Stem Borer in Rabi Paddy: తెలంగాణలో సాగు చేసే ప్రధానమైన ఆహార పంటల్లో వరి ముఖ్యమైనది. యాసంగిలో వేసిన వరి పైర్లు దుబ్బు చేసే దశ నుండి చిరుపొట్ట దశలో ఉన్నాయి. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న వరి పైర్లలో కాండం తొలిచే పురుగు/ మొగి పురుగు మరియు ఉల్లికోడు / గొట్టపు రోగం ఆశిస్తున్ననట్లు గమనించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు సకాలంలో ఈ పురుగుల ఉనికిని గమనించి, ఉధృతి బట్టి సమయానుకూలంగా సరైన యాజమాన్య పద్థతులను ఈ క్రింద వివరించిన విధంగా చేపట్టాల్సిందిగా తెలియజేయటం జరిగింది.
కాండం తొలిచే పురుగు/ మొగి పురుగు :
నష్టపరిచే లక్షణాలు :
. కాండం తొలిచే పురుగు తల్లి ఆడ పురుగులు ముదురు గోధుమ/ఎండు గడ్డి/పసుపు రంగులో, ముందు జత రెక్కలపై నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి.
. గోధుమ రంగు వెంట్రుకలతో కప్పబడిన గ్రుడ్ల సముదాయం ఆకు కోనలపై కనపడుతుంది.
. వరిని ఆశించే కాండం తొలిచే పురుగు, పంటను నారుమడి నుండి ఈనే దశ వరకు ఎప్పుడైనా ఆశించే అవకాశం ఉంటుంది.
. నారు మడిలో ఆశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే మొవ్వులు ఎండి చనిపోతాయి.
. అంకురం నుండి చిరుపొట్ట దశలో ఆశిస్తే, ఈనే దశలో గింజలకు పోషక పదార్థాలు అందక, గింజలన్నీ తాలు గింజలుగా మారి తెల్ల కంకులు ఏర్పడతాయి.
పురుగు ఉధృతికి అనుకూలమైన పరిస్థితులు :
. ఆలస్యంగా లేదా ముదురు నారు నాటడం
. కరువు పరిస్థితులు
. తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు
. సూర్యరశ్మి రోజుకు 7 గంటల కంటే తక్కువ
. నత్రజనికి సంబంధించిన ఎరువులను మోతాదుకి మించి వాటడం
. ముఖ్యంగా యాసంగి వరి పైరులో, ఈ పురుగు ఎక్కువగా ఆశించే అవకాశముంటుంది.
ఆర్థిక నష్ట పరిమితి స్థాయి :
చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు లేదా లింగాకర్షక బుట్టలలో వారానికి బుట్టకు 25-30 మగ రెక్కల పురుగులు గమనించిప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
Also Read: Seed Storage: విత్తన నిల్వ సమయంలో ఆశించు ముఖ్యమైన పురుగులు – యాజమాన్యం
యాజమాన్య పద్థతులు :
. పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎర, సోలార్ దీపపు ఎర లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకోని రెక్కల పురుగులపై నిఘా పెట్టాలి.
. పిలక దశలో ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలు పెట్టి అందులో వారానికి బుట్టకు 25-30 మగ రెక్కల పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
. నారు పీకే 7 రోజుల ముందు ఎకరాకు సరిపడే నారుమడికి 800 గ్రా. కార్బొఫ్యూరాన్ 3జి గుళికలు లేదా 600 గ్రా. ల ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి.
. ముదురు నారు నాటేటప్పుడు నారు కొనలను త్రుంచి నాటాలి. నారుమడిలో కాండం తొలిచే పురుగు యొక్క గుడ్ల సముదాయం నారు కొనల మీద ఉంటె ప్రధాన పొలాల్లో పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది గనుక, కోనలను త్రుంచి నాటాలి.
. ఒకవేళ నారు మడిలో గుళికలు వేయకపోతే, 15 రోజులు వయసున్న పిలకదశలో ఉన్న వరి పైరులో తప్పకుండా కార్బొఫ్యూరాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోలు వేయాలి.
. ట్రైకోగ్రామా గ్గ్రుడ్డు పరాన్న జీవులను నాటిన 25 రోజుల నుంచి ఎకరాకు 4 కార్డుల చొప్పున 5 దఫాలుగా 10 రోజుల వ్యవధిలో వదలాలి.
. ఉదృతిని బట్టి, సస్యరక్షణ మందులైన క్వినాల్ ఫాస్ 2 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారీ చేయాలి.
ఉల్లికోడు / గొట్టపు రోగం :
నష్ట పరిచే లక్షణాలు :
. తల్లి పురుగులు ఎరుపుతో కూడిన ఇటుక రంగు వర్ణంలో దోమ వలే ఆకారంలో ఉంటుంది.
. గ్రుడ్లను విడివిడిగా ఆకుల అడుగు భాగాన పెడుతుంది.
. గ్రుడ్డు నుండి వచ్చిన వెంటనే పిల్ల పురుగు కాండం లోనికి తొలుచుకొని పోయి అంకురం వద్ద వృద్ధి చెందుతుంది.
. అంకురం ఉల్లి బొందులాగా లేక ఆకు పచ్చని పోడుగాటి గొట్టంగా మార్పు చెంది బయటకు వస్తుంది.
. పెరుగుతున్న పిలక మొగి (ఉల్లి) గొట్టాలుగా మారును.
పురుగు ఉధృతికి అనుకూలమైన పరిస్థితులు :
. ఉల్లికోడు తట్టుకోని రకాలను సాగుచేయడం
. ఆలస్యంగా నాట్లు వేయడం
. గాలిలో అధిక తేమ శాతం (82-88%) కలిగి ఉండడం
ఆర్థిక నష్ట పరిమితి స్థాయి :
నారు మడి : నారు మడి:చదరపు మీటరుకు 1 ఉల్లికోడు సోకిన పిలక
పిలక దశ : 5 శాతం ఉల్లి గొట్టాలు లేక దుబ్బుకి 1 కోడు సోకిన పిలక
యాజమాన్య పద్ధతులు :
. ఉల్లికోడు ఉధృతి ఉన్న ప్రాంతాల్లో, తప్పనిసరిగా ఉల్లికోడుని తట్టుకొనే రకాలను సాగుచేయాలి.
. నారు మొలకెత్తిన 10-15 రోజుల లోపు ఎకరాకు సరిపడే నారుమడికి 800 గ్రా. కార్బొఫ్యూరాన్ 3జి గుళికలు వేయాలి.
. నాటిన 10-15 రోజుల్లో కార్బొఫ్యూరాన్ 3జి గుళికలు 10 కిలోలు వేయాలి లేదా ఫిప్రోనిల్ 0.3జి గుళికలు 8 కిలోలు ఎకరానికి బురద పదునులో చల్లుకోవాలి.
. సస్యరక్షణ మందులైన ఫిప్రోనిల్ 5 ఎస్.సి 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
. అంకురం ఏర్పడే దశ నుండి నాటిన (50-60 రోజులకి) చిరుపొట్ట దశలో గమనించినట్లయితే ఎలాంటి పురుగు మందులు వాడిన ఉపయోగం ఉండదు.
ప్రస్తుత పరిస్థితుల్లో, రైతులు తమ పొలాన్ని ఎప్పటికప్పుడు సందర్శించి, పైన తెలిపిన పురుగుల ఉనికిని సకాలంలో గమనించి, ఉధృతి బట్టి సరిjైున సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే, పురుగు యొక్క ఉధృతిని అదుపు చేసే అవకాశముంటుంది.
Also Read: Sulfide Toxicity in Rice: వరిలో ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావం యెక్క లక్షణాలు, నివారణ చర్యలు