చీడపీడల యాజమాన్యంతెలంగాణతెలంగాణ సేద్యం

పంటలను అశిస్తున్న చీడపీడలను ఎలా నివారించుకోవాలి ?  

0

రైతులు సాగుచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన పంటల్లో వివిధరకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఆశించాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి, పత్తి, కంది, వేరుశనగ, మిరప, పసుపు, బత్తాయి పంటల్లో ఏయే పురుగులు, తెగుళ్లు సోకటానికి అనుకూల పరిస్థితులున్నాయి, వాటిని ఎలా నివారించుకోవాలో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వర్శిటీలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా.ఎస్.జి. మహాదేవప్ప ఇలా తెలియజేస్తున్నారు…

వరిలో:

వరిలో మెడవిరుపు తెగులు గమనించినచోట్ల నివారణకు 2.5 గ్రా. ట్రైసైక్లోజోల్ + మాంకోజేబ్ లేదా 1.6 మి.లీ. ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఉదృతి అధికంగా ఉన్నట్లయితే 1 మి.లీ. అజాక్సీస్ట్రోబిన్ + ట్రైసైక్లోజోల్ లేదా 0.4 గ్రా. టెబుకోనజోల్ + ట్రైఫ్లోక్సీస్ట్రోబిన్ 75 డబ్ల్యు. జి లేదా 2 మి.లీ. పికాక్సీస్ట్రోబిన్ + ట్రైసైక్లోజోల్ లేదా 1 మి.లీ. ఆజాక్సీస్ట్రోబిన్ + డైఫెన్ కొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో కంకినల్లి ఆశించవచ్చు. నివారణకు 5 మి.లీ. డైకోఫాల్ లేదా 1 మి.లీ. స్పైరోమేసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వరిలో గింజమచ్చ తెగులు ఆశించిన ప్రాంతాల్లో 1మి.లీ. ప్రోపికొనజోల్ + 1మి.లీ. స్పైరోమేసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పత్తిలో:

పత్తిలో గులాబి రంగు పురుగు ఆశించేందుకు అనుకూల పరిస్థితులున్నందున నివారణకు పొలం గట్లమీద ఉన్న వయ్యారి భామ కలుపు నివారించాలి. ఎకరాకు 8-10 లింగాకర్షక బుట్టలను సామూహికంగా పెట్టి రెక్కల పురుగులను బందించడం లేదా ఎకరాకు 4 లిగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా 2- 3 రోజులు బుట్టకు 7- 8 రెక్కల పురుగులు గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. నివారణకు 2మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2.5మి.లీ. క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ పురుగు నివారణకు మందుల పిచికారి ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 4గంటల తర్వాత చేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో తెల్ల దోమ ఆశించటానికి  అనుకూలం. దీని నివారణకు 2మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.2గ్రా. ఎసిటామిప్రిడ్ లేదా 1 మి.లీ స్పైరోమేసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కందిలో:

కందిలో శనగపచ్చ పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. శనగ పచ్చ పురుగు లార్వాలను తినటానికి వీలుగా ఎకరాకు 10-15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. శనగ పచ్చ పురుగుల ఉనికిని గమనించేందుకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు గుడ్లు, తొలిదశ లార్వాల నివారణకు 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారి చేయాలి. ఉదృతి తక్కువగా ఉన్నప్పుడు 1.5గ్రా. ఎసిఫేట్ లేదా 2 మి.లీ. క్వినాల్ ఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కందిలో ఆకుచుట్టు పురుగు గమనించినచోట్ల నివారణకు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. క్వినాల్ఫాస్ లేదా 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కందిలో పేనుబంక గమనిస్తే 2మి.లీ. డైమిథోయేట్ లేదా 1.6మి.లీ. మోనోక్రోటోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వేరుశనగలో:

వేరుశనగలో పొగాకు లద్దె పురుగు ఆశిస్తోంది. దీని నివారణకు జల్లెడ ఆకులు ఏరి పురుగులను నాశనం చేయాలి. ఎకరానికి 10-15 పక్షి స్థావరాలను ఏర్పర్చుకోవాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేపగింజల కషాయం పిచికారి చేయాలి. ఎదిగిన లార్వాల నివారణకు 1మి.లీ. నోవాల్యూరాన్ లేదా 0.2మి.లీ. ప్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వేరుశనగలో టిక్కాఆకుమచ్చ తెగులు నివారణకు ఒక మి.లీ. టెబ్యుకోనజోల్ లేదా 2 గ్రా. క్లోరోథాలోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. వేరుశనగలో ఆకుముడత పురుగు గమనిస్తే 2.5మి.లీ. క్లోరిపైరిపాస్ లేదా 1.5గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మిరపలో:

మిరపలో తామర పురుగులు ఆశించే పరిస్థితులున్నాయి. నివారణకు ఎకరానికి 8-10 (నీలం, పసుపు, ఎరుపు రంగు) జిగురు అట్టలను అమర్చాలి. 2మి.లీ. థయాక్లోప్రిడ్ లేదా 2మి.లీ. క్లోర్ ఫెనపిర్ లేదా 2.5మి.లీ. టోల్ ఫెన్ పైరాడ్ లేదా 1.2గ్రా. డైఫెన్ థయూరాన్ మందును 5మి.లీ. 1500పిపియం వేపనూనెతో పాటు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో కోయినోఫొర కొమ్మకుళ్ళు తెగులు సోకినచోట్ల 3 గ్రా. పైరాక్లోస్ట్రోబిన్ + మెటిరామ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో పొగాకు లద్దె పురుగుఆశిస్తే 1.25 మి.లీ. నోవాల్యూరాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

టమాటలో:

టమాటలో ఆకుమాడు తెగులు కనిపిస్తోంది. దీని నివారణకు 3 గ్రా. మాంకోజేబ్ లేదా 1 మి.లీ. ప్రోపికొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పసుపులో:

పసుపులో దుంప, వేరుకుళ్ళు తెగులు ఆశించవచ్చు. వీటి నివారణకు 2.5గ్రా. మేఫేనొక్షమ్ మరియు మాంకోజెబ్ లేదా 2గ్రా. కాప్టాన్ లేదా 3గ్రా. కాపర్ఆక్సీక్లోరైడ్ మందును మొక్కల మొదళ్ళు తడిచేలా పోయాలి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పసుపులో దుంప తొలుచు ఈగ ఆశిస్తుంది. దీనికి ముందు జాగ్రత్త చర్యగా ఎకరాకు 100కిలోల వేప పిండిని మొక్కల మధ్య వేయాలి. పసుపులో ఆకు మచ్చ తెగులు సోకిన చోట్ల ఒక గ్రాము థయోఫానేట్ మిథైల్ లేదా 1మి.లీ. ప్రోపికొనజోల్ లేదా 2మి.లీ. హెక్సాకొనజోల్ మందు, 1మి.లీ. శాండోవిట్ లేదా ధనువిట్ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బత్తాయిలో:

బత్తాయిలో ఆకుముడత పురుగు ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యగా 5మి.లీ. వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉదృతి అధికంగా ఉన్నప్పుడు 1.5మి.లీ. ప్రొఫెనోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బత్తాయిలో గజ్జి తెగులు సోకిన కొమ్మలను, ఆకులను కత్తిరించి కాల్చివేయాలి. పది లీటర్ల నీటికి 30 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ + 1గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ చొప్పున కలిపి పిచికారి చేయాలి.

Leave Your Comments

ఎన్. జి. రంగా 124 జయంతి

Previous article

ఉద్యానపంటల్లో శిక్షణకు తెలంగాణాలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  

Next article

You may also like