ఆంధ్రా వ్యవసాయంతెలంగాణ సేద్యంమన వ్యవసాయం

పత్తిలో సాంప్రదాయక మరియు ఆధునిక అంతరకృషి ఎరువుల యాజమాన్యం

0
cotton crop
         తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైతాంగం పండిస్తున్న ఒక ప్రధానమైన పంట తెల్లబంగారం ముద్దుగా పిలుచుకుంటున్న పత్తి పంట. దేశంలో పత్తి పలు చోట్ల సాగు చేస్తున్నప్పటికీ భౌగోళిక, వాతావరణ, నేల స్వభావం వల్ల విస్తరణ మరియు ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది. వ్యవసాయ స్థూల జాతీయ ఉత్పత్తిలో కీలకపాత్ర అని చెప్పాల్సిందే.  ప్రస్తుత సమయంలో ముసుర్లు, తుఫాన్లు రావడం జరుగుతుంది. ఈ సమయంలో పత్తి పంట ఎదుగుదల సమయమని చెప్పాల్సిందే ఈ  ఎదుగుదలకి నిరంతర వర్షపు జల్లులు, కలుపు, రసం పీల్చే పురుగులు మరియు ఎరువుల యాజమాన్యం లోపం అవరోధములు. వీటిని అధిగమించేలా రైతులు పాత పద్ధతులు మరియు ఆధునిక పద్ధతులతో అంతరకృషి మరియు ఎరువుల యాజమాన్యం చేస్తే పత్తిలో శాఖలు (గూడలు) ఎక్కువగా దిగి పూత, కాయలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడులకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
 
పత్తిలో రైతులు ఆచరిస్తున్న పాత అంతరకృషి పద్ధతులు :-
       పత్తి లో మొక్కల సంఖ్య విత్తేదూరం, నేలస్వభావం, నీటి వసతి, రకాలు మరియు పాటించే పద్ధతులను బట్టి మారుతూ ఉంటుంది. దాదాపుగా అన్ని రకాల నేలల్లో సాగు చేస్తున్నారు. వానలకు నల్లరేగడి నేలలో అంతరకృషి అసాధ్యమని చెప్పాల్సిందే. కలుపు యాజమాన్యం చేసినప్పటికీ పూర్తిస్థాయిలో కలుపు నివారణ జరగదు. కూలీల సహాయంతో 25 – 30 రోజులకి, 50 – 60 రోజులకు రెండుసార్లు పంట ఎదుగుదల సమయంలో కలుపు మరియు ఇతర అవాంఛనీయమైన మొక్కలను తీసివేయాలి. కలుపు తీసినప్పుడల్లా అంతరకృషి చేపట్టాలి. చేను ఎంత పరిశుభ్రంగా ఉంటే పంట ఎదుగుదల అంతలా ఆరోగ్యంగా ఉంటుంది.
         కూలీల సహాయంతో చేసినప్పుడు మొక్కల మధ్యలో మాత్రమే శుభ్రంగా ఉంటుంది. ఇక 25 నుండి 30 రోజులప్పుడు మొదటగా గొర్రు సహాయంతో పొడి చేను దుక్కిలో సాళ్ళ మధ్యలో దున్నాలి. తరువాత ఇరువైపులా బోదెలు పడెలా, గుంటక తోలాలి. ఈ గుంటక తోలడం వల్ల లోతుగా నాటుక పోయిన వెన్నుముద్దలకు, గరక, తుంగ, దూసెటి తీగలు  మరియు ఇతర కలుపు మొక్కలను సమూలంగా నాశనం చేయవచ్చు. అదే విధంగా  రెండవసారి కూడా కూలీల సహాయంతో 50 – 60 రోజుల మధ్యకాలంలో యాజమాన్యం చేపట్టాలి. గొర్రు మరియు బ్లేడు గుంటక సహాయంతో ఇరువైపులా బోదెలు పడేల మారు సాళ్ళు తోలాలి. దీనివలన పంట ఎదుగుదల దశలవారీగా పెరుగుతుంది. ఆదే మాదిరిగా పాత పద్ధతులతో ఎరువుల యాజమాన్యం అనగా అడుగు మందు పొటాష్‌, యూరియా మరియు కాంప్లెక్స్‌ ఎరువులు కలిపి మిశ్రమంగా మొక్కలకీ అందించాలి. సాళ్ళ పద్ధతిలో చెట్టుకింత అని వేసుకుంటూ పోవాలి. చెట్టుకీ 5 సెం.మీ. దూరంలో వేసుకోవాలి. చెట్ల ఆకుల మీద ఎరుపు పడితే మాడిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ దశలో చెట్ల్లు దాదాపుగా 50 – 60 సెం.మీ. ఎత్తు పైనే ఉంటుంది. ఒకవేళ ఎత్తు ఎక్కువగా ఉన్నట్లయితే ఎరువుల యాజమాన్యాన్ని ఆపివేయాల్సి ఉంటుంది.
         ఇక మూడవ సారి పంట ఎత్తు, చేను సమ ఎదుగుదలను పరిగణనలోకి తీసుకొని అంతరకృషి మరియు ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. పూత, పిందె వేసే సమయం కాబట్టి సూక్ష్మపోషకాల ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో గుర్రు వలన మొక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది.  అందుకే గుంటకతో పొతం చేసి అవసరానికి అనుగుణంగా ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది.
పత్తి చేనులో  రైతులు ఆచరిస్తున్న నవీన పద్ధతులు :
     ఎడతెరప లేని వానలు, పొలం నాట్ల సమయం కాబట్టి కూలీల కొరత సమస్య తీవ్రంగా ఉంటుంది. రైతాంగం అంతా ఒకేసారి సస్యపద్ధతులు ఒకే రకమైన పంటల సాగు వలన కూలీల అవసరం అందరికీ ఒకేసారి ఉంటుంది. అందుకే ప్రత్యామ్నాయాలు అవలంభిస్తే కూలీల సమస్యను అధిగమించడంతో పాటు సమయం ఆదా చేయవచ్చు.
         అంతరకృషికి ఉపయోగించిన యంత్రాలు కలుపు తీయుటకు కల్టివేటరు, మనిషితో నడపబడే వీడర్లు,  ట్రాక్టర్‌తో నడపబడే కలుపు తీసే యంత్రాలు ఉపయోగించవచ్చు. ఈ కలుపు తీసే యంత్రాలు ప్రత్తి చేనులో వివిధ సామర్థ్యంతో మోటార్లు బిగించబడి ఉంటాయి. డీజిల్‌ లేదా పెట్రోల్‌తో నడిచేలాగా రూపొందించబడ్డాయి. ఈ కలుపు పరికరాలను/యంత్రాలను ఉపయోగించినప్పుడు భూమిలో మామూలు తేమ ఉండేలా చూడాలి. ముసురు వానలు లేకుండా ఉన్నప్పుడు చేపట్టాలి. కలుపు అంతరకృషి ఒకేసారి జరుగుతుంది. మొక్కలు మధ్య మాత్రము కూలీల సహాయంతో తీయించుకోవాలి. ట్రాక్టర్‌తో అంతరకృషి చేసేటప్పుడు ముందుగానే విత్తేదూరం సాళ్ల మధ్య పాటించుకోవాలి లేదంటే అనుకోని రీతిలో మొక్కలు నష్టం వాటిల్లుతుంది.
   ఇక యంత్రాల సహాయంతో ఎరువుల యాజమాన్యం మొదటగా గొర్రుకీ జడిగం కట్టి ఇరువైపులా పైపుల సహాయంతో మొక్కల సాళ్ళలో అంటే మొక్కకి ఎరువు అందేలా పడుతుంది. దాంతో బాటుగా పూడ్చుకుంటూ వస్తుంది.  ఈ పద్ధతి ద్వారా పరిపూర్ణంగా మొక్కలకి అందుతుంది. ఇప్పుడు రైతులు ఆచరిస్తున్న మంచి సస్యపద్ధతి. ట్రాక్టర్‌ సహాయంతో కూడ కల్టివేటర్‌కి బిగించి పైపుల ద్వారా త్వరిత గతిన ఎరువులను అందించవచ్చు.  ప్రత్తి పంట ప్రధానంగా వర్షాధారంగా పండిస్తూ ఉంటారు. కావున ఎరువుల వేసేటప్పుడు నీటి యాజమాన్యం కంటే వాతావరణ సమాచారం మేరకు ముసురు జల్లులు వెనుక లేదా ముందుగానే మొక్కలకి  అందించాలి.
        అప్పుడు పోషకాలు మొక్కలకీ సమపాళ్లలో అంది చేను ఆరోగ్య వంతంగా వుంటుంది. సన్నకారు రైతాంగం కూలీల సమస్యను అధిగమించలంటే నవీన/ఆధునిక పద్ధతులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో నాణ్యమైనవి. కానీ శ్రమతో కూడినవి, సమయం ఎక్కువ పడుతుంది. అదును దాటి పోతుంది. ఆధునిక పద్ధతులు సమయం వృధా కాకుండా ఖర్చుతో కూడుకున్నది. పదును, అదునులో పని పూర్తివుతుంది.  అందుకే కాలాన్ని బట్టి, విస్తరణ బట్టి సంప్రదాయ పద్ధతులలో పాటుగా ఆధునిక పద్ధతులను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతాంగం సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టినప్పుడు సంకరజాతి రకాలు ఎక్కువగా సాగులో ఉంది కావున ఎకరానికి నత్రజని 48 కిలోలు, భాస్వరం 24 కిలోలు, పోటాష్‌ 24 కిలోలు ఉండేటట్లుగా  చూసుకునే ఎరువులను వేసుకోవాలి. పిందె, కాయ దశలలో ఎక్కువ వేసుకోవాలి డి.ఎ.పి వేపపిండిని సమానంగా వేసుకోవాలి అదేవిధంగా ఎప్పటికప్పుడు సూక్ష్మపోషకాల లోపాలను గమనించి నివారణ చర్యలు చేపట్టాలి. రసం పీల్చే పురుగులు కూడా అదుపులోకి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
       ప్రస్తుతం పత్తి మద్దతు ధర ఎక్కువగా ఉండటం మూలాన పత్తి చేనులో ఆగస్టు – సెప్టెంబర్‌లో చేస్తున్న, చేయవలసిన పనులు కీలకం కావున శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తున్నట్లయితే రాష్ట్ర రైతాంగ వ్యయాలను తగ్గించి  సమయానుకూలంగా సస్య పద్ధతులను చేపట్టినట్లైతే పత్తి దిగుబడులతోపాటుగా నికర ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
డా.ఎస్‌ మధుసూదన్‌ రెడ్డి, డా. కె గోపాల కృష్ణమూర్తి, డా. ఎం రాంప్రసాద్‌ వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట
Leave Your Comments

వ్యవసాయం , ఉద్యాన పంటల్లో నీటి ఉత్పాదకతపై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్

Previous article

పోర్టబుల్‌ కంటైనర్‌లో అజోల్లా పెంపకం యొక్క ప్రయోజనాలు  

Next article

You may also like