ఆంధ్రప్రదేశ్చీడపీడల యాజమాన్యంవ్యవసాయ పంటలు

శనగ పంటలో ఎండు తెగులు, వేరుకుళ్లు ప్రధాన సమస్య

0

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రబీ కాలంలో పండించే అపరాలలో శనగ ప్రధానమైంది. ఇది శీతకాలంలో కేవలం మంచుతో పెరిగే పంట. ఈ పంటను ఎక్కువగా గుంటూరు, ప్రకాశం,  కర్నూలు జిల్లాల్లో పండిస్తున్నారు. ఈ పంట నల్ల రేగడి నేలల్లో సాగుచేస్తారు. రాష్ట్రంలో శనగ విస్తీర్ణం సుమారుగా 8 లక్షల ఎకరాలు. ఉత్పత్తి 3.55 లక్షల టన్నులు. దిగుబడి ఎకరాకు 440 కిలోలు. శనగ గింజల ఉత్పత్తి విలువ సుమారుగా 643 కోట్ల రూపాయలు. కాని మారుతున్న వాతావరణం పరిస్థితుల వల్ల చీడ పీడల ఉధృతి ఎక్కువై, దిగుబడి తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం శనగను ఆశించే నేల ద్వారా సంక్రమించే ఎండు తెగులు, మొదలు కుళ్లు, వేరు కుళ్ళు తెగులు మొదలైనవి. సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు అమలు చేయడం వల్ల ఈ తెగుళ్ల నుంచి పంటను కాపాడి తద్వారా దిగుబడులు పెంచుకోవచ్చు.

ఎండు తెగులు:ఈ తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతోపాటు ముడుచుకుపోయి చనిపోతాయి. కొంచెం పెరిగిన మొక్కల్లో ఆకులు వడలిపోయి ఆలస్యంగా చనిపోతాయి. వేరు, కాండాన్ని చీల్చి చూసినపుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఈ తెగులు కలుగజేసే శిలీంద్రం విత్తనం, మట్టి ద్వారా వ్యాపిస్తుంది. శనగపంట లేకున్నా పొలంలో ఆరు సంవత్సరాలు బతికి ఉంటుంది.

సమగ్ర యాజమాన్యం:ఎండు తెగులును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి (ఎన్.బి.ఇ.జి.-452, ఎన్.బి.ఇ.జి.-776, ఎన్.బి.ఇ.జి.-119).

  • వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం వల్ల నేలలోపల ఉన్న శిలీంద్ర సిద్ద బీజాలు బహిర్గతమై అధిక వేడిని తట్టుకోలేక చనిపోతాయి.
  • ముందు పంట అవశేషాలు పొలం నుంచి తీసివేయడం వల్ల తెగులు తీవ్రత తగ్గించవచ్చు.
  • జొన్న లేదా ధాన్యపు పంటలతో పంట మార్పిడి చెయ్యడం వల్ల నేలలో శిలీంద్రం సాంద్రత  తగ్గుతుంది.
  • రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడి జీవ శిలీంద్ర నాశినిని 90 కిలోలు పశువుల ఎరువు, 10 కిలోల వేపగింజల పిండితో కలిపి పాలిథీన్ కాగితంతో కప్పి 3 రోజుల కొకసారి నీరు చల్లుతూ, 15 రోజుల తర్వాత ఒక ఎకరా పొలంలో విత్తే ముందు వేసుకోవాలి.

విత్తనశుద్ధి: విధిగా విత్తనశుద్ధి చేయాలి. 1.5 గ్రా. విటావాక్స్ పవర్ (కార్బాక్సిన్ 37.5 శాతం + థైరమ్ 37.5 శాతం డి.ఎస్) లేదా 1.5 గ్రా. బెన్లేట్ టి (30 శాతం బెనోమిల్ + 30 శాతం థైరమ్) లేదా 1.5 గ్రా. టెబ్యుకొనజోల్ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడి ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయడం వల్ల మొక్క మొదటి దశలో తెగులు వృద్ధి చెందకుండా అరికట్టడమే కాకుండా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళు వృద్ధి చెందకుండా మంచి ప్రభావం చూపిస్తాయి. మొదలు శిలీంధ్రనాశినితో విత్తనశుద్ధి చేసిన తరువాత ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేయాలి.

  • తెగులు గమనించిన వెంటనే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్క మొదలు చుట్టూ ఉండే మట్టి తడిచేలా పిచికారి చేయాలి.

మొదలు కుళ్ళు తెగులు:
కాండం మొదలులో ఒక నొక్కు ఏర్పడి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన తొలిదశలో తెల్లని శిలీంద్ర సిద్దబీజాలు ఆవగింజల మాదిరి కాండం మీద కనిపిస్తాయి. నేలలో ఎక్కువ తేమ ఉండడం, అంతగా కుళ్లని సేంద్రియ పదార్థం ఉండడం,  ఎక్కువ ఉష్ట్నోగ్రతలు ఈ తెగులు ఉధృతికి తోడ్పడుతాయి.

యాజమాన్యం:

విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి: 1.5 గ్రా. విటావాక్స్ పవర్ (కార్బాక్సిన్ 37.5 శాతం + థైరమ్ 37.5 శాతం డి.ఎస్) లేదా 1.5 గ్రా. బెన్లేట్ టి (30 శాతం బెనోమిల్ + 30 శాతం థైరమ్) లేదా 1.5 గ్రా. టెబ్యుకొనజోల్ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడి ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయడం వల్ల మొక్క మొదటి దశలో తెగులు వృద్ధి చెందకుండా అరికట్టడమే కాకుండా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళు వృద్ధి చెందకుండా మంచి ప్రభావం చూపిస్తాయి. మొదలు శిలీంధ్రనాశినితో విత్తనశుద్ధి చేసిన తరువాత ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేయాలి.

  • జొన్న, ఇతర ధాన్యపు పంటలతో పంటమార్పిడి చేయాలి.
  • కుళ్ళని చెత్తను పంట విత్తటానికి ముందు తీసివేసి పొలాన్నిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • విత్తిన 10 – 15 రోజుల తర్వాత పొలంలో మొదలుకుళ్లు గమనించినపుడు ఎకరాకు 200 గ్రా. కార్బండాజిమ్ మరియు 600 గ్రాముల మాంకోజెబ్ వాడి మొక్కల మొదలు భాగం తడిచేటట్లు పిచికారి చేయాలి.

వేరు కుళ్ళు తెగులు:
బెట్ట పరిస్థితుల్లో, అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువుగా ఆశిస్తుంది. పూత, కాయ దశల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వేర్లు నల్లగా మారి కుళ్లిపోతాయి. తల్లివేరు తేలికగా ఊడిపోతుంది.

యాజమాన్యం:

  • వేసవిలో లోతు దుక్కులు చేయాలి.
  • జొన్న, సజ్జ, కొర్ర పంటలతో పంట మార్పిడి చేయాలి.
  • పంటను సరైన సమయంలో విత్తుకోవాలి (అక్టోబరు 15 నుంచి నవంబరు 15 లోపల)
  • శిలీంద్ర నాశినులతో విత్తనశుద్ధి చేయాలి. 1.5 గ్రా. విటావాక్స్ పవర్ (కార్బాక్సిన్ 37.5 శాతం + థైరమ్ 37.5 శాతం డి.ఎస్) లేదా 1.5 గ్రా. బెన్లేట్ టి (30 శాతం బెనోమిల్ + 30 శాతం థైరమ్) లేదా 1.5 గ్రా. టెబ్యుకొనజోల్ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడి ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయడం వల్ల మొక్క మొదటి దశలో తెగులు వృద్ధి చెందకుండా అరికట్టడమే కాకుండా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళు వృద్ధి చెందకుండా మంచి ప్రభావం చూపిస్తాయి. మొదలు శిలీంధ్రనాశినితో విత్తనశుద్ధి చేసిన తరువాత ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేయాలి.
  • సకాలంలో విత్తుకోవడం వల్ల పంట చివరిదశలో బెట్టకు, అధిక ఉష్ణోగ్రతలకు గురికాకుండా చూసుకోవడం వల్ల తెగులు తీవ్రతను తగ్గించవచ్చు.తెగులు ఉధృతిని అదుపులో ఉంచటానికి ఎకరాకు 2 కిలోల ట్రైకోడెర్మా పొడిని 4 కిలోల వేప చెక్కతో కలిపి 90-100 కిలోల పశువుల ఎరువులో 10-15 రోజులు వృద్ధి చేసి పొలంలో చల్లుకోవాలి.

తుప్పు తెగులు:శనగ పైరు పక్వానికి వచ్చే దశలో ఆకులపై గుండ్రని, చిన్న గోధుమరంగు పొక్కులు ఏర్పాడతాయి. ఈ పొక్కులు ఆకుల అడుగు భాగంలో ఎక్కువగా , కొమ్మలపై అరుదుగా ఏర్పడతాయి. తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు రాలిపోయి మొక్కలు పక్వానికి రాకముందే ఎoడిపోతాయి. చల్లని, తడి వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి సహకరిస్తుంది.

డా.ఐ.వెంకటేష్, డా. జి. ప్రసాద్ బాబు, వివేక్ కామత్,
డా. జ్యోతి, కె.వి.కె, సి.టి.ఆర్.ఐ., కందుకూరు,
డా. ఎం. శేషుమాధవ్, డైరెక్టర్, సి.టి.ఆర్.ఐ., రాజమండ్రి.

 

Leave Your Comments

వరి దుబ్బులు కాల్చితే దుష్పరిణామాలు… సమర్ధ వినియోగానికి సూచనలు

Previous article

You may also like