నేడు పొగాకు మార్కెట్‌లో ఆశించిన లాభాలు రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రత్యామ్నాయ పంటల ద్వారా రైతులకు ఆదాయం సమకూరుతుందనే తలంపుతో పొగాకు పంటకు బదులుగా అధిక ఆదాయం వచ్చే పంటల సాగు చేయాలని భావిస్తున్నారు. కానీ కొన్ని పద్ధతులు పాటిస్తే పొగాకు సాగులో అధిక లాభాలు పొందొచ్చు అంటున్నారు నిపుణులు.
పండించే ఏ పంటలో అయినా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఇక పురుగు పట్టడం, బాక్టీరియా, వైరస్లు కారణంగా పంట క్షీణించడం సర్వసాధారణం. అయితే ఆ సమస్యలను తగ్గించేందుకు మనకు తెలియకుండానే తప్పులు చేస్తుంటాం. అటువంటి సమస్యలకు పురుగుల మందులు వెదజల్లి ఉన్న పంటను కాస్త నాశనం చేస్తున్నారు కొందరు రైతులు. నిజానికి పురుగుల మందు వాడకం బాగానే ఉన్నా… అధిక దిగుబడి వచ్చేందుకు విచక్షణా రహితంగా మందులు వాడటంతో పొగాకులో పురుగుమందుల అవశేషాలు పరిమితికి మించి ఉంటున్నాయి. ఇది నిరూపితమైంది కూడా. పొగ తాగేవారికి ఈ అవశేషాలు హానికలిగిస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. పొగాకులో అవశేషాలు పరిమితికి మించి ఉంటే, ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదంతో పాటు మార్కెట్లో ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ విపణిలో పొగాకు ఎగుమతులను గణనీయంగా పెంచేందుకు రైతులు సస్య రక్షణ యాజమాన్యంలో మెళుకువలు పాటించాల్సివుంది.
పొగాకుని సేంద్రియ విధానంలో సాగు చేస్తే అధిక దిగుబడి, నాణ్యతలో బాగుంటుంది. పొగాకు పంటలో అన్యపదార్థాలు, రసాయన మందులు లేకుండా పంట ఉత్పత్తి చేస్తే రైతులకు మంచి ధరలు లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎండోసల్ఫాన్ , ప్రోఫినోఫాస్, ఎసిఫేట్, క్లోరోఫైరీఫాస్, మోనోక్రోటోఫాస్, క్వినాల్ ఫాస్, ఫెన్ వలరేట్, లిండేన్, పొడి మందులు వంటి వాటిని పొగాకు పంటలో వినియోగించకుండా ఉండటం మంచిది.
#OrganicTobaccoCultivation #TobaccoCultivation #AgricucltureLatestNews #Eruvaaka