Important Herbicide Properties – కాపర్ సల్ఫేట్ (మైలుతుత్తము): కాపర్ సల్ఫేటు మైలుతుత్తముగా మార్కెట్లో దొరుకుతుంది. దీనిని ముఖ్యంగా నీటిలో మునిగి ఉండే నాచుజాతి మొక్కల నిర్ములనకు ఉపయోగిస్తారు. ఇది తేలికగా నీటిలో కరుగుతుంది. కనుక స్ప్రే చేయవచ్చు. లేదా పౌడరుగా నీరు నిలిచి ఉన్న కాలువలలో, చెరువులో నాచు జాతి మొక్కల నిర్ములనకు వాడవచ్చు.
సాధారణంగా పది లక్షల పాళ్ళ నీటిని ఒక పాలు మైలుతుత్తం అనగా 1 పి. పి. యమ్. చొప్పున వాడినప్పుడు చెరువులో చేపలకు లేదా ఆ నీరు పారె చాలా పంటలకు ఇబ్బంది లేకుండా నాచు జాతి కలుపు మొక్కల నిర్ములనకు వాడవచ్చు. అయితే స్ప్రే చేసేటపుడు మామూలు ఇత్తడి లోహపు స్ప్రేయర్లు వాడితే పాడవుతాయి. కనుక ప్లాస్టిక్ స్ప్రై ట్యాంకు ఉన్న స్ప్రేయర్లను వాడాలి. నిలువ నీరు ఉన్న చోట మైలుతుత్తము గుళికలు ఒక సంచిలో కట్టి అడుగున వేయుట కానీ, పడవ వెనుక లాగుట లేదా సమానంగా చల్లుట ద్వారా నాచు నిర్మూలించవచ్చు.
2-4 డి సోడియం సాల్ట్: ఈ మందును ఎక్కువ వరి, చెరకు, గోధుమ, మొక్క జొన్న, జొన్న మొదలగు పైర్లలో ఆకు జాతి మొక్కల నిర్ములనకు వాడుతారు. ఈ మందు తెల్లని నీటిలో కరిగే పొడి మందు, ఆకులు, వెళ్ళ ద్వారా మొక్కలు మందును తీసుకుంటాయి. పంటలో సాధారణంగా పంటను బట్టి కలుపును బట్టి ఎకరాకు 400గ్రా. నుంచి ఒక కిలో 80% పొడి మందును వాడవచ్చు. ప్రక్కన ద్విదళబీజ పైర్లు ప్రత్యేకించి ప్రత్తి, మిరప వంటి పైర్లు ఉన్నపుడు ఈ మందును స్ప్రే చేయకూడదు. ఆలా చేస్తే ఆ పైర్లు దెబ్బ తింటాయి. ఈ మందు అవశేషాలలో నెలలో సుమారు 1-4 వారలు ఉంటాయి. నీటి కలుపు మొక్కలైన గుర్రపు డెక్క, తూటి కాడ, అడవి తూడు, జమ్ముగడ్డి మొదలగు వాటి నిర్ములనకు ఈ మందును పెరాక్వాట్ తో కలిపి స్ప్రే చేయాలి.
2-4 డి అమైన్ సాల్ట్: 2-5డి అమైన్ సాల్ట్ సాధారణంగా ద్రావకంగా లభ్యమవుతుంది. ఇది నీటిలో తేలికగా కరుగుతుంది. ఈ మందును వరి , చెరకు, మొక్కజొన్న, మొదలగు పైర్లలో ఆకు జాతి మొక్కల నిర్ములనకు, కొంత వరకు తుంగను నిర్మూలించుటకు ఎకరాకు 400 మీ. లి నుండి 500 మీ. లీ. వరకు వాడవచ్చు. ఈ మందును మొక్క వేళ్ళ, ఆకుల ద్వారా కూడా తీసుకుంటుంది. నీటిలో కలుపు మొక్కలైన గుర్రపు డెక్క, అడవి తూడు, తూటి కాడ వంటి వాటి నిర్ములనకు కూడా వాడవచ్చు.
ఆలాక్లోర్: ఈ కలుపు మందును మొక్క జొన్న, చెరకు, అపరాలు, ప్రత్తి, వేరుశెనగ, నువ్వులు, ప్రొద్దు తిరుగుడు మొదలగు అనేక పంటలలో ముఖ్యంగా ఏక వార్షిక గడ్డి జాతి మొక్కల నిర్ములనకు పైరు విత్తిన వెంటనే ఆయా పంటలకు సిఫార్సు చేసిన మోతదులో వాడాలి.
మెట్రిబుజిన్: మెట్రిబుజిన్ కలుపు మందు ట్రయజైన్ గ్రూపులో అట్రాజిన్ కన్నా శక్తివంతమైనది, దీనిని చెరకు, ఆలుగడ్డ, మొదలగు పైర్లలో విత్తిన తర్వాత వాడుకొనవచ్చు. ఇది చాలా రకాల వెడల్పాకు మొక్కలను నిర్మూలిస్తుంది. దీనిని చెరకులో 2-4 డి సోడియం సాల్ట్ తో కూడా సిఫార్సు చేసిన మోతదులో వాడినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి.