ఆంధ్రా వ్యవసాయంచీడపీడల యాజమాన్యం

పురుగుమందులు సమర్థంగా పనిచేయాలంటే…

0
  •  వ్యవసాయంలో ప్రస్తుతం రసాయనికి పురుగుమందుల వాడకం తప్పని సరైంది. ఈ రసాయనాలను విచక్షణా రహితంగా వాడినప్పుడు దానివల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువుగా ఉంటుందని నిరూపితమైంది. ఈ రసాయన మందులు సమర్థంగా పనిచెయ్యాలంటే వీటిని గురించి అవగాహన తప్పనిసరి. ముఖ్యంగా ఒక మందును పంటపై పిచికారికి ఎన్నుకునే ముందు ఆ మందు పనిచేసే విధానం అంటే అంతర్వాహికంగానా, స్పర్శ ద్వారానా లేక ఉదర చర్య ద్వారానా అన్న విషయంతో పాటు పంట పరిస్థితిని బట్టి ఎటువంటి స్ప్రేయిర్ ని వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఏ పురుగులకు బాగా పనిచేస్తుంది వంటి విషయాలను కూడా గమనించాలి.
    ఒకే మందు బజారులో అనేక పేర్లతో లభ్యమౌతుంది. రైతులు అదే మందును పేర్లను బట్టి వేరు వేరు మందులుగా భావించి పదే పదే మందులను పంటలపై పిచికారి చేయటం వల్ల పురుగులు పురుగు మందులకు తట్టుకునే శక్తిని పెంపొందించుకున్నాయి. ఈ నేపథ్యంలో పురుగు మందుల వినియోగంలో పాటించాల్సిన కొన్ని మెలకువల గురించి తెలుసుకుందాం.
  • పైరు తొలిదశలో మొక్కల పెరుగుదల, విస్తరణ తక్కువుగా ఉండటం వల్ల పిచికారి చేసే పురుగు మందు వృధాగాకుండా చేతిపంపును ఉపయోగించి అవసరం మేరకు మాత్రమే పిచికారి చేయాలి. పైరు పెరిగి విస్తరించిన దశలో పవర్ స్ప్రేయిర్ తో పిచికారి చేయాలి.
  • మిరప, పత్తి, కూరగాయలు మొదలగు పైర్లలో తామరపురుగులు, పచ్చదోను వంటి రసం పీల్చు పురుగులు ఆకుల అడుగు భాగం నుంచి  రసం పీల్చుతాయి. వీటి నివారణకు అంతర్వాహిక మందులను ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలా స్ప్రేనాజిల్ ను పక్కకు తిప్పి పిచికారి చేయాలి.
  • మందు నీరు ఆకుల కింది, పై భాగన మంచు బిందువుల రూపంలో చాలా సూక్ష్మంగా, గుబురుగా ఉన్న మొక్కలలోకి పడేటట్లు పూత, పిందెలపై ఉన్న పురుగులపై పడేటట్లు జాగ్రత్తగా స్ప్రే చేయాలి. స్ప్రేకు మంచి నాజిల్ ఎంపిక అవసరం.
  • మందునీరు పంట మొత్తం ఒకే రకంగా పడటం, వెడల్పుగా ఎక్కువ మొక్కల మీద పడటం అవసరం. ఇది మనం ఎన్నుకున్న నాజిల్ పైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆకులు సన్నగా, నున్నగా ఉంటాయి. వాటి మీద మందు చల్లితే నిలవదు. జారిపోతుంది. కావున మందు నీళ్ళలో శాండోవిట్ లేదా టీపాల్ వంటి అతుక్కునే పదార్థాలు కలిపి ముందు నీరు వృధా కాకుండా కాపాడుకోవచ్చు.
  • కొన్ని పురుగులు మొక్కల మొదళ్ళలో కోశస్థదశలో ఉంటాయి. వీటి నివారణకు మొక్కలపై పిచికారి కంటే మొదళ్ళ వద్ద మట్టిలో మందులను వేసి కలియబెట్టాలి.
  • సాధ్యమైనంత వరకు రెండు రకాల పురుగు మందులను కలిపి పిచికారి చేయకూడదు. కొన్ని మందులను కలిపినప్పుడు మిశ్రమంలో రసాయన చర్యలు జరిగి మందు ద్రావణం శక్తిహీనమై నిరూపయోగమవుతుంది. ఈ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహాలను పాటించి మందులను పిచికారి చేయాలి.
  • పురుగు మందుల వినియోగ సామర్థ్యం పెరగాలంటే సాధ్యమైనంత వరకు మందులను ఎండ వేడి తగ్గాక సాయంత్రం సమయంలో, గాలి వీచే దిశగా పిచికారి చేయాలి. ఆ సమయంలో పత్రరంధ్రాలు తెరుచుకోవడం వల్ల పురుగుమందు లోపలికి చొచ్చుకొనిపోయి ఆకు మొత్తం మందుతో విష పూరితమవుతుంది.
  • అనేక రకాల లద్దె పురుగులు (లార్యాలు) రాత్రి పూట పంటను ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. కావున సాయంత్రం సమయంలో పిచికారి చేస్తే పురుగు మందులు పురుగులకు సమర్థంగా పని చేస్తాయి. మధ్యాహ్నం వేళ పిచికారి చేస్తే మందు అవిరి అయిపోవడం, ఎండకు గురై త్వరగా దాని ప్రభావాన్ని కోల్పయే అవకాశం ఉంటుంది.
  • మందు ద్రావణం శరీరానికి తగలకుండా నిండు దుస్తులు, ముక్కుకు పలుచని గుడ్డ, చేతులకు తోడుగులు, కళ్ళజోడు తప్పనిసరిగా ధరించాలి. * పిచికారి చేయడానికి ఉపయోగించే నీటి ఎంపిక కూడా ఎంతో ముఖ్యం. పిచికారికి మురుగు, మట్టిగలిసిన, కుళ్ళిన ఆకులు కలిసిన నీరు, ఉప్పునీరు వాడకూడదు. తేటగా ఉన్న మంచి నిటిని వాడితే ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
  • రైతులు ప్రతిసారి లైసెన్సు పొదిన దుకాణాల నుంచి మాత్రమే మందులను కొనుగోలు చేయాలి. విధిగా బిల్లు (రశీదు) తీసుకోవాలి.
  • పత్తి లాంటి పంటలలో చివరిదశలో పురుగుల యాజమాన్యం కోసం మందులు వాడుతున్నప్పుడు ముఖ్యంగా సింథటిక్ పైరిత్రాయిడ్ మందులతో పాటు నువ్వుల నూనె కలిపి పిచికారి చేసుకుంటే పురుగు మందుల విషప్రభావం పెరుగుతుంది.
  • పురుగు మందుల పిచికారికి చేతి పంపులు వాడినా, పవర్ స్ప్రేయర్ లేదా తైవాన్ స్ప్రేయిర్ వాడినా ఎకరాకు వాడాల్సిన మందు పరిమాణంలో తేడా ఉండరాదు. పవర్ స్ప్రేయర్, తైవాన్ స్ప్రేయిర్ వాడినప్పుడు నీటి పరిమాణం మాత్రం రెండున్నర నుంచి మూడు వంతులకు తగ్గించాలి.మందుల పిచికారికి కోన్ నాజిల్ ను, పురుగులు, తెగుళ్లు, కలుపు మందుల పిచికారికి ఫ్లడ్ జెట్ నాజిల్ లేదా ఫ్లాట్ ఫాన్ నాజిల్ ను ఉపయోగించాలి.
  •  స్టీల్ లేదా ప్లాస్టిక్ నాజిల్స్ వాడకం ఇత్తడి నాజిల్స్ కంటే మంచిది.

    డా. ఎస్.దయాకర్, డా. ఏ.ఎస్.ఆర్. శర్మ,
    డా.పి.అమ్మాజి, డాట్ సెంటర్, కాకినాడ,
    ఫోన్:9440336752.

Leave Your Comments

భారీగా ఏపీ వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు

Previous article

పాలలో కల్తీ ……గుర్తిస్తేనే ఆరోగ్య దీప్తి !

Next article

You may also like