Seed Storage: పంట ఉత్పత్తుల వృధా అరికట్టడం పంట పండిరచడంతో సమానం. కాబట్టి రైతులు ఎంతో కష్టపడి పండిరచిన ధాన్యాన్ని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. వివిధ పరిశోధనా ఫలితాల ఆధారంగా నిల్వ చేసుకున్న విత్తనాలలో 15 నుంచి 25శాతం వరకు కీటకాలు మరియు శిలీంధ్రాల వలన నష్టం జరుగుతున్నది. ధాన్యం యొక్క నష్ట నివారణకి రైతులు నిల్వలో కొన్ని మెళకువలు తప్పనిసరిగా పాటించాలి.
విత్తనాలు నిల్వ సమయంలో చెడిపోవడానికి ముఖ్యమైన కారణాలు :
. విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండటం.
. భద్రపరచిన గదిలో తేమ మరియు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం.
. పూర్తిగా శుభ్రం చేయకుండా విత్తనాలను నిల్వ చేయడం.
విత్తనాన్ని కీటకాలు ఆశించే ప్రదేశాలు :
. చీడపీడలు సాధారణంగా పొలం నుండి, కళ్ళాల నుండి గోదాములలోనికి ప్రవేశిస్తాయి. విత్తనాన్ని కీటకాలు నాలుగు విధాలుగా ఆశించడం జరుగుతుంది.
. పొలంలో పంట పరిపక్వ దశలో ఉన్నప్పుడు తల్లి పురుగులు గింజలపై గ్రుడ్లు పెడతాయి. అవే గింజలను గోదాములలో నిల్వ చేయడం వలన వాటి సంతతి అభివృద్ధి చెందుతుంది.
. గోదాముల్లోని గోడలకు ఉండే చీలిక లేక పగుళ్ళలో ఈ పురుగుల వివిధ దశలు దాగి వుండి, తదుపరి నిల్వ విత్తనాన్ని ఆశిస్తాయి.
. విత్తన నిల్వ కోసం వాడే గోనె సంచుల్లో ఈ కీటకాల వివిధ దశలు దాగి ఉంటాయి. అవే సంచుల్లో తిరిగి క్రొత్త విత్తనాన్ని నిల్వ చేస్తే ఈ పురుగులు క్రొత్త విత్తనాన్ని ఆశించి నష్టపరుస్తాయి.
. విత్తన రవాణా సాధారణంగా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీలు, రైలు వంటి వాహనాల ద్వారా జరుగుతుంది. రవాణాకు ముందు ఈ వాహనాలను శుభ్రం చేయకపోవటం వల్ల వాటిలో దాగి ఉండే పురుగులు క్రొత్త విత్తనాన్ని ఆశించి నష్టం కలిగిస్తాయి.
నిల్వ సమయంలో ఆశించు ముఖ్యమైన పురుగులు :
1. వడ్ల చిలుక :
వరి ధాన్యాన్ని ఆశించే అతి ముఖ్యమైన పురుగు వడ్ల చిలుక. ఇది సీతాకోక చిలుకల జాతికి చెందినది. రెక్కల పురుగులు లేత గోధుమరంగులో ఉంటాయి. ఇవి వడ్లపై ఎగురుతూ ఒక్కో గుడ్డు పెడతాయి. గుడ్ల నుంచి వెలువడిన లార్వాలు ధాన్యం లోపలికి వెళ్ళి లోపలి పదార్థాన్ని తిని అక్కడే కోశస్థ దశకు చేరుతుంది. వారం రోజుల్లో రెక్కల పురుగులు గుండ్రని రంధ్రం ద్వారా బయటకు వస్తాయి. వీటి జీవిత చక్రం 30 నుండి 32 రోజుల్లో పూర్తవుతుంది.
2. ముక్కు పురుగు :
ఈ పురుగు యొక్క తల భాగం ముందుకు పొడుగ్గా పొడుచుకొని వచ్చినట్లు ఉంటుంది. కాబట్టి దీనిని ముక్కుపురుగు అంటారు. తల్లి పురుగు ధాన్యం మీద చిన్న రంధ్రం చేసి దానిలో గుడ్లని పెడుతుంది. గుడ్లనుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజలోకి పోయి తిని అక్కడే కోశస్థ దశకు చేరుతాయి. వారం రోజుల్లో తల్లి పురుగు ఏర్పడి గుండ్రని రంధ్రం చేసుకొని బయటకు వస్తాయి.
3. నుసిపురుగు :
ఇది పెంకుపురుగు. దీని తల కిందికి వంగినట్లుగా ఉంటుంది. తల్లి పురుగులు గింజల మీద గుడ్లను పెడతాయి. గుడ్లనుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజలోనికి పోయి లోపలి పదార్థాన్ని తిని అక్కడే కోశస్థ దశకు చేరి 5నుంచి 6 రోజుల్లో పెద్ద పురుగులుగా తయారవుతాయి. అవి గింజల మీద ఆకారం లేని పెద్ద రంధ్రాలు చేస్తాయి. వీటి జీవిత చక్రం 2 నెలల్లో పూర్తవుతుంది.
4. అపరాలను ఆశించే పుచ్చు పురుగు :
ఈ పురుగు గింజలపైన గ్రుడ్లను పెడుతుంది. గ్రుడ్ల నుంచి వచ్చిన లార్వా గింజలోనికి ప్రవేశించి లోపలి పదార్థాలను తింటూ కోశస్థ దశకు చేరుతుంది. వారం రోజుల తరువాత తల్లి పురుగు గింజ పైన గుండ్రని రంధ్రం చేసుకొని బయటకు వస్తుంది.
5. వేరుశనగను ఆశించే పుచ్చు పురుగు :
ఇది వేరుశనగ కాయల మీద రంధ్రం చేసి గింజలను తింటూ అపార నష్టాన్ని కలుగజేస్తుంది.
6. బియ్యం చిలుక :
ఈ పురుగు ఎక్కువగా విరిగిన ధాన్యాన్ని ఆశించి నష్టం కలుగజేస్తుంది. తల్లి రెక్కల పురుగులు పెట్టిన గుడ్డునుంచి 3 నుంచి 6 రోజుల్లో లార్వాలు వెలువడుతాయి. వీటి లార్వాల ద్వారా వెలువడిన సిల్కు దారాల వల్ల ధాన్యంలో తుట్టెలు ఏర్పడతాయి. లార్వాలు గోదాముల బయటికి వచ్చి అక్కడ తెల్లటి స్థావరం ఏర్పరచుకొని కోశస్థ దశకు వెళతాయి. వారం రోజుల్లో తల్లి రెక్కల పురుగులు వెలువడుతాయి.
Also Read: Sulfide Toxicity in Rice: వరిలో ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావం యెక్క లక్షణాలు, నివారణ చర్యలు
ధాన్యం నిల్వలో తీసుకోవలసిన చర్యలు :
. కల్లంలో పురుగు పట్టిన గింజలు లేకుండా చూడాలి.
. కోతల సమయంలో ధాన్యంలో తేమ సుమారు 24 శాతం వరకు ఉంటుంది. అందువలన ధాన్యం నిలువ చేసే ముందు 14 శాతం తేమ ఉండేటట్లుగా ఎండలో ఆరబెట్టాలి. వేరుశనగ గింజల్లో తేమ 7 శాతం కన్నా తక్కువ ఉండేలా బాగా ఎండబెట్టిన తర్వాత నిల్వ చేయాలి. తేమ అధికంగా వుండే వాటిలో పురుగు తొందరగా పడటమే కాక శిలీంధ్రాలు ఎక్కువై అఫ్లోటాక్సిన్ అనే విష పదార్థ శాతం అధికమవుతుంది. మొక్కజొన్నలో తేమ 13 నుండి 15% తగ్గే వరకు టార్పన్ ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.
. నిల్వ చేసే ముందు గోదాములను శుభ్రపరచాలి. గతేడాది పంట తాలూకు మిగిలిపోయినవి తీసి బయట పారబోయాలి. గోదాముల్లో ఒకవేళ పురుగు పట్టి వుంటే వంద లీటర్ల నీటికి ఒక లీటరు మలాథియాన్ చొప్పున కలిపి వంద చదరపు మీటర్లకు 3 లీటర్ల ద్రావణం చల్లాలి లేదా 3 లీటర్ల నీటికి 50 గ్రాముల డెల్టామిత్రిన్ కలిపి 100 చదరపు మీటర్లకు పిచికారీ చేయాలి.
. నిలువ వున్న పాత ధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలుపరాదు.
. వీలైనంత వరకు కొత్త సంచులలో ధాన్యం నిలువ చేయాలి. పాత సంచులను వాడేటప్పుడు పాత ధాన్యం, క్రిమి కీటకాలు లేకుండా వాటిని శుభ్రపరచి ఎండబెట్టాలి. వాటికి చిరుగులుంటే కుట్టి వాటిని ఒక పెద్ద డ్రమ్ములో గానీ, పెట్టెలో గాని పెట్టి దానిలో ఒక అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళను వేసి డ్రమ్ము నుంచి గాలి బయటకు పోకుండా సీలుచేసి వారం రోజుల తరువాత ఆ గోతాలు తీసి వాడాలి.
. ధాన్యం నింపిన బస్తాలను నేలకు, గోడలకు తగలకుండా, తేమ లేని పొడి ప్రదేశంలో చెక్క బల్లల మీద నిలువ చేయాలి. అలాగే లాటు లాటుకి 2`3 అడుగుల దూరం వుండేలా చూడాలి. దీనివల్ల పురుగు వున్నది లేనిదిపరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవచ్చును.
. వేరుశనగ పుచ్చు పురుగు తప్ప వేరుశనగలో వచ్చే తక్కిన పురుగులు ఏవీ కూడా వేరుశనగ కాయలను నిల్వ ఉంచినా హాని చేయలేవు కాబట్టి, వేరుశనగను గింజలు తీసి నిల్వ వుంచటం కంటే కాయలు గానే నిల్వ చేయటం సురక్షితం.
. గోదాముల్లో ధాన్యం నిలువ చేసే డబ్బాలు తేమగా వుండరాదు. గోదాములను ఎతైన ప్రదేశంలో నిర్మించాలి. తేమ లోపలికి చొరబడకుండా జాగ్రత్త వహించాలి. గోదాము నేలలు, గోడలు, పై కప్పులు బీటలు లేకుండా చూడాలి.
. వీలైతే గోడలకు సున్నం లేదా రంగులను వేయించాలి. గోదాం లోపల, బయట పురుగు మందులను పిచికారీ చేయాలి. గోదాముల కిటికీలు, తలుపులకు ఖాళీలు, రంధ్రాలు లేకుండా చేయాలి. ఎలుకలు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ చేసే బస్తాలను వేడినీటిలో మరిగించి తీసి ఎండలో ఆరబెట్టాలి.
. అపరాలను చిక్కగా వేసిన జనపనార సంచులలో గాని లేక పాలిథీన్ అమర్చిన గోనె సంచులలో గాని, నైలాన్ సంచులలో గాని నిలువ చేయాలి.
. బస్తాలు ఒకదానిపై ఒకటి పెట్టేటప్పుడు వాటి మధ్యలో గాలి ఆడడానికి ఖాళీ ఉంచాలి.
. గోదాముల్లో ఎలుక బోనులను వుంచాలి. సంచుల్లోని ధాన్యాన్ని గింజ వేడెక్కుతుందా, రంగు మారుతుందా, ముక్కవాసన వస్తుందా, బూజు పడుతుందా అనే విషయాలను ప్రతి 15 రోజులకొకసారి పరీక్షించాలి.
. రాసుల్లో గాని, గోతాల్లో గాని నిల్వ వుంచిన వేరుశనగ కొత్త కాయల్లో పుచ్చుపురుగు పడినా అది కాయల్లో పైపైన వుంటుంది. కనుక సిఫారసు చేసిన పురుగు మందులు నేరుగా కాయలపైనే పిచికారీ చేయాలి.
నివారణ చర్యలు :
. తులసి, యూకలిప్టస్ ఆకులు, వేపఆకులు, వసకొమ్ములు, సీతాఫలం గింజల పొడి మొదలైనవి నిల్వలో ఆశించే పురుగులను నివారిస్తాయి.
. ధాన్యానికి వేపాకు పొడి మరియు మొక్కజొన్న కండెలను కాల్చగా వచ్చిన బూడిద కలిపినపుడు రెండు కూడా నుసిపురుగులనుంచి కాపాడతాయి.
. ఆముదం పొడి మొక్కజొన్న గింజలతో కలిపి ముక్కు పురుగు నుంచి రక్షించుకోవచ్చును.
. 100 కిలోల వరి ధాన్యానికి 2 కిలోల వేప గింజల పొడిని కలిపితే బియ్యపు చిలక తదితర పురుగులు ఆశించవు.
. ‘‘పరాద్’’ అనే ఆయుర్వేద బిళ్ళలను క్వింటాలుకు 4 చొప్పున ఉంచితే పిండిపురుగు, తుట్టెపురుగు, మొక్కజొన్నలో ముక్కుపురుగు, నుసి పురుగులను నివారించవచ్చును. క్వింటాలుకు 50 గ్రా. ‘‘పల్ సేఫ్’’ కలిపి కూడా పై పురుగులను నివారించవచ్చును.
. విషవాయువులతో గోదాములను నింపి పురుగు నివారణ చర్యలు చేపట్టాలి.
. విషవాయువుతో నింపటానికి ముందుగా, నల్లటి పాలిథీన్ పేపరును బస్తాల మీద పరవటానికి అనువుగా వుంచుకోవాలి. కిటికీలను, వెంటిలేటర్లను మూసి, గాలి వెలుపలికి పోకుండా చేయాలి.
. గోదాములలో నిలువ చేసిన ధాన్య రక్షణకు టన్నుకు 3 గ్రా. అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలను 1 నుండి 2 ఉపయోగించి కాని, లేక 140 బిళ్ళలను ప్రతి 100 క్యుబిక్ మీటర్ల స్థలమునకు ఉపయోగించి ప్లాస్టిక్ కవర్‌తో కప్పివుంచాలి.
. ఇథిలిన్ డైబ్రోమైడ్ 5 మి.లీ ఒక క్వింటాలు ధాన్యానికి లేదా 3 మి.లీ ఒక క్వింటాలు అపరాలకు గాని ఉపయోగించి గాలి వెలుపలికి పోకుండా 7 రోజుల వరకు జాగ్రత్త పడాలి.
. వేరుశగనలో పుచ్చుపురుగు ఆశించినపుడు మలాథియాన్ 125 గ్రా. / 5 లీటర్ల నీటిలో కలిపి గోతాలపై బాగా తడిచేలా చల్లాలి. లేదా మలాథియాన్ పొడిగాని, డెల్టామెత్రిన్ పొడి గాని, 500 గ్రా. ఒక టన్ను కాయల్లో కలపాలి.
. విషవాయువులను నూనెగింజల సంరక్షణకు ఉపయోగించరాదు. అలా కలిపితే పురుగు మందుల అవశేషాలు ఎక్కువ స్థాయిలో గింజల్లో వుండి హాని కలిగిస్తాయి.
. గోదాముల్లో ఎలుకలను గమనిస్తే అల్యూమినియం ఫాస్ఫైడ్ 2 బిళ్ళలు ఒక క్వింటాలు గింజలకు వుంచాలి. లేదా ముష్ కేక్ను వుంచాలి. జింక్ ఫాన్సైడ్ మందు పెట్టాలంటే ముందు 2 నుండి 3 రోజులు విషం లేని ఆహారం పెట్టి తర్వాత 2 గ్రా. విషం, 2గ్రాముల నూనె, వరి తవుడు లేదా నూకలు 96 గ్రాములు కలిపి పెట్టాలి. ఇది ఒక రోజు మాత్రమే పెట్టాలి.
గోదాముల్లో బస్తాలను నిలువ చేయు విధానం: తేమ నేల నుండి బస్తాలకు సోకకుండా వుండటానికి బస్తాలను 1.5 మీటర్ల పొడవు మరియు 1 మీటరు వెడల్పు గల దీర్ఘచతురస్రాకారపు చెక్కలపైన వుంచాలి.
1) సాధారణ పద్ధతి : ఈ పద్ధతిలో బస్తాలను ఒకదానిపై ఒకటి పొడవుగా వుంచి, అదేవిధంగా పై వరుసలలో కూడా అమర్చవలెను. ఈ పద్ధతిని వడ్లకు, జొన్నలకు వాడవచ్చు దీనిలో 14 వరుసల కన్నా ఎక్కువ వుంచుటకు వీలుకాదు.
2) వంకర టింకర పద్ధతి : బస్తాలను ఒక పద్ధతి ప్రకారం, ఒక వరుసలో పొడవుగా, రెండవ వరుసలో వెడల్పుగా,మూడవ వరుసలో తిరిగి పొడవుగా, 4 వ వరుసలో వెడల్పుగా అమర్చవలెను ఇది మంచి పద్ధతి. బస్తాలు పాడవకుండా వుంటాయి.
3) బ్లాక్ పద్ధతి : ఈ పద్ధతిలో ప్రతి వరుసలో ఒక బస్తా పొడవుగా, రెండవ బస్తా వెడల్పుగా అమర్చవలెను. ప్రతి భాగంలో ఒక బస్తా పొడవువైపు, రెండు బస్తాలు వెడల్పు వైపు వుండును. ఈ పద్ధతిలో బస్తాలను లెక్కించుట సులభము.
Also Read: Tea Mosquito Mugs (TMB): జీడిమామిడిలో ‘‘టీ’’ దోమ యాజమాన్యం.!