Insect Management: మన రాష్ట్రంలో కోస్తా ప్రాంతంలో విస్తారంగా సాగు చేయబడుతున్న కొబ్బరి, ఆయిల్‌పామ్ శాశ్వత అంతరపంటగా సాగు చేయడం అత్యంత అనువైన పంటగా కోకో ఉంది. దీని యొక్క ఆకురాల్చే గుణం ఎక్కువగా ఉండడం వల్ల భూమిలో సేంద్రియ పదార్థం పెరుగుదల ఎక్కువగా ఉపయోగపడుతుంది కోకో గింజలను చాక్లెట్లు, బేకరీ కేకుల తయారీలో వినియోగిస్తారు. కోకో పంటలో ఎక్కువగా కీటకాలు ఆశిస్తున్నట్లు గమనించడమైనది. అందువలన ఉన్నట్లయితే ప్రధాన పంటలతో పాటు అధిక ఆదాయం లభిస్తుంది.
పిండి పురుగులు:
కోకోను అధికంగా ఆశిస్తున్న కీటకాలలో పిండి పురుగులు ప్రధానమైనవి. ఇవి లేత చిగుళ్ళు, పూగుత్తులు, పువ్వలు చిన్న మరియు పెద్ద కాయలపై వాలి రసం పీల్చుతాయి. దీని కారణంగా కోకో ఎదుగుదల నిలిచిపోయి దెబ్బతినే అవకాశం ఉంది.
యాజమాన్యం:
పిండి పురుగుల నివారణకు రెండు మిల్లీ లీటర్ల ప్రొఫెనోఫాస్ మందును లీటరు నీటికి కలపాలి. లేదా డైమిథోయేట్ (రోగార్ను) 2 మి.లీ చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. పిండి పురుగులు మళ్లీ ఆశించడం గమనించినట్లయితే నెల రోజుల తరువాత మళ్లీ పిచికారీ చేయాలి.
Also Read: Crops Importance in Agriculture: వ్యవసాయంలో ఎర పంటలు, కంచె పంటల ప్రాముఖ్యత
తేయాకు దోమ:
ఇది ముఖ్యంగా కోకో యొక్క కాయల మీద ఆశిస్తుంది. మొదట కాయ మీద నీటితడి లాంటి గుండ్రని మచ్చలు ఏర్పడి తరువాత నల్లగా మారుతుంది. ఇది ఉధృతి అధికంగా ఉన్నట్లయితే కాయలు నల్లగా మారి వాటి ఆకారాన్ని కోల్పోతాయి.
యాజమాన్యం:
దీని నివారణకు రెండు మిల్లీ లీటర్ల ప్రొఫెనోఫాస్ ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి ఆ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
పేనుబంక:
పేనుబంక ప్రధానంగా లేత పత్రాల దిగువ భాగాన, లేత కొమ్మలు, పూగుత్తులు మరియు లేత కాయలపై ఆశిస్తాయి. ఈ పేనుబంక ఆశించిన పూలు రాలిపోవుట, లేత కాయలు ఎండిపోవడం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా లేత పత్రాలు ముడుచుకుపోయే అవకాశం కూడా ఉంది.
యాజమాన్యం:
దీని నివారణకు ఒక లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫేట్ లేదా రెండు మిల్లీ లీటర్లు డైమిథోయేట్ కలిపిన మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
గూడు పురుగు:
ఈ పురుగులు లేత పత్రాలు, కొమ్మలు, లేత కాయలను మరియు పెద్ద కాయలను ఆశిస్తాయి. ఇవి ఆకుపచ్చని భాగాన్ని తిని మిగిలిన ఆకులను గూళ్ళు కట్టుకొని జీవిస్తాయి. కాబట్టి మొక్కలపై వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
యాజమాన్యం:
దీని నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్ల డైమిధోయేట్ లేదా మెటాసిస్టాక్స్ను పిచికారీ చేయాలి.
గులాబీ పెంకు పురుగు:
ఈ పురుగు లేత మొక్కలనే కాక ఎదిగిన మొక్కల ఆకులను నష్టపరిచే అవకాశం ఎక్కువగా ఉంది. లేత గోధుమ రంగులో ఉండే తల్లి పురుగులు రాత్రిపూట ఆకుల మధ్యభాగంలో చేరి ఆకుపచ్చని పదార్థాన్ని అంతా తినేసి ఆకులను మారుస్తాయి.
పెంకు పురుగుల ఉధృతి:
లేత మొక్కలపై ఉన్నట్లయితే మొక్కల పెరుగుదల తగ్గే అవకాశం ఉంది
నల్ల పెంకు పురుగు:
ఈ పురుగులు ఎక్కువగా లేత మొక్కల ఆకులు, ఎదిగిన మొక్కల ఆకులను రెండిరటిని ఆశిస్తాయి. తల్లి పురుగులు రాత్రిపూట ఆకుల భాగాలను చేరుకొని అంచుల వెంబడితింటూ ఆకు మొత్తాన్ని తిని వేస్తాయి.
యాజమాన్యం:
ఈ పెంకు పురుగుల పెరుగుదల నివారణకు అవకాశం ఉన్న చోట దీపపు ఎరలను విరివిగా వాడవచ్చు. బెనేవియా 0.25 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
బుట్ట పురుగు:
ఈ బుట్ట పురుగు గొంగళిపురుగు దశలో ఉన్నప్పుడు తన శరీరం చుట్టూ బుట్ట ఏర్పరుచుకుని అడుగు భాగంలో ఉంటుంది. 9 నుండి 13 సమానమైన కర్రపుల్లలను ఉపయోగించుకొని సమాంతరంగా శరీరం చుట్టూ అల్లుకొంటాయి. బుట్ట పురుగు ఆశించిన ఆకులలో తొలిదశలో గుండ్రటి ఆకృతి రంధ్రాలను ఏర్పరచి తరువాత ఆకులను పూర్తిగా తిని వేస్తాయి. ఉదృతి ఎక్కువగా ఉంటే కాయలను కూడా ఆశిస్తాయి. బుట్ట పురుగును జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఎందుకంటే ఇది కొబ్బరి ఆయిల్‌పామ్ కూడా ఆశిస్తుంది.
ఆకు తినే గొంగళి పురుగులు:
ఈ గొంగళి పురుగులు ఎక్కువగా తొలకరి తరువాత వచ్చే లేతచిగుళ్ళు ఆశిస్తాయి. జూలై నుండి ఫిబ్రవరి వరకు వీటి ఉధృతి పెరగడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆకులనే కాక కోకో కాయలపై పైపొరను కూడా ఆశించి నష్టపరుస్తాయి.
యాజమాన్యం:
వీటి నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము/ లీటరు లేదా క్వినాల్ఫాస్ రెండు మిల్లీ లీటర్లు లీటరు లేదా వేపనూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
రసం పీల్చే పురుగులు:
పిండి నల్లి:
ఈ పురుగు గుంపులు, గుంపులుగా లేతకొమ్మలు, పూలు, పూలతొడిమలు, లేత పిందెలు మరియు అన్ని దశలలో కాయలు ఆశిస్తాయి. ఈ పురుగు జూలై, అక్టోబర్ నెలలో అధికంగా ఉంటుంది.
యాజమాన్యం:
రసం పీల్చే పిండినల్లి నివారణకు 50 శాతం ఇసి. రెండు మి.లీ / లీటర్లు లేదా వేపనూనె (అజాడిరక్టిన్ 10,000 పిపయం) ఐదు మి.లీ/ లీ
టరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
తామర పురుగులు:
ఇవి ఎక్కువగా లేత ఆకులు, కాయలను ఆశిస్తాయి. ఈ పురుగు ఆశించిన కాయలు గిడసబారినట్లు ఉంటాయి.
యాజమాన్యం:
వీటి నివారణకు ఫిప్రోనిల్ రెండు మి.లీ / లీటరు లేదా ఎసిఫేట్ ఒక గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
బెరడు తొలుచు పురుగు:
ఈ మధ్యకాలంలో కోకోలో బెరడు తొలుచు పురుగును తీవ్రస్థాయిలో గమనించడం జరిగింది. తల్లి పురుగులు మే, జూలై మాసాలలో కోశస్థ దశ నుంచి బయటకు వచ్చి బెరడు వదులుగా ఉన్న ప్రదేశాలలో గుడ్లు పెడతాయి. పిల్ల గొంగళి పురుగు బెరడును తిని కాండంలోకి చొచ్చుకుని పోతాయి. పగటి పూట కాండంలో ఉంటూ రాత్రి సమయాలలో అవి విసర్జించిన పదార్థాలతో ఒక గొట్టము వంటి ఆకారాన్ని తయారు చేసి ఆ మార్గము ద్వారా బయటకు వచ్చి తింటాయి. చెట్టు కాండం పైన చూస్తే ఈ పురుగు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి కొన్నిసార్లు రైతులు లక్షణాలను గమనించి చెద పురుగులు ఆశించాయని అపోహపడతారు. ఈ గొంగళి పురుగు దశ సుమారు తొమ్మిది నుండి పది నెలల వరకు ఉంటుంది. ఈ పురుగు ఆశించడం వలన చెట్టు కాండంపై బెరడు కోల్పోయే పుష్పాలు రాక పిందెలు కూడా ఏర్పడే అవకాశం ఉంది.
యాజమాన్యం:
పురుగు ప్రవేశించే రంధ్రాలను గమనించి మోనోక్రోటోఫాస్ రెండు మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి డైక్లోరోవాస్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి కానీ ఈ రంధ్రాలలోకి పంపాలిమ, పనస వంటి చెట్లలో కూడా బెరడు తొలుచు పురుగు ఆశిస్తుంది. కాబట్టి తగు నివారణా చర్యలు చేపట్టాలి. సరైన సమయంలో కొమ్మ కత్తిరింపులు చేయడం ద్వారా బెరడు తొలిచే పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
ఎలుకలు,ఉడతలు:
ఇవి రెండు కాయలను అధికంగా నష్టపరుస్తాయి. ఎలుకలు ఎక్కువగా కాయల తొడిమ దగ్గర తిని రంధ్రాలు చేస్తాయి. మరియు అన్ని రకాల వయస్సు గల కాయలను నష్టం కలుగ చేసే అవకాశం ఉంది. ఉడతలు పక్వానికి వచ్చిన కాయ మధ్యభాగంలో తిని రంధ్రాలు చేసి లోపల గుజ్జుతింటాయి.
యాజమాన్యం:
ఎలుకలను నివారించటానికి 10 గ్రాముల బ్రోమోడయోలిన్ కేకులను 0.05 శాతం కోకో చెట్టు కొమ్మలలో 10 నుండి 12 రోజుల వ్యవధిలో రెండుసార్లు పెట్టాలివైర్మెస్ బోనులతో కొబ్బరి ముక్కలను ఎరగా వాడి ఉడతలను పట్టుకోవచ్చు. కాయలు పక్వానికి వచ్చిన వెంటనే కోయడం వలన కూడా ఉడతల వల్ల కలిగే నష్టం సంభవించకుండా ఆపవచ్చు.
డా.ఎన్. బి. వి చలపతిరావు, ప్రధాన శాస్త్రవేత్త, (కీటక విభాగం)
డా.భగవాన్, ప్రధాన శాస్త్రవేత్త, (ఉద్యాన విభాగం) & హెడ్
డా.డి దేవికారాణి, సహా పరిశోధకురాలు (కీటక విభాగం)
ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట తూర్పుగోదావరి, ఫోన్: 98497 69231
Also Read: Pulses Crops: పప్పుధాన్యాల పంటలలో నేల మరియు సీడ్‌బెడ్ తయారీలో మెళుకువలు