Coconut Friendly Worms: మన భారతదేశంలో కొబ్బరి ఎన్నో శతాబ్దాలుగా పండిరచబడుతున్నది. మానవ జీవనానికి అవసరమైన ఆహారం, వంట చెరకు, కలప మొదలగు నిత్యావసరాలను ఇచ్చే కొబ్బరి చెట్టు ‘కల్పవృక్షం’గా పేరు పొందినది. కొబ్బరిని ఆశించి నష్టపరుస్తున్న నల్లముట్టెపురుగు, ఆకుతేలు, రుగోస్ సర్పిలాకార తెల్లదోమ మరియు బండార్స్ తెల్లదోమ వంటి పురుగుల ఉధృతి తగ్గించడానికి డా॥ వై.యస్.ఆర్.హెచ్.యు ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట జీవ నియంత్రణ ప్రయోగశాలలో అభివృద్ధి పరచి మిత్రపురుగులను (బదనికలు) కొబ్బరి తోటలలో వదలడం ద్వారా నివారణ సాధ్యమగునని పరిశోధనలలో వెల్లడైంది. ఈ మిత్రపురుగులను డా॥ వై.యస్.ఆర్.హెచ్.యు ఉద్యాన పరిశోధన స్థానం, అంబాజీపేట నందు రైతులకు అందచేయడం జరుగుచున్నది.
కొబ్బరిని ఆశించు పురుగులు :
1. నల్లముట్టెపురుగు (ఒపిసైనా అరినోసెల్లా)
లక్షణాలు :
. ఈ పురుగు ఆశించిన ఆకులపై ఎండిన మచ్చలు ఏర్పడతాయి.
. పురుగు తీవ్రత పెరిగిన కొలదీ, మచ్చలన్నీ కలిసిపోయి, ఆకు మొత్తం ఎండిపోతుంది.
. ఈ విధంగా చెట్టుపై ఆకులన్నీ ఎండి, వాలిపోతాయి.
తోటంతా కాలిపోయినట్లు కనిపిస్తుంది. ఎక్కువ ఉదృతంగా ఉన్నప్పుడు కాయలు కూడా దెబ్బతింటాయి.
2. ఆకుతేలు (మాక్రోప్లెక్ట్రా నరేరియా) :
లక్షణాలు :
1. తొలి దశలో చిన్న గొంగళి పురుగులు ఆకు అడుగున పత్రహరితాన్ని గోకి తినడం వలన, ఆకులపై గుండ్రని మచ్చలు ఏర్పడతాయి.
2. గొంగళి పురుగులు ఎదిగినకొలది ఆకు భాగాన్ని అంచులనుండి తిని ఒట్టి ఈనెలను మాత్రం మిగుల్చుతాయి. ఎండిన ఆకులు చెట్టుకి వ్రేలాడతాయి.
3. ఉధృతంగా ఆశించినప్పుడు కొమ్మలు, కాయలపై కూడా ఈ పురుగు ఆశిస్తుంది.
4. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చెట్టు క్రింద, చెట్టు చుట్టూ పురుగులు విసర్జించిన రెట్టలు ఒక పొరవలె ఏర్పడతాయి.
5. ఆకు తేలు ఆశించిన కొబ్బరి తోటల్లో అంతరపంటగా అరటి, కోకో ఉంటే ఈ పురుగు అరట, కోకోను కూడా ఆశిస్తుంది.
3. రుగోస్ సర్పిలాకార తెల్లదోమ (అల్యురోడికస్ రూగియోపర్కులేటస్) మరియు బొండార్స్ తెల్లదోమ (పారాఅల్యురోడ్స్ బొండారి) :
లక్షణాలు :
ఈ తెల్లదోమలు రసం పీల్చే తరగతికి చెందిన రెక్కల పురుగులు. ఆకుల ఆడుగు భాగాలపై గుడ్లను ఏర్పరుస్తాయి. ఈ వలయాలపై తెల్లని మైనపు పూత, వెంట్రుకలు కప్పబడి ఉంటాయి. ఆకుల అడుగుభాగంలో తెల్లటి దూది వంటి పదార్ధం నిండ ఉంటాయి. తేనెలాంటి జిగురు పదార్ధం ఆకుల అడుగు భాగం నుంచి క్రింద ఆకులపై పడటం వలన ఆకులు నల్లటి మసి మంగుతో కప్పబడి ఉంటాయి.
మిత్రపురుగులు (బదనికలు) :
1. బ్రాకాన్ బ్రెవికార్నిస్ :
తోటలో నల్లముట్టె పురుగు (గొంగళిపురుగు దశలో) ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు (చెట్టుకు 1 లేక 2 ఆకులకు పురుగు ఆశించినప్పుడు) బ్రాకాన్ బ్రెవికార్నిస్ అనే మిత్రపురుగులను ఒక చెట్టుకి 20 మిత్రపురుగులను విడుదల చేయాలి. ఈవిధంగా కనీసం ఎకరానికి 10 శాతం మొక్కలకు మిత్రపురుగులను విడుదల చేయాలి.
ధర: రూ.10/` 20 మిత్రపురుగులు
2.గొనియోజస్ నెఫాంటిడిస్ :
నల్లముట్టెపురుగు నివారణకు తోటలో సుమారుగా గొనియోజస్ నెఫాంటిడిస్ 20 మిత్రపురుగులు ఒక చెట్టుకి విడుదల చేయాలి. ఈవిధంగా కనీసం ఎకరానికి 10 శాతం మొక్కలకు మిత్రపురుగులను విడుదల చేయాలి.
ధర: రూ.15/ ` 20 మిత్రపురుగులు
3.పెడోబియస్ ఇంబ్రియస్ :
ఆకుతేలు (గొంగళి పురుగు దశలో) నివారణకు తోటలో పెడోబియస్ ఇంబ్రియస్ 50 మిత్రపురుగులు ఒక చెట్టుకి విడుదల చేయాలి.
ఈవిధంగా కనీసం ఎకరానికి 10 శాతం మొక్కలకు మిత్రపురుగులను విడుదల చేయాలి.
ధర : రూ.25/` 50 మిత్రపురుగులు
4. ఎపర్టోక్రైసా ఆస్టర్ : తెల్లదోమ యొక్క ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మిత్ర పురుగులైన ఎపర్టోక్రైసా ఆస్టర్ 100 ` 150 గ్రుడ్లు లేదా 100 పిల్లపురుగులు (గ్రబ్స్), మధ్యస్థంగా ఉన్నప్పుడు 300`500 గ్రుడ్లు లేదా 300 పిల్లపురుగులు (గ్రబ్స్), ఒక్కొక్క చెట్టుకి, ఈవిధంగా కనీసం ఎకరానికి 10 శాతం మొక్కలకు మిత్రపురుగులను విడుదల చేయాలి.
ధర : రూ.25 / 100 గ్రుడ్లు
ధర : రూ.40 / 100 పిల్లపురుగులు (గ్రబ్స్)