీ రంగు పురుగును సమర్ధవంతంగా నివారించుకోవచ్చును. ప్రధానంగా పంట తీసిన తర్వాత, పంటలేని సమయాన, విత్తడానికి ముందు మరియు పంటకాలంలో వివిధ చర్యలు చేపట్టాలి.
పంట తీసిన తర్వాత చేపట్టవలసిన పద్ధతులు :
. ప్రధాన పత్తి పంట పూర్తైన వెంటనే పంట విరామ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి.
. నీటి వసతి ఉన్నప్పటికీ, పత్తిని ఆరు నెలలకు మించి పొడిగించకుండా తీసివేయాలి.
. పత్తి తీతల తర్వాత చేనులో గొర్రెలు, మేకలు మరియు పశువులను మేపాలి. పత్తి మోళ్ళను ట్రాక్టరు రోటావేటరుతో భూమిలో కలియదున్నాలి.
. నీటి వసతి ఉన్నచోట రెండో పంటగా ఇతర ఆరుతడి పంటల్ని సాగుచేసుకోవాలి.
. పత్తి తీసిన తర్వాత ఎండిన మోళ్ళను, విచ్చుకోని కాయలను భూమిలో కలియ దున్నుట ద్వారా పురుగు దశలను నాశనం చేయవచ్చును.
. గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని రైతుల ఇళ్ళ వద్ద గాని లేదా జిన్నింగ్ మిల్లుల వద్దగాని నిల్వ ఉంచకూడదు. పత్తి మిల్లులలో పత్తి జిన్నింగ్ అయిన తర్వాత వచ్చే గుడ్డి పత్తి మరియు పురుగు ఆశించిన దూది విత్తనాలను నాశనము చేయాలి.
. లింగాకర్షణ బుట్టలను పత్తి జిన్నింగ్ మిల్లులలో అమర్చడం ద్వారా మగ పురుగులను ఆకర్షించి తదుపరి సంతతిని నివారించవచ్చు.
. గులాబి రంగు పురుగు అధికముగా ఆశించిన ప్రాంతాల నుండి పత్తిని లేదా విత్తనాన్ని వినియోగించడం కోసం తరలించరాదు.
పంటలేని సమయాన చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు :
. ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకొనుట ద్వారా పురుగు యొక్క కోశస్థదశలను సమర్ధవంతంగా నాశనం చేయవచ్చును.
. ఒకే ప్రాంతములో బి.టి. పత్తిని పండిరచే రైతులందరూ సామూహికంగా లింగాకర్షక బుట్టలను అమర్చి మగ పురుగులను ఆకర్షించడం ద్వారా పురుగు యొక్క మొదటి తరాలను తద్వారా పంటకాలంలోని పురుగు యొక్క ఉనికిని తొందరగా రాకుండా కాపాడుకోవచ్చు.
. పత్తి మోళ్ళను పొలము లేక ఇళ్ళ వద్ద వంట చెఱుకుగా వాడేందుకు నిల్వ చేయరాదు.
. ఒక ప్రాంతములో పత్తిని దఫదఫాలుగా కాకుండా ఒకే సమయంలో విత్తడం వలన పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
పత్తి విత్తడానికి ముందు, పంటకాలంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు :
. పంట మార్పిడి పద్ధతిని రెండు – మూడు సంవత్సరాలకొకసారి విధిగా పాటించాలి.
. తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపికచేసుకొని సకాలంలో విత్తుకోవటం ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చును.
. పత్తి పొలంలో మరియు చేను చుట్టూ తుత్తురు బెండ, ఉమ్మెత్త లాంటి ఆతిథ్యమిచ్చే కలుపు మొక్కలు లేకుండా చేయడం మరియు పత్తి పంట దగ్గరలో బెండ పంట లేకుండా చూసుకోవాలి.
. పంటకు సంబంధించి సకాలంలో సమగ్రవంతమైన యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా సేంద్రియ ఎరువులు మరియు నత్రజని ఎరువుల సమతుల్యత పాటించి ఉధృతిని తగ్గించవచ్చు.
. పత్తి పంట విత్తిన 45 రోజుల నుండి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి, వరుసగా బుట్టలలో మూడురోజులు, రోజుకు 8 రెక్కల పురుగులను పడటం గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
. గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డిపూలు, రాలిన పూత మరియు పిందెలను పంటకాలములో గమనించినట్లయితే వెంటనే సేకరించి సమూలంగా నాశనం చేయాలి.
. ట్రైకోగ్రామా పరాన్నజీవులను ఒక ఎకరానికి 60,000 చొప్పున మూడు విడతలుగా, వారం రోజుల వ్యవధిలో పూత పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు విడుదల చేయడం వలన గుడ్ల దశలోనున్న పురుగును నివారించవచ్చు.
. గులాబీ రంగు పురుగు ఉధృతి ఆర్ధిక నష్టపరిమితిస్థాయి దాటిన వెంటనే నివారణకు ఈ క్రింది రసాయనిక మందులను పిచికారి చేసుకోవాలి.
. క్వినాల్ఫాస్ 25 ఇసి. 2.0 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 20 ఇ.సి. 2.5 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్ 50 ఇ.సి. 2 మి.లీ. లేదా థయోడికార్బ్ 75 డబ్ల్యూ.పి. 1.5 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
. పంట ఆఖరిదశ కాలంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైన సైపర్మెత్రిన్ 2.సి. 1.0 మి.లీ లేదా లాజాసైహలోత్రిన్ 5.0 ఇ.సి. 1.0 మి.లీ. లేదా బైఫెన్ త్రిన్ 10 ఇ.సి. 1.6 మి.లీ. చొప్పున ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు.
గమనిక : సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు పత్తి పంటపై ఎక్కువ సార్లు పిచికారి చేయరాదు. చేసినట్లయితే రసం పీల్చే పురుగులైన పేనుబంక మరియు తెల్లదోమ యొక్క ఉధృతి పెరిగే అవకాశమున్నది.
ప్రత్యేక సూచనలు :
. మొక్క లేత ఆకులు మరియు మొగ్గలపైన పెట్టే పచ్చపురుగు గ్రుడ్లను గుర్తించి నాశనం చేయాలి.
. మూడవ దశ దాటిన పచ్చపురుగు మీద పురుగు మందులు ఆశించినంత సమర్ధవంతంగా పని చేయవు కాబట్టి చేతితో ఏరివేసి సస్యరక్షణ చేపట్టాలి.
. పచ్చపురుగు మరియు తెల్లదోమ ఆశించినప్పుడు సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు పిచికారి చేయరాదు.
. మందు ద్రావణాన్ని సిఫారసు చేసిన మోతాదులో సిఫార్సు చేసిన సస్యరక్షణ పరికరాలతో సరియైన పద్ధతిలో పిచికారి చేయాలి.