What is zero Budget Farming? జీరో బడ్జెట్ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. జీరో బడ్జెట్ అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే ఖర్చు లేని వ్యవసాయమన్న మాట. అలా అని అసలు పెట్టుబడే లేకుండా చేసే వ్యవసాయం కాదు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందడమే జీరో బడ్జెట్ వ్యవసాయం. విత్తనాలకు, ఎరువులకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మార్కెట్‌లో కొనుగోలు చేసి వాడాల్సినవి ఏమీ వుండవు. మట్టిలోని సూక్ష్మ జీవులు, ఇతర వ్యర్ధాలు మొక్కల పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. విత్తనాలను కూడా రైతులే తమ పంట నుంచి తయారు చేసుకుంటారు. ఎరువులు చల్లే పని లేదు. ప్రకృతిలో దొరికే వాటితోనే భూమికి బలాన్నివ్వవచ్చు. అందుకే ఈ సాగు పద్ధతిలో ఖర్చులుండవు. కాబట్టే జీరో బడ్జెట్ ఫార్మింగ్‌గా పిలుస్తున్నారు. ఈ విధానం వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవ్వడమే కాకుండా ప్రపంచం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. దానికోసం రసాయన ఎరువుల వాడకం తగ్గించి పూర్వ పద్ధతుల వైపు మళ్లాల్సిన అవసరం ఉంది.
ఇక ఒక పంట వేసినప్పుడు అంతర పంటపై కూడా ద్రుష్టి పెట్టాలి. అంతర పంట ద్వారా సంపాదించిన సొమ్ము ప్రధాన పంటకు పెట్టుబడి అనుకున్నా… ప్రధాన పంట ద్వారా వచ్చే ఆదాయంతో వ్యవసాయాన్ని సులభతరం చేసుకోవచ్చు. ఇక ఆదాయాన్ని పెంచుకునే దిశలో వ్యర్ధాలను సైతం ఉపయోగించుకుంటే పెట్టుబడి చాలా మొత్తంలో తగ్గుతుంది. ఇప్పటికే సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పేరుతో అమ్ముతున్నారు. దీంతో అధిక ఆదాయాన్ని పొందుతున్నారు.
ఇక ఈ జీరో బడ్జెట్ ఆవశ్యకతపై ప్రభుత్వాలు కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో రైతులకు ఈ వ్యవసాయం గురించి అవగాహన పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో అవగహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. క్షేత్ర సందర్శన, వీడియో ప్రదర్శనలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహా కార్యక్రమాల వల్ల కొంత ఫలితం అయితే కనిపిస్తోంది. ఇంకా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే ఎంత ప్రమాదమో చూస్తున్నాం. సహజ పద్ధతిలో సాగుకి అలవాటు పడకపోతే ఆహారం పూర్తిగా కలుషితం అయిపోయి ప్రజారోగ్యం దెబ్బతింటుందనే విషయం అందరూ గ్రహించాలి.