నార పంటల్లో జనుము, గోగు అతి ముఖ్యమైన వాణిజ్య పంటలు. గోగులో రెండు రకాల జాతులు… కూరగోగు, నారగోగు ఉన్నాయి. భారత దేశంలో నారగోగు పంటను అస్సాం, బీహార్ ఒరిస్సా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఏపీలో ఎక్కువగా ఈ నారగోగు పంటను ఉత్తర కోస్తా ప్రాంతాల్లో విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లో నార కోసం సాగుచేస్తున్నారు. ఒకప్పుడు ఈ పంట సుమారు 15000 హెక్టార్లలో సాగులో ఉండేది. కానీ ప్రస్తుతం కేవలం 2000 నుంచి 2500 హెక్టార్లకు మాత్రమే పరిమితమయింది.
నారగోగు పంటను నారకోసం మాత్రమే కాకుండా అనేక రకాలైన ఉత్పత్తులను కూడా తయారు చేస్తారు. గోగు మొక్కల నుంచి తీసిన గుజ్జు వార్తాపత్రికల ముద్రణకు అవసరమయ్యే కాగితాన్ని తయారు చేయడానికి, గోగు పూల రక్షక పత్రాలను సహజరంగుల తయారీలో, గోగు విత్తనాల నుంచి తీసిన నూనె సబ్బుల పరిశ్రమలో ఉపయోగిస్తారు. గోగునారతో అందాలు చిందే పలు రకాల గృహోపకరణ వస్తువులు, గోగునారను జనపనారతో కలిపి తివాచీలు, సంచులు, పురి, అలాగే ప్యాకింగ్ కోసం అవసరమయ్యే సంచుల తయారీకి వినియోగిస్తారు. అంతేకాకుండా గోగు పూల రక్షక పత్రాల నుంచి టీ ని కూడా తయారు చేస్తారు. గోగు కట్టెను వంట చేరకుగా, సీలింగ్ కోసం పనికి వచ్చే కార్డు బోర్డుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలున్న నారగోగు పంటను ప్రస్తుత కాలంలో చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే సాగు చేస్తున్నారు. కూలీల కొరత కారణంగా, ఊర వేసే పద్ధతిలో ఉండే సమస్యల వల్ల విస్తీర్ణం రాను రాను తగ్గుతుంది. అంతేకాకుండా పంట దిగుబడిలో సుమారు 40% పురుగులు, తెగుళ్ల వల్ల నష్టం కలుగుతుంది. సరైన కాలంలో చీడపీడలను గుర్తించి, వీటి నివారణకు సస్యరక్షణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
గోగు పంటనాశించే పురుగులు:
గోగు పంటను ఎక్కువగా రసం పీల్చు పురుగుల జాతికి చెందిన పిండినల్లి, పేనుబంక, తెల్లదోమలు, దీపపు పురుగులతో పాటు పచ్చగొంగళి పురుగు ఎక్కువగా ఆశించి నష్ట పరుస్తాయి.
పిండినల్లి: రెక్కలు లేని తల్లి పురుగులు గులాబీ రంగు శరీరం కలిగి తెల్లటి మైనపు పూతతో కప్పి ఉంటుంది. మగ పురుగులు ఒక జత సున్నితమైన పారదర్శక రెక్కలు కలిగి చాలా అరుదుగా కనిపిస్తాయి. తల్లి పురుగు 200-300 గుడ్లను సముదాయంగా భూమిలో పెట్టి తెల్లటి మైనం పూతతో కప్పుతాయి.
నష్ట లక్షణాలు:
- తల్లి, పిల్ల పురుగులు మైనంవంటి తెల్లని పొడితో కప్పబడి మొక్క కొనభాగాన లేత కణుపుల వద్ద చేరి రసాన్ని పీల్చడం వల్ల కణుపులు దగ్గర దగ్గరగా ఏర్పడి మొక్క చిగురు భాగం ముద్దబంతి ఆకారంగా తయారవుతుంది.
- పురుగు ఆశించిన ఆకులు, తొడిమలు చిన్నవిగా తయారవుతాయి. కాండము ఎదుగదల మందగించి కొమ్మలు ఎక్కువగా వస్తాయి.
- పిండినల్లి మొక్కల నుంచి రసం పీల్చిన తర్వాత సుక్రోజ్ వంటి తియ్యటి పదార్థాలను విసర్జిస్తుంది. ఈ తియ్యటి పదార్థాల కోసం నల్లటి చీమల ఉనికిని ఎక్కువగా పిండినల్లి ఆశించిన మొక్కలపై గమనించవచ్చు.
పేనుబంక:
- లేత పసుపు రంగు రెక్కలు లేని పిల్ల పురుగులు క్రమేపీ వారంలో మెరిసే పెద్ద పురుగులుగా మార్పు చెందుతాయి.
- ఆకుల అడుగుబాగాన గుంపులుగా ఉండే ఈ పురుగులు రసాన్ని పీల్చడం వల్ల ఆకులు లోపలి వైపుకు ముడతపడి ఆకారం కోల్పోతాయి.
- ఆశించిన ఆకులు, పిందే, రక్షక పత్రాలు వాడి రాలిపోతాయి. మొక్క ఎదుగుదల, దిగుబడి, నాణ్యత తగ్గుతాయి.
దీపపు పురుగులు:
- పెద్ద దోమలు రెక్కలతో పొడవుగా, పిల్ల పురుగులు రెక్కలు లేకుండా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తల్లి దోమలు ఆకుల ఈనెల మధ్య గుడ్లను పెడతాయి. ఈ దోమలు గోగుతో పాటు బెండ, పత్తి, వంగ, ఇతర పంటల్లో కూడా ఆశించి నష్ట పరుస్తాయి.
- దీపపు పురుగులు మే నుంచి జూలై నెలాఖరు వరకు ఎక్కువగా ఆశిస్తాయి.
- పిల్ల, తల్లి పురుగులు ఆకు అడుగు భాగంలో ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు క్రమేపి ఎర్రబారి, అంచుల కొన భాగం వంకరలు తిరిగి ముడుచుకొనిపోతాయి. పురుగు తాకిడి ఎక్కువైతే మొక్కలు ఎదగక గిడసబారతాయి.
తెల్లదోమ:
- తెల్ల దోమ పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి ఉంటాయి. పెద్ద పురుగులు రెక్కలు కలిగి ఎగురుతూ ఉంటాయి. ఇవి ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకి మారి మొక్కలు ఎదగక గిడసబారి ఎండిపోతాయి. తెల్లదోమ పల్లాకు తెగులు వ్యాప్తికి దోహదపడతాయి.
నివారణ: - కిలో విత్తనానికి 5మి.లీ.ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్.తో విత్తనశుద్ధి చేసి విత్తుకున్నట్లయితే పంట తొలిదశలో సుమారు 20 నుంచి 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుంచి పంటను రక్షించుకోవచ్చు.
- పిండినల్లి ఆశించిన మొక్కలను సేకరించి కాల్చివేయాలి.
- గట్ల వెంట, పొలంలో కలుపు మొక్కలు ఏరివేయాలి.
- తొలిదశలో పిండినల్లి నివారణకు లీటరు నీటికి 5 మి. లీ.వేపనూనె, ఒక గ్రాము సబ్బు పొడి చొప్పున కలిపి పంటపై పిచికారి చేయాలి.
- తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే పసుపు రంగు డబ్బాలకు జిగురు పూసి పొలంలో అక్కడక్కడ ఉంచినట్లయితే తెల్లదోమలు ఆకర్షించబడి జిగురుకు అంటుకుంటాయి.
- రసాయనిక పురుగుమందులైన డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ప్రోఫినోఫాస్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా./ లీటరు నీటికి కలిపి మొక్కలు బాగా తడిచేలా పచికారి చేయాలి.
పచ్చ గొంగళి పురుగు:
- ఈ పురుగు ఎక్కువగా జనుము పంటను ఆశిస్తుంది. తల్లి పురుగు ఆకు అడుగు భాగాన పసుపు రంగు గుడ్లు పెడుతుంది. తల్లి రెక్కల పురుగు గోధుమ రంగు రెక్కలు కలిగి ఉంటుంది. గుడ్లు మూడు రోజుల్లో పొదిగి గొంగళి పురుగులుగా మారి ఆకులను తిని నష్ట పరుస్తాయి.
- పచ్చ గొంగళి పురుగు గోగు పంటను ఏ దశలోనైనా ఆశిస్తుంది. తోలి దశలో అనగా జూలై నుంచి సెప్టెంబర్ మాసాల్లో ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- నత్రజని ఎరువులు ఎక్కువగా వాడిన పొలాల్లో ఈ పురుగు ఎక్కువగా నష్టం కలిగిస్తుంది.
- తీవ్రస్థాయిలో ఆకుల అంచులను తిని ఈనెలను మాత్రమే మిగులుస్తుంది.
- మొక్క చిగుళ్ళను కూడా ఈ పురుగు ఆశిస్తుంది. దీనివల్ల మొక్క ఎదుగుదల ఆగిపోయి దిగుబడి, నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది.
నివారణ:
- ఆకులపై గొంగళి పురుగులు, గుడ్లు కనిపించిన వెంటనే ఏరి నాశనం చేయాలి.
- తొలిదశలో పురుగు నివారణకు వేపనూనె 5 మి.లీ., ఒక గ్రాము సబ్బు పొడి చొప్పున లీటరు నీటికి కలిపి పంటపై పిచికారి చేయాలి.
- పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ప్రోఫినోఫాస్ 2 మి.లీ.లేదా ఎసిఫేట్ 1.5 గ్రా.లేదా థయోడికార్బ్ 1 గ్రా. లేదా ఇమామెక్టిన్ బెంజొయేట్ 0.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
డా.జి.చిట్టిబాబు, డా.బి. స్వాతి, డా. వై. సంధ్య రాణి,
డా.ఏం. శ్రీనివాసరావు, డా.జి. శ్రీనివాస్,
వ్యవసాయ పరిశోధన స్థానం, ఆమదాలవలస