Black Rot in Cotton: రాష్ట్రంలో సుమారు 17.61 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడి, 53 లక్షల బేళ్ళ ఉత్పత్తి, హెక్టారుకు 512 కిలోల (దూది) ఉత్పాదకంతో, అన్ని జిల్లాలో సాగు చేయబడుతున్న ఒక అతి ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ప్రత్తి ప్రధానమైంది. ప్రస్తుత తరుణంలో, మారుతున్న వాతావరణం మరియు వివిధ చీడపీడలు, ప్రత్తి పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. ప్రత్తి పంటను ఆశించే వివిధ తెగుళ్లలో బాక్టీరియా నల్ల మచ్చ తెగులు ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం ఈ బాక్టీరియా నల్ల మచ్చ తెగులు వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆధారితమై, పంటను ఆశించి దిగుబడులపై ప్రభావం చూపుతున్నది.

Black Rot in Cotton
బాక్టీరియా నల్ల మచ్చ తెగులు లేదా బ్లాక్ ఆర్మ్ :
బాక్టీరియా నల్లమచ్చ తెగులు జాంతోమోనోస్ సిట్రి పి. వి. మాల్ వెసియారామ్ అనే బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ఆకు కణాల్లోకి ఆకు సహజ ప్రవేశాల ద్వారా (స్పోమాటా) లేదా యాంత్రిక గాయాల ద్వారా ప్రవేస్తుంది. భారీ వర్షాలు లేదా వడగళ్ళ వానను కలిగించే తీవ్రమైన వర్షాలలో ఈ తెగులు విత్తనాల ద్వారా సంక్రమించే అవకాశమున్నందున, తొలిదశలో విత్తన శుద్ధితో ఈ తెగులు ఎక్కువగా విస్తరించకుండా అరికట్టే అవకాశముంది.
తెగులు ఉధృతికి దోహదపడే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు- వెచ్చని ఉష్ణోగ్రతలు : అనగా ఉష్ణోగ్రతలు30-40 డిగ్రిల సెంటిగ్రేడ్ మధ్యలో ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశముంది.
Also Read:Bud and Boll Shedding in Cotton: పత్తిలో మొగ్గలు, కాయలు రాలడాన్నిఇలా తగ్గించండి.!
అధిక తేమ : గాలిలో అధిక తేమ శాతం అనగా సుమారు 85% ఉన్నప్పుడు ఈ తెగులు ఉదృతి ఎక్కువగా ఉండే అవకాశముంది.
అధిక వర్షపాతం, చిరుజల్లులతో కూడిన వర్షం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం.
అధిక నత్రజని మోతాదుకి మించి వేసినప్పుడు మరియు పోటాష్‌లోపం ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలంగా ఉండే అవకాశముంది.
తెగులు నష్టపరిచే విధానం :
- బాక్టీరియా నల్ల మచ్చ తెగులు మొక్క యొక్క అన్నీ దశలలో అనగా విత్తనం నుండి కోత/ తీత వరకు ఆశిస్తుంది. వివిధ దశలలో ఈ తెగులు వివిధ రూపాలలో కన్పిస్తుంది.
- తొలి దశలో, మొలక మీద చిన్న, చిన్న నీరు సోకిన మచ్చలు ఏర్పడి, దాని వల్ల మొలకలు ఎండిపోయి చనిపోతాయి.
- మొక్క లేత దశలో ఆకులపై గుండ్రని ముదురు ఆకుపచ్చ నూనె రంగు మచ్చలు ఏర్పడి తరువాత నల్లగా మారుతాయి.
- మొక్క ఎదుగుదల దశలో ఆకులపై కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తరువాత నల్లగా మారి, తరువాతి దశలో ఆకుల ఈనెల ద్వారా తెగులు వ్యాపించి ఈనెలు నల్లగా మారుతాయి.
- తెగులు ఉదృతి ఎక్కువైతే ఆకులు ఎండి రాలిపోతాయి.
- తెగులు ఉధృతంగా ఉన్నపుడు కొమ్మలు కూడా వ్యాపించి, కొమ్మలు నల్లగా మారి ఎండిపోతాయి. దీనినే ‘‘బ్లాక్ ఆర్మ్’’ అని పిలుస్తారు.
- పువ్వులు, కాయలు ఈ తెగులు సోకినప్పుడు పరిపక్వ దశకు రాక ముందే రాలిపోతాయి.
- తెగులు కాయలకు సోకితే, కాయల మీద ముదురు ఆకుపచ్చ నూనె రంగు మచ్చలు ఏర్పడి తరువాత నల్లగా మారి గుంటలు ఏర్పడటం వలన కాయలు కుళ్ళిపోతాయి, విత్తనాలు పుచ్చపోవటం మరియు దూది రంగు మారటం కూడా జరుగుతుంది.

Plants Effected by Black Rot
యాజమాన్యం :
- పంటను పరిశీలించి, తెగులు సోకిన మొక్కలను గుర్తించి, తెగులు సోకిన మొక్క భాగాలను తీసి నాశనం చేయాలి.
- పంట మార్పిడి అవలంభించాలి.
- విత్తనాన్ని సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కోలో విత్తనానికి 10 గ్రా. చొప్పున పట్టించి విత్తన శుద్ధి చేయాలి.
- భూమిలో పోటాష్ ధాతు లోపం లేకుండా చూసుకోవాలి. సిఫారసు మేరకు పోటాష్ ఎరువులను తప్పక వాడాలి.
- పంట కాలంనందున చక్కటి సేద్యపు పద్దతులను అనుసరించాలి.
. ఆకులు తడిగా ఉన్నప్పుడు పొలంలో సేద్యం చేయడం, పనిముట్లను తరలించడం వంటివి తగ్గించాలి. - పంటలో తేమను తగ్గించడం మరియు ఆకులు పొడిబారినట్లు చేయటం వలన, తెగులు ఎక్కువగా సక్రమించకుండా చూసే అవకాశముంటుంది.
- తెగులు గమనించినప్పుడు, అందుబాటులో ఉండే సస్యరక్షణ మందులైన స్ట్రెప్టోసైక్లిన్ లేదా పోషామైసిన్ లేదా ప్లాంటామైసిన్ 1 గ్రా., కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రా., 10 లీటర్ల నీటిలో కలిపి, ఉధృతిని బట్టి 15 రోజుల వ్యవధిలో 3-4 సార్లు పిచికారీ చేయాలి.
- ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, నష్టాన్ని తగ్గించుటకు, వీలైనంత వరకు త్వరగా కోత/ తీత చేపట్టాలి.
-డా. కె. రవికుమార్, డా .జె. హేమంత్ కుమార్,
-డా . వి.చైతన్య, డా .జెస్సీ సునీత, పి.ఎస్.ఎమ్. ఫణిశ్రీ,
-డా.డి నాగరాజు, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, ఫోన్ : 96030 96769.
Also Read:Prevent Sucking Pest of Cotton: ప్రత్తి లో రసం పీల్చు పురుగుల నివారణ .!
Must Watch:
Also Watch: