Natural Pesticide : ఎంత పెట్టుబడి పెట్టినా పంటకు కావాల్సిన పోషకాలు అందించకపోతే నష్టమే మిగులుతుంది. పోషకాలు పక్కనపెడితే పంటను నాశనం చేసే చీడపురుగుల భయం ప్రతి రైతుకు ఉంటుంది. చీడపురుగుల బెడద నుంచి బయటపడటానికి రైతు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. వేలు వెచ్చించి రసాయన ఎరువులు కొని పంటకు పిచికారీ చేస్తాడు. కానీ కొన్ని సార్లు ప్రయత్నం విఫలం అయి పెట్టుబడి కూడా మిగలకుండా తీవ్రంగా నష్టపోతాడు. కానీ కొన్ని మెళుకువలు పాటించి పంటకు పోషకాలను అందిస్తే అధిక దిగుబడి, ఆరోగ్యకరమైన పంట చేతికొస్తుంది.
మన పరిసర ప్రాంతాల్లో ఉండే అన్ని వనమూలికలతో కషాయం తయారు Natural Pesticide చేసుకోవచ్చు. పశువులు మేతగా తినని, ఆకులు, మొక్కలు, పొలంలో ఉండే కలుపు మొక్కలు ఇవన్నీ ఔషధ మొక్కలే. అయితే వాటి వేర్లు, కాండం చాలా అవసరం. వేర్లలో కాల్షియం, కాండంలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. సీజన్లో లభించే అవశేషాలు, వేప గింజలు, ఎండిన సీతాఫలం కాయలు, కానుగ కాయలు, ఈ మూడు గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మూడు గింజలు 5 కిలోల మేర ఒక పెద్ద డ్రమ్ములో గానీ, ఇతర టబ్బులలో గానీ నిలువ చేసుకోవాలి. అందులో 50 లీటర్ల నీటితో నింపాలి. అదేవిధంగా 10 లీటర్ల ఆవు మూత్రం పోసి ఆ మొత్తం మిశ్రమాన్ని పూర్తిగా కలపాలి. ఇక మూడు రోజుల తర్వాత మనకు అందుబాటులో ఉండే ప్రకృతి ప్రసాదించిన కాయలు, గింజల్ని, ఆకులతో ముఖ్యంగా తంగేడి ఆకులు ఇలా అన్ని రకాల ఆకులను మిశ్రమంలో చేర్చాలి. Organic pesticide
డ్రమ్ములో ఉన్న మిశ్రమంలో మరో 2 వందల లీటర్ల నీటిని నింపాలి. తర్వాత 5 రోజుల తర్వాత అందులో ఉన్న ఆకులు, కాయలు మురిగిపోయి అడుగు భాగాన చేరుతాయి. తర్వాత ఒక పెద్ద కర్రతో మిశ్రమాన్ని కలపాలి. వారం రోజుల తర్వాత మిశ్రమం అంత కిందకు చేరగా అందులో ఉన్న నీరు మట్టి రంగులోకి మారి ఘాటు వాసన వస్తుంది. ఆ ద్రావణాన్ని బయటకు తీసి పంట పొలాల్లో పిచికారీ చేసుకోవాలి. పంటలో ఎటువంటి చీడపురుగుల్ని అయినా ఆ ద్రావణం నశించేలా చేస్తుంది. అంతేకాకుండా మొక్కలకు కావాల్సిన పోషకాలు, శక్తిని అందజేస్తుంది. కాగా… ఆ ద్రావణాన్ని ఆరు మాసాల వరకు నిల్వ ఉంచవచ్చు.