Black Thrips Management: గత సంవత్సరం మిరప పంటను ఆశించి తీవ్ర స్థాయిలో నష్టపరిచిన పురుగు నల్ల తామర పురుగు. దీనిని శాస్త్రీయంగా త్రిప్స్ పార్విసైప్పనస్ అంటారు, ఈ పురుగు యొక్క ఆడ తల్లి పురుగులు నలుపు రంగులో ఉండి ఎక్కువగా పువ్వులు మరియు లేత ఆకుల మీద వ్యాపించి ఉంటాయి. మగ పురుగులు లేత పసుపు రంగులో పరిమాణంలో చిన్నగా, తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆడ పురుగులు గ్రుడ్లను ఆకు లోపలి పొరలలో పెడుతుంది.
గ్రుడ్లనుండి వెలువడిన పిల్ల పురుగులు ఆకు అడుగు భాగములో మరియు పూత ఫైన, లేత కాయల మీద చేరి రసం పీల్చడం ద్వారా అక్కడి కణజాలం దెబ్బతింటుంది. ఎదిగిన లార్వా భూమిలో చేరి కోశస్థ దశకు చేరుకుంటాయి. నాలుగు నుండి ఐదు రోజుల తరువాత ప్యూపా దశలన్ని ఎదిగి తల్లి పురుగులుగా మారి గ్రుడ్లు పెట్టడం జరుగుతుంది. ఒక తల్లి పురుగు 15-30 రోజుల వ్యవధిలో దాదాపుగా 5,800 వరకు పిల్ల పురుగులు అభివృద్ధి చెందుతాయి కావున రైతులు క్రింద తెలుపబడిన లక్షణాలను గమనించి నివారణ చర్యలు చేపట్టగలరు.
నలుపు రంగు తామర పురుగు ఆశించు పంటలు:
పండ్ల తోటలు: మామిడి, బొప్పాయి
కూరగాయ పంటలు: మునగ, టమాట, చిక్కుడు, దొండ, దోస, కాకర, పుచ్చ
అపరాలు, పత్తి, బంతి మొదలగు పంటలలో నష్టం కలిగించడమే కాకుండా పిచ్చిదోస, తోటకూర, వయ్యారిభామ, కామంచి, గడ్డి చామంతి మరియు గడ్డిజాతి పంటలలో ఆశ్రయం కల్పించుకొని పంటలకు నష్టం కలిగిస్తుంది.
నలుపు రంగు తామర పురుగు నష్టపరిచే విధానం:
. ఈ తామర పురుగులు ఆకుల మీద ఎక్కువ సంఖ్యలో చేరి పత్రహరితం గీకి వేయడం మరియు రసం పీల్చడం ద్వారా కణజాలం దెబ్బతినడం వలన ఆకు పరిమాణం తగ్గి ఆకారం మారిపోతుంది మరియు ఆకులు మాడిపోయినట్లు కనిపిస్తాయి.
. ఈ పురుగులు ఒక పువ్వు పైన దాదాపుగా 20-25 సంఖ్యలో ఉండి పూరెక్కల నుండి, ఆకర్షక పత్రాల నుండి మరియు కేసరాల నుండి రసం పీల్చడం వల్ల పూత ఎండిపోయి కాయలు ఏర్పడవు.
. పూతను ఆశించిన పురుగులు పుప్పొడిని తినివేయడం మరియు పూత భాగాలను గీకి వేయడం ద్వారా పూత కణజాలం దెబ్బతిని గోధుమ రంగు చారలు ఏర్పడతాయి.
. పిల్ల పురుగులు కాయ తయారీ దశలలో ఎక్కువగా లేత కాయల మీద ఆశించి రసం పీల్చడం ద్వారా కాయలు గట్టిగా, గిడసబారి ఇటుకరాయి రంగులోకి మారిపోతాయి.
Also Read: Infectious Bursal Disease in Chickens: కోళ్ళలో గంబోరో వ్యాధి ని ఎలా నివారించాలి.!
నలుపురంగు తామర పురుగు సమగ్ర యాజమాన్యం:
. వేసవిలో లోతు దుక్కులు చేయుట ద్వారా పురుగు కోశస్థ దశలను నివారించవచ్చు.
. వీలున్నచోట పంట మార్పిడి చేపట్టుట వలన పురుగు ఉదృతి కొంతవరకు నివారించవచ్చు.
. పచ్చిరొట్ట పంటలను సాగుచేసి పొలంలో కలియదున్నాలి, చివరిదుక్కిలో ఎకరాకు 200 కిలోల వేప చెక్కను వేయాలి.
. మిరప పంట వేయు రైతులు సాముహికంగా ఒకేసారి నాటుట పూర్తి చేయాలి.
. అధికంగా నత్రజని ఎరువుల వాడకం తగ్గించి, సిఫార్సు చేసిన మోతాదులో అనగా 120:24:48 కేజీల నత్రజని, భాస్వర%శీ% మరియు పొటాష్ ఎరువులను దఫాల వారిగా వేయాలి.
. 25-30 మైక్రాన్ మందం గల సిల్వర్ రంగు మల్చ్ షీట్ వేసుకొని డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం ద్వారా పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.
. పంట చుట్టూ 2-3 వరసలలో రక్షక పంటగా జొన్న లేదా మొక్కజొన్న పంటలను వేసుకోవాలి.
. పొలంచుట్టూ మరియు గట్లపై కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలించాలి.
. రైతులు సాముహికంగా నీలి రంగు జిగురు అట్టలను ఎకరాకు 40 – 50 వరకు మొక్క ఎత్తుకు దగ్గరగా పెట్టుకోవడం ద్వారా తల్లిపురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు.
. 5 శాతం వేపగింజల కషాయం లేదా వేపనూనె 10,000 పి.పి.యం 1.0 మి.లీ లేదా 15,00 పి.పి.యం 2.0 మి.లీ లేదా కానుగ నూనె 2.0 మి.లీ లీటరు నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేయాలి
. విచక్షణా రహితంగా పురుగు మందుల వాడకం, బయోస్ మరియు టానిక్‌ల వాడకం పూర్తిగా ఆపివేయాలి.
. సిఫార్సు చేయబడిన పురుగుమందులైన ఫిప్రోనిల్ 80 శాతం డబ్ల్యూ.జి 0.2గ్రా లేదా సైయాన్ ట్రానిలిప్రోల్ 10.26 శాతం ఓ.డి 1.2 మి.లీ లేదా డైమిధోయేట్ 30 శాతం ఈ.సి 2.0 మి.లీ లేదా ధయామిధాక్సమ్ 25 శాతం డబ్ల్యూ.జి 0.8 గ్రా లేదా స్పైనటోరమ్ 11.7 శాతం ఎస్.సి 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
. పురుగుమందుల పిచికారిలో కనీసం 10 రోజుల వ్యవధి పాటించాలి, పిచికారి సమయంలో మొక్క అన్ని బాగాలు తడిచే విధముగా పిచికారి చేసుకోవాలి.
. పురుగు మందుల మీద మాత్రమే ఆధార పడకుండా తప్పనిసరిగా వేపనూనె, కానుగ నూనెను కూడా పంట మీద తగిన జాగ్రత్తలతో పిచికారి చేయాలి.
. పురుగు మందులు వాడేటప్పుడు ఒకే మందుకాకుండా సిఫార్సు చేసిన మందులను మార్చి మార్చి పిచికారి చేయాలి.
. పురుగు ఉదృతి అధికముగా ఉన్నప్పుడు పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. అదేవిధముగా పంటలో పోషక లోపాలు తలెత్తకుండా ఫైపాటుగా పోషకాలను అందించాలి.
. పురుగు మందులు పిచికారి చేసిన తరువాత తగినంత సమయం తీసుకొని మాత్రమే కాయలను కోయాలి.
. రైతులు ఈ విధమయిన సస్యరక్షణ చర్యలు చేపట్టుట వలన రైతులు అధిక దిగుబడులను సాదిస్తూ నికర ఆదాయం అందిపుచ్చుకోగలరు.
Also Read: Sprinkler Irrigation: స్ప్రింక్లర్ పద్ధతి తో కరువు ప్రాంతాల్లో నీటి ఆదా