Cabbage And Cauliflower: శీతాకాలంలో సాగుచేసే కూరగాయ పంటలలో క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ చాలా ముఖ్యమైనవి. క్యాబేజీ మొక్క ఆకులతో కూడిన గడ్డ ఆర్థిక ప్రాధాన్యత గల భాగం. ఈ క్యాబేజీని కూరగాయగానే కాక సలాడ్‌లో కూడా వాడతారు. క్యాలీఫ్లవర్ పంట ముఖ్యంగా దీని మొక్క లేత పూల కోసం సాగు చేయబడుతోంది. గోబీగా పిలువబడే ఈ పంటను అనేక రకాలుగా వంటలలో ఉపయోగిస్తారు. క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ వివిధ రకాల చీడ పురుగులు మరియు తెగుళ్లు ఆశించి నష్టపరుస్తున్నాయి. కావున సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చు.
క్యాబేజీ రెక్కల పురుగు.. చిన్నవిగా, ఆకుపచ్చ, గోధుమ రంగుల కలయికలో ఉండి పాలిపోయిన తెలుపు రంగు, పొడవాటి వెంట్రుకలు కలిగిన రెక్కలు కలిగి ఉంటాయి. ఈ పురుగు ఆకుల అడుగు భాగాన ఉండి ఆకులను తిని నాశనం చేస్తుంది. పురుగులు ఆశించిన ఆకులు వాడి ఎండిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే పైరులో ఆకులన్నీ రంధ్రాలను కలిగి ఉండి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. ఈ పురుగు నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు రెండు వరుసల ఆవాల మొక్కలను ఎరపంటగా వేయాలి. పురుగు యొక్క గుడ్లను ఏరివేసి నాశనం చేయాలి. తొలిదశలో వేరుకు సంబంధిత నూనె ఎన్‌ఎస్‌కెఈ ఐదు శాతం పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా నోవాల్యురాన్ 1.25 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ. పిచికారీ చేయాలి. పంట నాటిని 30`45 రోజుల్లో బిటి సంబంధిత మందులు 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరో రకం పురుగు తలకొట్టు పురుగు లద్దెపురుగు గోధుమ వర్ణంలో ఉంటుంది. ఈ పురుగు ఆకులను గూడుగా చేసుకుని ఆకులు మధ్యలో చేరి ఆకులను తొలచివేస్తాయి. కాండంని తొలుచుకొని తింటాయి. తలను కూడా తొలుచుకొని తినడం వల్ల క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినడానికి పనికిరాదు. ఇక తెగుళ్ల విషయానికి వస్తే..నల్ల కుళ్ళు తెగులు ఒక రకం. ఆకుల అంచుల నుండి ఆకు మధ్య వైపుకు ‘‘వి’’ ఆకారంలో పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఏర్పడిన ప్రాంతంలో ఉన్న ఈనెలు నల్లబడి ఆ ప్రాంతం అంతా కుళ్ళి పోవడం జరుగుతుంది. తెగులు ఆశించిన ప్రాంతం నుండి బ్యాక్టీరియా రసి కారుతుంది. చిన్న మొక్కలకు తెగులు ఆశించినట్లయితే మొక్కలు ఎండిపోతాయి. మొక్కలు ముదిరిన తరువాత తెగులు సోకినట్లయితే పై ఆకు నుండి లోపలి వరకు తెగులు వ్యాపించి చివరకు గడ్డ కుళ్ళి చనిపోతుంది.
ఈ తెగులు నివారణకు పంట మార్పిడి పాటించాలి. విత్తనాన్ని విత్తేముందు 50 డి.సెం. ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటిలో గానీ 10 లీటర్ల నీటికి ఒక గ్రాము స్ట్రెప్టో సైక్లిన్ తయారు చేసిన మందు ద్రావణంలో గాని 30 నిమిషాలు నాననిచ్చి శుభ్రంగా మంచి నీటిలో కడిగి ఆరనిచ్చి నాటుకోవాలి. తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 10 లీటర్ల నీటికి ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఎకరాకు 5 కిలోల బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలి. వేసవి దుక్కులు చేయాలి. మంచి నారును ఎత్తైన మండులలో పెంచాలి. విత్తే ముందు కాప్టాన్ 3 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము కిలో విత్తనానికి పట్టించి ఆ తరువాత ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. నారు పోసిన 15 రోజులకు బీటి సంబంధిత మందును ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. క్యాబేజీ పంటను ప్రధాన పొలంలో నాటేటప్పుడు ప్రతి 25 వరుసలకు రెండు వరుసల ఆవాల ఎర పంటగా వేయాలి. నాటిన 30 మరియు 45 రోజులకు బీటి సంబంధిత మందులు ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగులు తొలిదశలో ఉన్నప్పుడు వేప సంబంధిత 5 శాతం ద్రావణం 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతిని బట్టి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా నోవాల్యురాన్ 1.25 మి.లీటర్లు లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక రసం పీల్చే పురుగులు నివారణకు డైమిథోయేట్ 3 మి.లీ. లేదా పిప్రోనిల్ 2 మి.లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Also Read: బంగాళదుంప పంటలో తెగుళ్లు మరియు వాటి నివారణ చర్యలు.!
అంతర పంటలుగా క్యారెట్ మరియు టమాటా పంటలు వేసుకోవాలి. పొగాకు లద్దె పురుగు ఉధృతి ఉన్నట్లయితే పొలంలో అక్కడక్కడ ఆముదం మొక్కలు వేయాలి. పురుగు యొక్క గుడ్లను ఏరి వేసి నాశనం చేయాలి. పురుగు ఉధృతి గమనించడానికి ఎకరాకు నాలుగు చొప్పున లింగాకర్షణ బు
ట్టలను ఉంచాలి. ఎకరాకు 20 చొప్పున పక్షిస్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. పొగాకు లద్దె పురుగు నివారణకు విషపు ఎరను తయారుచేసి పొలాల్లో వేసుకోవాలి. విషపు ఎర 10 కిలోల తవుడు ఒక కిలో బెల్లం 500 మి.లీ. మోనోక్రోటోఫాస్ తగినంత నీరు కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి 24 గంటలు పాటు ఉంచి ఆ తరువాత పొలంలో సాయంత్రం వేళల్లో వేయాలి.
తెగుళ్ళ సస్యరక్షణ: నారుమళ్లు ఆశించే నారుకుళ్ళు తెగులు నివారణకు విత్తనశుద్ధి చేయాలి. విత్తనశుద్ధిలో భాగంగా 10 లీటర్ల నీటికి 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలిపి తయారుచేసిన మందు ద్రావణంలో 30 నిమిషాలు నాననిచ్చి, శుభ్రంగా మంచి నీటిలో కడిగి ఆరనిచ్చి నాటుకోవాలి. ఎత్తైన నారుమళ్ళలో నారును పెంచాలి. నారును కాపర్ ఆక్సీ క్లోరైడ్ మూడు గ్రాముల ఒక లీటరు నీటికి కలిపిన ద్రావణంలో తడపాలి. కుళ్ళురోగం ఆశించిన మొక్కలను తీసివేసి చుట్టూ ఉన్న మొక్కలకు మాంకోజెబ్ 3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి మొక్కల చుట్టూ తడిచేలా పోయాలి. పంటమార్పిడి పాటించాలి. విత్తనాలను 50 నుండి 52 డిగ్రీల వేడి నీటిలో ఉంచి 20 నిమిషాల తర్వాత తీసి ఆరబెట్టి విత్తుకోవాలి.
Also Read: చేదు వేపకు.. చెడ్డ రోగం