రైతులు వేసవిలో సాగుభూములను ఖాళీగా వదిలేయకుండా నువ్వులను సాగు చేస్తుంటారు. అయితే విత్తనాలు మొలకెత్తే సమయంలోనూ, పూతదశలోనూ నువ్వుల పంటకు కొన్ని రకాల తెగుళ్లు సోకే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటిని అరికట్టేందుకు సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నారు.
గడ్డి చిలుక:
విత్తనాలు మొలకెత్తే దశలో గడ్డి చిలుకలు మొక్క మొదళ్ళను కొట్టి వేస్తాయి. ఫలితంగా మొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. దీని నివారణకు పంట చేను చుట్టూ జొన్న మొక్కల్ని నాటుకోవాలి. పొలం గట్లు, పరిసరాల్లో గడ్డి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. గడ్డి చిలుకల ఉధృతి ఎక్కువైతే లీటరు నీటిలో 1.6 మి. లీ. మోనోక్రోటోఫాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ ను కలిపి పిచికారీ చేయాలి.
ఆకు గూడు/ కాయ తొలుచు పురుగు:
ఈ పురుగులు ఆకులు, మొగ్గలు, పువ్వులతోపాటు కాయల్లోని లేత గింజలను తింటాయి. వీటి నివారణ కోసం లీటరు నీటిలో 2.0 మి.లీ. క్వినాల్ ఫాస్ లేదా 2.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ ను కలిపి పిచికారీ చేయాలి.
రసం పీల్చే పురుగులు:
విత్తిన 20 నుంచి 25 రోజుల్లో పంటను రసం పీల్చే పురుగులు (తామర పురుగులు, ఆకు నల్లి, పేనుబంక) ఆశిస్తాయి. వీటి వల్ల ఆకులు ముడుచుకుపోయి పాలిపోతాయి. తర్వాత పూర్తిగా ఎండిపోతాయి. తామర పురుగులు, పేనుబంక నివారణకు లీటరు నీటిలో 1.6 మి. లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. డైమిథోయేట్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ ను కలిపి పంటకు పిచికారీ చేయాలి. లీటరు నీటిలో 5.0 మి. లీ. డైకోఫాల్ కలిపి పిచికారీ చేస్తే ఆకు నల్లి పురుగులను నివారించవచ్చు.
కాండం / వేరుకుళ్ళు :
పంట తొలిదశలో కాండం / వేరుకుళ్ళు తెగులు ఆశించి, మొక్క పూర్తిగా ఎండిపోతుంది. భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్రాల వల్ల ఈ ఎండు తెగులు వ్యాపిస్తుంది. వీటి వ్యాప్తిని అరికట్టడానికి ఒక లీటరు నీటికి 1.0 గ్రా. కార్బండిజమ్ లేదా 3.0 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందులను కలిపి వేర్లు తడిచేలా మొక్కల మొదళ్ళలో పోయాలి.
వెర్రి తెగులు:
ఆలస్యంగా వేసిన పంటలో పూత దశలో వెర్రితెగులు (ఫిల్లోడి) ఎక్కువగా వ్యాపిస్తుంది. దీనివల్ల ఆకులు చిన్నవిగా మారి పూత ఏర్పడదు. ఈ తెగులు సోకిన మొక్కలను చేనులోంచి పీకేసి, కాల్చివేయాలి. పచ్చదోమను అరికట్టేందుకు లీటరు నీటికి 2.0 మి.లీ. డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ తెగులు:
పంట వేసిన 20 – 25 రోజుల్లో వలయాకారపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడటం ద్వారా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మొదలవుతుంది. ఈ మచ్చలు కింది ఆకులపైన ఏర్పడి,లేత ఆకులతోపాటు కాండంపైకి వ్యాపిస్తాయి. సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు వల్ల ఆకుల అడుగు భాగంలో తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు ఒక లీటరు నీటిలో 2.5 గ్రా. కార్బండిజమ్, మాంకోజెబ్ కలిపిన మందును కలిపి పిచికారీ చేయాలి.
నువ్వు పంటలో సస్య రక్షణ చర్యలు..
Leave Your Comments