Seed Treatment: హానికారక పురుగులు మరియు తెగుళ్ళు పంటలను ఆశించి ఆర్ధిక నష్టాన్ని కలుగ జేయడం సాగులో రైతులెదుర్కొనే ముఖ్య సమస్య. పంటను పురుగులు, తెగుళ్ళ నుంచి కాపాడే ప్రయత్నంలో రైతులు పలు రకాల విషపూరిత మందులను విచక్షణారహితంగా అధిక మోతాదులో ఉపయోగిస్తున్నారు. దీని వల్ల పురుగులు, తెగుళ్ళు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఎటువంటి మందులకి లొంగకుండా పోయి సమస్య మరింత కఠినతరం అవుతుంది. సిఫారసుల అనుసారం వాడని పరిస్థితులలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాటి అవశేషాలు నేలలో మరియు ప్రకృతిలో ఉండిపోయి నేల మరియు వాతావరణ కాలుష్యానికి దారితీస్తాయి. వాతావరణ కాలుష్యం కారణంగా మానవాళికి క్యాన్సర్, నరాల బలహీనత, కాలేయం, ఉపిరితిత్తులు దెబ్బతినడం, కణుతులు ఏర్పడటం, జన్యు సబంధిత లోపాలు, గర్భస్థ శిశువుల సమస్యలు వంటి అనేక దుష్పరిణామాలతో పాటు చివరికి మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
నేల కాలుష్యం వల్ల నేల యొక్క సారం తగ్గడమే కాకుండా రసాయనిక పురుగు మందులను విచ్చలవిడిగా వాడడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులలో వాటి యొక్క అవశేషాలు ఉండిపోయి నాణ్యతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి అనేక రకమైన దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాటిని అధిగమించడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు రూపొందించబడ్డాయి.
పైన తలెత్తిన సమస్యలు తలెత్తకుండా, ప్రస్తుతం వినియోగంలో ఉన్న రసాయనిక మందులకు ప్రత్యామ్యాయంగా జీవనియంత్రణ పద్ధ్దతులను అవలంభించినచో, ఖర్చు తగ్గించుకొని వ్యవసాయాన్ని లాభదాయకం చేసుకోవచ్చు. ‘‘జీవ నియంత్రణా పద్ధతుల వాడకము సమగ్ర సస్యరక్షణలో ఒక ప్రధానాంశము’’ అని చెప్పవచ్చు.
ట్రైకోడెర్మా విరిడి :
పని చేయు విధానం :
ట్రైకొడెర్మా విరిడి అనే శిలీంధ్రము సెల్యులోజ్, కైటినేజ్ అనే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసి పంటపై తెగుళ్ళను కలుగజేసే శిలీంధ్రాలను నాశనం చేయును.
నేలలో పెరిగే వ్యాధికారక బూజు తెగుళ్ళు నివారించే ట్రైకొడెర్మా తెగులు పంటలు వాడే విధానము కాండము తెగుళ్ళు వేరుశనగ, టమాట విత్తనశుద్ధి, సాళ్ళలో వేయడం
విత్తన కుళ్ళు,వడలు తెగులు పొగాకు, కూరగాయలు విత్తన శుద్ధి, మట్టితో కలపడం
కుళ్ళు తెగులు శనగ, లెంటిల్, కంది, ప్రత్తి,టమాట విత్తన శుద్ధి, మట్టితో కలపడం
వేరు కుళ్ళు ఫ్రెంచ్ బీన్స్, శనగ, ప్రత్తి, టమాట విత్తన శుద్ధి, నేలలో వేయడం.
ఎర్ర కుళ్ళు చెఱుకు చెఱుకు గడ మొక్కలు ముంచడం
జీవ నియంత్రణ కల్చరు ఉపయోగించు పద్ధతులు :
1. విత్తన శుద్ధి : ఒక కిలో విత్తనానికి 8-10 గ్రా. పొడి మందు సరిపోతుంది (లేదా) పొడి మందును 10 మి.లీ. నీటితో కలిపి విత్తనశుద్ధి చేయవచ్చును. అరటి, పసుపు దుంపలను, చెఱుకు ముచ్చెలను శిలీంధ్ర ద్రావణంలో ముంచి నాటాలి. 500 గ్రాముల ట్రైకొడెర్మా విరిడి పొడి 100 లీటర్ల నీటిలో కలిపి ఉపయోగించుకోవాలి.
2. భూమిలో వేయు పద్ధతి : ఎకరాకు 2-3 కిలోలు దుక్కిలో వేయవలెను. ట్రైకొడెర్మా 1 కిలో, వేప పిండి 10 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు 90 కిలోల మిశ్రమాన్ని కలిపి కావలసినంత తేమ అందించి ఒక వారము రోజులు నీడలో ఉంచి తరువాత వేయవలెను. తరువాత ఒకసారి ఆ మిశ్రమాన్ని కలియ తిప్పుకొని, కావలసినంత తేమ చేర్చి మరొక వారం రోజులు ఉంచి తరువాత మిశ్రమాన్ని కలియ దిప్పి దుక్కిలో వేసుకోవాలి. వేప పిండి, పశువుల ఎరువు లభ్యము కాని ఎడల సూటిగా ఇసుకతో కలిపి వాడవచ్చును.
పైరులో అక్కడక్కడ మొక్కలకు వేరుకుళ్ళు, ఎండుతెగులు ఆశిస్తే 50 గ్రా. పొడిమందును 10 లీ. నీటిలో కలిపి చల్లాలి. ఇది ఒక సెంటు భూమిని తడపడానికి సరిపోతుంది.
Also Read: Drumstick Cultivation: మునగ సాగు.. రిస్క్ లేని పంట.!
మోతాదు :
పైరు పేరు ట్రైకొడెర్మా విరిడి వేయవలసిన మోతాదు
విత్తన శుద్ధికి ఎకర భూమికి
వేరు శనగ, అపరాలు, ప్రత్తి, పొద్దుతిరుగుడు, పొగాకు, టమాట, బెండ, వంగ, ఉల్లి, మిరప, బంగాళదుంప, పుచ్చ కాయ, వరి ఒక కిలో విత్తనమునకు 8-10 గ్రాములు సరిపోతుంది. 2 కిలోలు దుక్కిలో వేయవలెను
చెఱుకు, అల్లము, పసుపు ఎకరమునకు 500 గ్రాములు 2-3 కిలోలు దుక్కిలో వేయాలి.
కొబ్బరి 25-50 గ్రాములు మొక్క నాటినపుడు మొక్క దగ్గర వేయవలెను 6 నెలలకు ఒక్కసారి మొక్కకు 50-70 గ్రాములు
అరటి మొక్క నాటేటపుడు 2-3 గ్రాములు వేయవలెను 6 నెలలకు ఒకసారి మొక్కకు మొదళ్ళ దగ్గర వేయవలెను.
నిమ్మ, నారింజ మొక్క నాటేటపుడు 10 గ్రాములు 6 నెలలకు ఒకసారి 20-30 గ్రాములు మొక్క మొదళ్ళ దగ్గర వేయాలి.
ట్రైకొడెర్మా విరిడి వాడకంలో జాగ్రత్తలు :
1. కల్చరు వాడే ముందు భూమిలో తగు తేమ ఉండేటట్లు చూసుకోవాలి (లేదా) వాడిన వెంటనే మొక్కలకు నీరు పెట్టాలి.
2. దీనిని కంపోస్ట్, ఇతర పశువుల ఎరువులు, జీవ సంబంధ పదార్థములతో కలిపి వాడుకోవచ్చును.
3. వీలైనంత వరకు దీనిని ఇతర రసాయనిక పురుగు మందులు, ఎరువులతో కలిపి వాడకపోవడం మంచిది.
4. దీనిని చల్లని, పొడి ప్రదేశములో నిలువ చేయవలెను.
5. కల్చరును తయారు చేసిన 6 నేలల లోపు వాడవలెను.
సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ :
ఇవి కైటినేన్ అనే ఎంజైమును విడుదల చేయును. ఇది హానికరమైన బూజు తెగుళ్ళ కణాల గోడలపై పనిచేసి నాశనము చేస్తుంది.
ఉపయోగాలు :
1. వరిలో ఆకు ఎండు తెగులు, పాముపొడ తెగులు, అగ్గి తెగులు, పొట్ట కుళ్ళు తెగుళ్ళను నివారిస్తుంది.
2. మిరియాలలో ఫుట్ రాట్, పొడతెగుళ్ళను నివారిస్తుంది.
3. తమలపాకు తోటల్లో ఆకుమచ్చలను తొడిమలపై మచ్చలను తగ్గిస్తుంది.
4. కూరగాయలలో ఎండుతెగుళ్ళను, మచ్చ తెగుళ్ళను, పసుపులో దుంపకుళ్ళును తగ్గిస్తుంది. పిథీయమ్, ఫ్యుజేరియుం, ఫైటోఫ్తరా, ద్వారా వ్యాపించే తెగుళ్ళను తగ్గిస్తుంది. వేరుముడి నెమటోడ్‌లను వరిలో తగ్గిస్తుంది.
పంటలు : వరి, ప్రత్తి, కూరగాయలు, వేరుశనగ, అరటి, పొగాకు, మల్బరి మరియు పండ్ల తోటలు.
ఉపయోగించు పద్ధతులు :
1. విత్తన శుద్ధి : 8 గ్రా. నుండి 10 గ్రా. పొడిమందును 10 మి.లీ. నీటిలో కలిపి ఒక కిలో విత్తనాలకు పట్టించాలి.
2. సూడోమోనాస్‌ను బెల్లం, తుమ్మ జిగురును బురదగా తయారు చేసి విత్తనాలకు పట్టించి 24-48 గంటలు బాక్టీరియా పెరుగునట్లు చేసి విత్తుకున్నట్లయితే, విత్తనము నుంచి, నేల నుంచి సంక్రమించే వ్యాధుల నుంచి మొక్కలను కాపాడవచ్చు.
3. వేర్లను శుద్ధి చేయడం : వరి, వంగ, టమాట, మిరప పైర్లను ఒక కిలో సూడోమోనాస్ ఫార్ములేషన్ నిల్వ ఉండే నీళ్ళలో కలిపి వాటి వేర్లను గంట సమయం పాటు ఈ నీటిలో ఉంచిన తర్వత నాటుకుంటే, ఇది తెగుళ్ళను నివారించడమే కాకుండా, పెరుగుదలను పెంచుతుంది.
4. భూమిలో చల్లే విధానము : ఎకరాకి 2-3 కిలోలు దుక్కిలో వేయవలెను. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ 1 కిలో, వేప పిండి 10 కిలో గ్రాములు బాగా చివికిన పశువుల ఎరువు 90 కిలోగ్రాముల మిశ్రమాన్ని కలిపి కావల్సినంత తేమ అందించి ఒక వారం రోజులు నీడలో ఉంచి తరువాత వేయాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ఒకసారి కలియతిప్పుకొని కావలిసినంత తేమ చేర్చి మరొక వారం రోజులు ఉంచి తరువాత మిశ్రమాన్ని కలియతిప్పి దుక్కిలో వేసుకోవాలి. వేపపిండి పశువుల ఎరువు లభ్యము కానీ యెడల సూటిగా ఇసుకతో కలిపి వాడవచ్చును.
5. పిచికారి : ఒక కిలో పొడి మందును 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పైరుపై పిచికారి చేయాలి.
. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ వాడుటలో జాగ్రత్తలు:
. కల్చరు వాడే ముందు భూమిలో తగుతేమ ఉండేటట్లు చూసుకోవాలి.
. దీనిని కంపోస్టు, ఇతర పశువుల ఎరువులు, జీవసంబంధ పదార్థాలతో కలిపి వాడుకోవచ్చు.
. వీలైనంత వరకు దీనిని రసాయన పురుగు మందులు, ఎరువులతో కలిపి వాడకుండా ఉండటం మంచిది.
. దీనిని చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయవలెను.
. కల్చరును తయారు చేసిన ఆరు నెలలలోపు వాడవలెను.
Also Read: Minister Niranjan Reddy: తెలంగాణా సుస్థిర వ్యవసాయానికి ఆనవాలుగా మారింది – మంత్రి నిరంజన్ రెడ్డి