మన వ్యవసాయం

Ownership of Zero Tillage Maize / No Tillage Maize Cultivation : జీరో టిల్లేజ్‌ మొక్కజొన్న / దున్నకుండా మొక్కజొన్న సాగు యాజమాన్యం

0

మొక్కజొన్న మనం ఆహారంగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకు గాను, పేలాలు, తీపికండే మరియు బేబీకార్న్గా గాను ఉపయోగించడం జరుగుతున్నది. భారత దేశంలో యాసంగి సాగు విస్తీర్ణం 6.17 లక్షల హెక్టార్లు, 35.91 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి మరియు 3.07 మెట్రిక్‌ టన్నుల ఉత్పాదకత కలదు. తెలంగాణలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 9.99 లక్షల ఎకరాలు 2022-23 లో నమోదు చేయబడిరది. పొలం దున్నకుండా పైర్లు విత్తుకొని, కలుపు నివారణకు కలుపు మందులు, ఇతర నివారణ పద్ధతులు ఆచరిస్తూ, రైతులు తమకు అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ, తక్కువ కూలీలు, తక్కువ ఖర్చుతో పైర్లు సాగు చేయటమే జీరో టిల్లేజి వ్యవసాయం. నేలను దున్ని, మెత్తటి దుక్కి తయారు చేసుకొనిపైరు విత్తుకోవాలంటే సుమారుగా 25-30 రోజులు సమయం తీసుకోవడం వల్ల కొన్ని సార్లు పైర్లు విత్తుకునే సమయం దాటి పోయి పంట సాగు మాను కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం తక్కువ ఖర్చుతో సాగు చేసే జీరో టిల్లేజ్‌ వ్యవసాయం వైపు మొగ్గు చూపాల్సిన అవసరం వుంది.
రబీ కాలంలో వరి సాగుకు సరిపడా నీరు అందుబాటులో లేనప్పుడు కొద్దిపాటి నీటి తడులతో వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు, చీడపీడల సమస్య తక్కువగా ఉండడం, మార్కెట్‌ ధర నికరంగా ఉండడం వంటి కారణాల వల్ల రైతులు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
రకాలు : వేసంగి కాలానికి అనువైన అన్ని మొక్కజొన్నరకాలు వాడుకోవచ్చు.
నేలలు : బరువైన మరియు తేమను నిలుపుకునే నేలల్లో సాగు చేయాలి.
విత్తే సమయం : వరి మాగాణుల్లో నవంబరు నెలాఖరు నుండి జనవరి మొదటి వారం వరకు వేసుకోవచ్చు. యాసంగిలో అక్టోబర్‌ నుండి నవంబర్‌ లోగా విత్తుకోవాలి.
విత్తేపద్దతి : వరి పనలను తీసినవెంటనే మొక్కజొన్నను సాళ్ళలో కర్రల సహాయంతో తేమ ఉన్నప్పుడే విత్తు కోవాలి. లేకపోతే తేలికపాటి తడి ఇచ్చి విత్తుకోవాలి.
విత్తన మోతాదు మరియు విత్తే దూరం :
ఎకరానికి 8 కిలోల విత్తనాన్ని 60I20 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. వరసులకి మధ్య 60 సెం.మీ. మొక్కకి మొక్కకి మధ్య 20 సెం.మీ దూరంలో విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం :
ఎకరానికి 80-96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్‌ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని 1/3వ వంతు, మొత్తం భాస్వరం, 1/2వ వంతు పొటాష్‌ ఎరువులను విత్తే సమయంలో వేసుకోవాలి. 1/3వ భాగం నత్రజని మోకాలు ఎత్తు దశలో 1/3వ భాగం నత్రజని పూత దశలో, 1/2వ వంతు పొటాష్‌ను పూత దశలో నేలలో తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి.


కలుపు యాజమాన్యం :
వరి మాగాణుల్లో భూమి తయారు కాకపోవడం, వివిధ రకాల కలుపు మొక్కలుండడం, వరుసల మధ్య ఎడం ఎక్కువగా ఉండడం, అధికంగా ఎరువుల వాడకం, అంతరకృషి కుదరక పోవడం, మొక్కజొన్న ప్రాధమిక దశలో నెమ్మదిగా పెరగడం మొదలగు కారణాల వల్ల కలుపు సమస్య తీవ్రంగా ఉండి పైరుకు అందవలసిన పోషక పదార్థాలు, నీరు, వెలుతురు మొదలగు వాటికి పైరుతో పోటీ పడి పైరు ఎదుగులను, దిగుబడిని తగ్గిస్తుంది. కలుపు మొక్కల వల్ల పంటకు నష్టం లేకుండా కలుపు తీయవలసిన కీలక సయమం 35 నుండి 40 రోజుల వరకు కలుపు నిర్మూలన చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.
మాగాణి మొక్కజొన్నలో మనుషులతో 15-20 రోజుల మధ్య ఒకసారి మళ్ళీ 30-35 రోజుల మధ్య ఇంకోసారి తీయవచ్చు. కాకపోతే ఇది ఖర్చుతో కూడుకున్న పని, పైగా అంతరకృషి కూడా కుదరదు. కావున రసాయన మందులు వాడకం మనుషులతో కలుపు తీయడం కన్నా లాభదాయకం.
మొక్కజొన్న విత్తిన వెంటనే 2,3 రోజులలో ఎకరానికి 1 కిలో అట్రజిన్‌ (50%పొడి) మరియు 1 లీటరు పారాక్వాట్‌ 24% ద్రావకంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే వెడల్పాకు కలుపు, వరి దుబ్బుల ఇగురులను నివారించవచ్చు. విత్తిన 15-20 రోజుల తరువాత వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు 4 ఆకుల దశలో ఉంటే ఎకరానికి 115 మి.లీ. టెంబోట్రయోన్‌ G 400 గ్రా అట్రజిన్‌ను పిచికారి, లేదా తుంగ ఎక్కువగా ఉంటే హలోసల్యూరాన్‌ మిథైల్‌ 36 గ్రా. లేదా టోప్రామిజోన్‌ 30 మి.లీ. G అట్రజిన్‌ 400 గ్రా. లలో ఏదో ఒకదానిని పిచికారి చేసుకోవచ్చు. విత్తిన 30 రోజులకు వెడల్పాటి కలుపు ఉంటే 2,4-డి సోడియం సాల్ట్‌ ఎకరానికి 500 గ్రా. పిచికారి చేసుకోవాలి.
నీటియాజమాన్యం :
మొక్కజొన్నలో పూతకు మందు, పూత మరియు గింజ పాలు పోసుకునే దశలు నీటికి చాలా సున్నితం. 30-40 రోజుల లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం, విత్తేటప్పుడు, విత్తిన 15 రోజులకు 30-35 రోజులకు పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు మరియు గింజ పాలు పోసుకునే దశలో నీరు అందించాలి.
పంటకోత – కండెల పై పొరలు ఎండి, మొక్కలపై వేలాడుతూ, గింజలు గట్టిపడి, తేమ శాతం 23-30% ఉన్నప్పుడు కోత కోసి కండెలను 3-4 రోజులు బాగా ఎండబెట్టాలి. యంత్రాలతో గింజలను ఒలిచి తేమ 10-12% ఉన్నప్పుడు నిలువ చేసుకోవాలి.
దిగుబడి : పై సూచనలు పాటిస్తే ఎకరానికి సుమారుగా 30-40 క్వింటాళ్ళు వరకు దిగుబడిని సాధించవచ్చు.

Leave Your Comments

Damages due to excessive use of urea in crops : పంటల్లో అధిక మోతాదులో యురియా వాడడం వల్ల కలిగే నష్టాలు

Previous article

Techniques in Growing Scientifically Healthy Virginia Tobacco : శాస్త్రీయంగా ఆరోగ్యవంతమైన వర్జీనియా పొగాకు నారు పెంపకంలో మెళకువలు

Next article

You may also like