ఆంధ్రప్రదేశ్చీడపీడల యాజమాన్యంజాతీయంతెలంగాణరైతులువార్తలు

NPSS Mobile Application: పంటల్లో చీడపీడల నియంత్రణకు కేంద్ర వ్యవసాయ శాఖ మొబైల్ యాప్

0

బొల్లి వేణు బాబు
సహాయక సస్య సంరక్షణ అధికారి ( ఏంటమాలజి)
సమగ్ర సస్య రక్షణ విభాగం,
మొక్కల సంరక్షణ,తనిఖీ సంచాలక కార్యాలయం,
భారత వ్యవసాయ శాఖ, ఫరీదాబాద్
మెయిల్ ఐడి: bolli.venubabu@gov.in

NPSS Mobile Application: వ్యవసాయం భారతీయ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. అయితే ప్రతి సంవత్సరం వివిధ రకాల తెగుళ్లు, వ్యాధులు పంటలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయి,సాంప్రదాయకంగా ఈ ప్రమాదాలను నియంత్రించడానికి రైతులు విచ్చలవిడిగా రసాయనిక పురుగుమందులను ఉపయోగిస్తారు.ఈ విపరీత పురుగు మందుల వాడకం వల్ల కలిగే నష్టాలు అనేకం ఉన్నాయి. జల, వాయు, భూ కాలుష్యం తద్వారా పర్యావరణ అసమతుల్యం, జంతువుల్లో, పక్షుల్లో , మనుషుల్లో కలిగే అనారోగ్యాలు, చీడల్లో పురుగుమందుల నిరోధకత కూడా పెరుగుతుంది. చీడ పీడలు,సమగ్ర పురుగు మందుల వాడకం గురించి రైతులకు సరైన సమాచారం లేకపోవటం వల్ల వారు సస్యరక్షణ సమాచారం కోసం పురుగు మందుల డీలర్లపై ఆధారపడుతున్నారు.ఈ సమస్యను అధిగమించేందుకు భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 , 2024 న దేశ రాజధాని ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఆడిటోరియంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ (NPSS) అనే AI ఆధారిత మొబైల్ యాప్, వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించారు.
రైతుల పొలాల్లో చీడపీడలను త్వరగా గుర్తించి వాటి నివారణకు సత్వర సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ భారత వ్యవసాయ శాఖ పరిధిలోని మొక్కల సంరక్షణ తనిఖీ, నిల్వల సంచాలక కార్యాలయం (డిపిపిక్యూఎస్), ఐసిఏఆర్ శాస్త్రవేత్తల సహకారంతో ఈ నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టం (జాతీయ చీడ పీడల పర్యవేక్షణ వ్యవస్థ) అనే చరవాణి ఆధారిత మొబైల్ యాప్ ని అందుబాటులోకి తెచ్చారు.

వినూత్నమొబైల్ యాప్:

ఈ వినూత్నమొబైల్ యాప్ వ్యవస్థ ద్వారా రైతులకు పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఖచ్చితమైన,పూర్తి సమాచారాన్ని శాస్త్ర వేత్తలు అందించిన సలహాల ద్వారా పొందుతారు. ఈ యాప్‌లో పురుగుల ఫోటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా రైతులు పొలంలో ఉన్న (61 ముఖ్య పంటల్లో అందుబాటులో ఉంది ) చీడ పీడలను తెగుళ్లను మొబైల్ ద్వారా గుర్తించగలరు.దీనితో పాటుగా 15 ప్రధాన పంటలకు సంబంధించిన కీటక వ్యాధులను సకాలంలో ఎదుర్కొనేందుకు రైతులు సరైన సలహాలు పొందుతారు .

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ సహాయంతో రైతులు, వ్యవసాయంలో ఆసక్తి గల వ్యక్తులు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ మొబైల్ సాయంతో తమ పంట పొలంలో చీడపీడల ఫొటోలు తీసి NPSS మొబైల్ యాప్ లో అప్లోడ్ చేసిన వెంటనే ఆ పురుగు /తెగులును త్వరగా గుర్తించడమే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను సైతం సూచిస్తుంది. అదేవిధంగా రైతులకు అందుబాటులో 15 రకాల ముఖ్య పంటల్లో (వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, గోధుమ, ఆపిల్, అరటి, వంగ, ద్రాక్ష, కంది, మినుము దానిమ్మ, సోయాబీన్, చెరకు, టమాట) కీలకమైన పురుగులు, తెగుళ్ళ ఉధృతి సమాచారం వంటి అంచనా సమాచారం అందించగానే ఆ ఉధృతికి తగ్గట్టుగా చీడపీడల నివారణ చర్యలను ఈ యాప్ సిఫారసు చేస్తుంది.NPSS మొబైల్ యాప్ ద్వారా ఏ వ్యాధి, ఏ కీటకం హానికరం లేదా ప్రయోజనకరమైనది అని తెలుసుకోవచ్చు. దాని క్రిమిసంహారక మందుల్ని, ఏ పరిమాణంలో, ఏ సమయంలో, ఎంత వాడాలి అనే సమాచారాన్ని పొందవచ్చు ఈ సిఫార్సు చేసిన సూచనలలో క్రిమిసంహారకాల కంటే ముందుగా సమగ్ర సస్య రక్షణ యాజమాన్య పద్ధతులు వాడకాన్ని ప్రోత్సహిస్తుంది.ఈ చరవాణి యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన పంటల్లోని పురుగులు, తెగుళ్ళ సమగ్ర వీక్షణ, విశ్లేషణ సాధ్యమవుతుంది.

ఈ యాప్ ద్వారా లాభాలు:

* రైతులకు సకాలంలో చీడపీడలు, తెగుళ్ల నివారణకు సత్వర సమాచారాన్ని అందించి పంట నష్టాన్ని నివారించడం తద్వారా మొక్కల్లో తెగుళ్ల వ్యాప్తిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరకుండా అరికట్టడం.
* గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కేంద్రస్థాయి మొక్కల సంరక్షణ యంత్రాంగాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉండేలా ఉంచడం.
* సమగ్ర సస్యరక్షణ యంత్రాంగాన్ని పటిష్టపరిచి వ్యవసాయ, ఉద్యాన పంటల్లో చీడపీడల వ్యాప్తి నిరోధించడం.
* ఒక ప్రాంతంలోని ముఖ్య పంటల్లో ఉన్న చీడపీడల సమాచారాన్ని కలిగి ఉండటం ద్వారా రాబోయే రోజుల్లో పంటల సంరక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయం చేయడం
* చీడ పీడలు, తెగుళ్ళ సమాచారం అందుబాటులో ఉంచటం ద్వారా పాలసీ మేకర్స్ వ్యవసాయ రంగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన సమగ్ర సమాచారాన్ని అందించి తద్వారా రైతు సంక్షేమానికి తోడ్పాటు పడడం.

ఎలా పనిచేస్తుంది ?

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతిక సాయంతో పనిచేసే ఈ యాప్ లోనే ఐడి, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అయ్యి ఎంపిక చేసిన మొక్కల సంరక్షణ శాస్త్రజ్ఞులు శాస్త్రీయ పద్ధతిలో చీడపీడల సమాచారాన్నిపొందుపర్చి దానిని దేశస్థాయి చీడపీడల సమాచారం, ఫరిదాబాద్ లోని కార్యాలయంలో సెంట్రల్ సర్వర్లో నిక్షిప్తం చేస్తారు. ఈ సమాచారం ద్వారా దేశస్థాయిలో పంటల్లో ఉన్న చీడపీడల సమాచారం ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.

NPSS మొబైల్ యాప్:

ఆండ్రాయిడ్, iOS ప్లే స్టోర్ ద్వారా NPSS యాప్‌ని దిగువ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.npss&pcampaignid=web_share.

ఫీల్డ్ స్కౌట్‌లు/రైతులు పంటపొలంలో వాడడానికి వీలుగా ఈ యాప్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పని చేస్తుంది. యాప్ ప్రస్తుతం ఆంగ్లం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇది బహుళ భాషల్లో రాబోతుంది. ప్రస్తుతం యాప్‌లోని కొన్ని ఫీచర్లు రైతులు/యూజర్‌లందరికీ అందుబాటులో ఉన్నాయి (స్కౌట్ ID ద్వారా లాగిన్ కానవసరం లేదు) అవి… చీడ పీడలు, తెగుళ్ల గుర్తింపు, గుణాత్మక నిఘా,సలహాలు పొందడం.

1.చీడ పీడల గుర్తింపు మాడ్యూల్:

ప్రస్తుతం తెగుళ్ల గుర్తింపు మాడ్యూల్ 61 ముఖ్యమైన పంటలకు సంబంధించిన వివిధ చీడ పీడలు, తెగుళ్లను గుర్తించగలదు. ఈ మాడ్యూల్‌లో వినియోగదారులు నేరుగా మొబైల్ కెమెరా నుంచి ఫోటోను క్యాప్చర్ చేయవచ్చు లేదా ఫోన్ గ్యాలరీ నుంచి అప్‌లోడ్ చేయవచ్చు. AI-ఆధారిత వ్యవస్థ అప్‌లోడ్ చేసిన చిత్రాన్ని విశ్లేషిస్తుంది. అందుబాటులో ఉన్న డేటాబేస్‌ని ఉపయోగించి తెగులును గుర్తించి,ఆ తెగులు వల్ల కలిగే లక్షణాలపై సమాచారాన్ని అందిస్తుంది. సమర్థవంతమైన తెగులు /చీడ పీడల నియంత్రణ కోసం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (IPM) పద్ధతులను కూడా ఇది సూచిస్తుంది.

Also Read: Diseases In Coconut Grove: కొబ్బరిలో మొవ్వు కుళ్ళు తెగులు సోకుతుందా ? రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు …

2. పెస్ట్ సర్వైలెన్స్ మాడ్యూల్:

క్వాంటిటేటివ్ నిఘా (శాస్త్రీయ ఆధారితం):

రిజిస్ట్రేషన్ అవసరమయ్యే స్కౌట్స్ (ID & పాస్ వర్డ్) ద్వారా చేయవచ్చు. అసంబద్ధమైన డేటా ఎంట్రీని నివారించడానికి ఇది అవసరం. ఇది CIPMCలు,స్టేట్ అగ్రి/హర్టీ డిపార్ట్‌మెంట్, కేవీకే లు మొదలైన నిపుణుల కోసం. ఇందులో శాస్త్రీయ డేటా ఎంట్రీ పరిశీలనలను తీసుకుంటారు. స్కౌట్ ID & పాస్‌వర్డ్ లేని వినియోగదారులు ఈ మాడ్యూల్‌ని యాక్సెస్ చేయలేరు .

వివరాల నమోదు: మండల స్థాయి వరకు ఉన్న వివరాలు GPS ద్వారా యాప్ లో ఆటోమేటిక్ గా యాక్సెస్ చేయబడతాయి. వినియోగదారు గ్రామం, సీజన్, పంట, పరిశీలన తేదీ (భవిష్యత్తు తేదీ కాకూడదు), ఫీల్డ్ రకం, పంట దశ, పంట పరిస్థితి, తెగులు రకం (కీటకాలు/వ్యాధి), తెగులు క్షేత్రం (నర్సరీ/ప్రధాన క్షేత్రం), తెగులు పేరు, డేటాను నిర్దేశించిన పట్టికలో నమోదు చేయాలి. ఇది తెగులును బట్టి మారుతుంది.కొన్ని చిత్రాలను,వాఖ్యలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. డేటాను సమర్పించిన తర్వాత ఆ ప్రాంతాలు కూడా రికార్డ్ చేయబడతాయి. ఈ యాప్ ద్వారా సమర్పించిన డేటాను NPSS వెబ్ పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి నిపుణులు ద్రువీకరిస్తారు.

ట్రాప్ ఆధారిత క్వాంటిటేటివ్ నిఘా (శాస్త్రీయ ఆధారితం): ఫెరమోన్ ట్రాప్‌ల ట్రాప్ పరిశీలనలను తీసుకోవడానికి, ప్రస్తుతం ఇది పింక్ బోల్ వార్మ్, అమెరికన్ బోల్ వార్మ్‌లకు మాత్రమే పత్తిలో అందుబాటులో ఉంది. స్కౌట్ ID & పాస్‌వర్డ్ లేని వినియోగదారులు ఈ మాడ్యూల్‌ని యాక్సెస్ చేయలేరు. ట్రాప్‌లు ఇన్‌స్టాల్ చేసిన పొలాల్లో దీనిని ఉపయోగించవచ్చు. స్కౌట్‌లు ట్రాప్‌లో చిక్కుకున్న కీటకాల సంఖ్యను నమోదు చేయవచ్చు (ట్రాప్ వారీగా). స్కౌట్‌లు ట్రాప్‌లో చిక్కుకున్న కీటకాలను చూపించే ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. అది కీటకాల సంఖ్యను లెక్కించి, వాటి తీవ్రత వెబ్ పోర్టల్ ద్వారా నిపుణులకు నివేదించబడుతుంది.

చిత్రాల అప్‌లోడ్: చీడ పీడల చిత్రాలను యాప్ లో అప్లోడ్ చేసిన తర్వాత అవి NPSS వెబ్ పోర్టల్ ద్వారా నిపుణులు ధృవీకరిస్తారు.ఈ చిత్రాలు నిపుణులు సర్వేను ప్లాన్ చేయడానికి, మరికొన్ని చీడపీడలకు సంబందించిన ఐడెంటిఫికేషన్ మోడల్స్ ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడవచ్చు.

క్వాలిటేటివ్ నిఘా లేదా రైతు సర్వే: శాస్త్రీయ పద్దతిలో డేటా ఎంటర్ చేయకుండా లాగిన్ ID & పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాల్సిన అవసరం లేని రైతు/సాధారణ వ్యక్తి కోసం. రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం, రైతు పేరు, మొబైల్ నంబర్, పరిశీలన తేదీ, పంట పేరు, తెగులు రకం (కీటకాలు/వ్యాధి/ప్రయోజనకరమైన జీవి), తెగులు పేరు, ముట్టడి స్థాయి (తీవ్రమైన, మితమైన, తక్కువ) సమాచారం సమర్పిస్తే.. చీడ పీడల స్థాయి అనగా తక్కువ, మధ్యస్థ, అత్యధిక స్థాయికి తగ్గట్టుగా డిస్‌ప్లేలో అడ్వైజరీ అలర్ట్ కనిపిస్తుంది.

3. సలహా మాడ్యూల్:

ఈ మాడ్యూల్‌లో రైతులు, స్కౌట్‌లు గ్రామం లేదా మొత్తం ప్రాంతానికి నిర్దిష్ట NPPS వెబ్ పోర్టల్ నుంచి నిపుణులు జారీ చేసిన సలహాలను చూడవచ్చు. మీ ప్రదేశంలో లేదా వివిధ ప్రాంతాల్లో నిపుణులు జారీ చేసిన సలహాను చూడటానికి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలు (మీరు నిర్దిష్ట గ్రామం లేదా బ్లాక్‌లోని అన్ని గ్రామాల్ని ఎంచుకోవచ్చు) పంట పేరు, తెగులు పేరు, తేదీ, అడ్వైజరీ అలర్ట్‌పై సమాచారాన్ని సమర్పించినప్పుడు డిస్‌ప్లేలో చూపబడుతుంది.

NPSS వెబ్‌పోర్టల్: https://npss.dac.gov.in
కేంద్రీయ సమగ్ర సస్య రక్షణ కేంద్రాలకు (CIPMC ) చెందిన ఎంపిక చేసిన నిపుణులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ NPSS నోడల్ అధికారులు మాత్రమే ఐడి పాస్ వర్డ్ సాయంతో NPSS వెబ్ పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.

* NPSS వెబ్సైటులో డాష్‌బోర్డ్ ద్వారా నిజ సమయ పద్ధతిలో (రియల్ టైం బేసిస్) ఇమేజ్ అప్‌లోడ్ డేటా,పెస్ట్ నిఘా డేటాను చూడటం ద్వారా దేశం మొత్తంలో తెగులు/చీడపీడల పరిస్థితిని వీక్షించి ఒక అంచనాకి రావొచ్చు.
* దేశంలో ఏయే ప్రాంతాల్లో అధిక చీడ పీడల ఉనికి కనిపిస్తుందో ఆ ప్రాంతంలోని రైతులకు సలహాలు అందిస్తారు. ఈ సలహాలను యాప్ ద్వారా చూడవచ్చు.
* పరిమిత సంఖ్యలో స్కౌట్స్ యూజర్ల కోసం లాగిన్ ఐడి పాస్వర్డ్ లు క్రియేట్ చేయవచ్చు.
రాబోయే రోజుల్లో NPSS యాప్ వ్యవసాయంలో రైతులకు, పంటలపై ఆసక్తి కలిగిన వ్యక్తులకు ఉపయోగపడే సాధనంగా పనిచేస్తుంది. సకాలంలో చీడ పీడల గుర్తింపు, నిర్వహణ కోసం నిపుణుల సలహాలను అందిస్తుంది. వ్యవసాయ పద్ధతులపై ఆసక్తి ఉన్న రైతులు, ఇతరులు తమ పంటలను రక్షించుకోవడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఉపయోగించుకోవచ్చు. వివరాల కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వారి వివరాలతో పాటు, సమీపంలోని సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్ ని సంప్రదించవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లోని కేంద్ర సమగ్ర సస్య సంరక్షణ కేంద్రాలు.

CIPMC -హైద్రాబాద్ :
జీడిమెట్ల గ్రామం, కుత్బుల్లాపూర్ మండలం,
హైదరాబాద్-500055, తెలంగాణ.
మెయిల్ ఐడి: ipmap08@nic.in

CIPMC -విజయవాడ:
H.No. 24-24-20, రజక వీధి
దుర్గాపురం, విజయవాడ 520003, ఆంధ్రప్రదేశ్
మెయిల్ ఐడి: cipmc.ap09-ap@gov.in

Also Read: NANO Fertilizers: ఖర్చు తక్కువ..ఫలితం ఎక్కువ..నానో ఎరువులు

Leave Your Comments

Thummala Nageswara Rao: పత్తి కొనుగోలు కేంద్రాల పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులతో సమావేశం

Previous article

Redgram: కంది పంటలో నిప్పింగ్ చేస్తే అధిక దిగుబడి !

Next article

You may also like