Composting At Home: వంటింటి వ్యర్థాలతో చాలా సులభంగా ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వంటింటి వ్యర్థాలతో నాణ్యమైన కంపోస్ట్ తయారు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.ఎందుకంటే ఇప్పుడు అందరూ రసాయన మందులు పిచికారి చేయని కూరగాయలు, పండ్లు, ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ ఇండ్లల్లో స్వయంగా ఎటువంటి రసాయనాలు పిచికారి చేయకుండా వంటింటి వ్యర్థాలతో తయారు చేసుకున్న ఎరువు మొక్కలకు వేసి నాణ్యమైన కూరగాయలు, పండ్లు పండించి వాటిని తిని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇంట్లో మొక్కలను పెంచడం ఒక ఎత్తు అయితే ఆ మొక్కలకు ఎరువు సమకూర్చుకోవడం ఇంకొక ఎత్తు. పెరటి సాగులో మొక్కలను సహసిద్ధంగా పెంచుతాము కాబట్టి సేంద్రియ ఎరువుగా తమకు దగ్గరలో దొరికే పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ను సేకరించి కుండీలలో మొక్కలకు వాడుతుంటారు ఇంటి మొక్కల సాగు దారులు. అయితే రోజు వచ్చే వంటింటి వ్యర్థాలతో కూడా స్వంతంగా ఎరువు తయారు చేసుకొని మొక్కలకు వాడుకోవొచ్చు. అలా తాయారు చేసుకోవడం ఏలానో తెలియక, వాసన వస్తుందనొ , ఈగలు, దోమలు చేరుతాయనో, రోగాలు వస్తాయని భయంతో చాలా మంది వంటింటి వ్యర్థాలను చెత్త గా పారెస్తుంటారు. కాని ఈ వ్యర్థం నుండి ఎంతో సులువుగా ఎలాంటి వాసన లేకుండా, ఎలాంటి రోగాలు రాకుండా కంపోస్ట్ ని తాయారు చేసుకొని అర్థవంతంగా వాడుకోవచ్చు.
ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు కిలోల కొద్ది చెత్త బయటకు వస్తూ ఉంటది. సాధారణంగా వంటింటి వ్యర్థాలను తడి చెత్త గా వృధాగా పారెస్తాం. కాని అలా కాకుండా వ్యర్థం నుండి కంపోస్ట్ ఏలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంటి దగ్గర తడి చెత్త, పొడి చెత్తను ఎలా వేరుచేసుకోవాలి అలాగే తడి చెత్త నుండి ఇంటి దగ్గరే ఎలా ఎరువు తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
Also Read: Turmeric Crop Processing: పసుపు పంటని ఎలా ప్రాసెస్ చేయాలి..
వంటింటి వ్యర్థాలతో ఇంట్లోనే కంపోస్ట్ తయారీకి విధానం :
మూత కలిగిన రెండు ప్లాస్టిక్ బకెట్స్ / పెద్ద సైజు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకోవాలి. ఆ ప్లాస్టిక్ బకెట్స్ కి సైజును బట్టి ఒక 15-100 వరకు చిన్న రంధ్రాలు చేసుకోవాలి. అలాగే మూత కి కూడా 8-10 వరకు చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఎరువు కుళ్లేటప్పుడు బాగా ఆవిరి వస్తది కాబట్టి ఆ ఆవిరి బయటకు వెళ్లడానికి ఈ రంధ్రాలు పెట్టుకుంటాం. వంటింట్లో వచ్చే తడి చెత్త, కూరగాయల వ్యర్థాలు, దేవుడికి పెట్టిన పూలు, రకరకాల పండ్లు నుండి వచ్చే వ్యర్థాలు అన్ని ఇలా విడిగా పెట్టుకోవాలి. బకెట్ అడుగున ఎండుటాకులు వేసుకోవాలి. ఒకవేళ ఎండుటాకులు తక్కువగా ఉంటే కోకో పీట్ (కొబ్బరి పీచు)అని మార్కెట్ లో దొరుకుతుంది దానిని వాడుకోవచ్చు.
కోకో పీట్ (కొబ్బరి పీచు) ఒక 2-3 అంగుళాలు బకెట్ అడుగున వేసుకొని బెస్ ప్రిపేర్ చేసుకోవాలి. బెస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ రోజు ఇంట్లో వచ్చే కూరగాయల వ్యర్థాలు ఒక లేయర్ గా వేయాలి. తర్వాత రకరకాల పండ్లు నుండి వచ్చే వ్యర్థాలు అన్ని లేయర్ గా వేయాలి.తర్వాత ఎండుటాకులు ఉంటే మెత్తగా పొడిలా చేసుకొని తడి చెత్త కనపడకుండా కప్పాలి. ఎండుటాకులు బదులు కోకో పీట్ వాడుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్దతి వాసన కూడా రాదు. మళ్ళీ మరుసటి రోజు ఇంట్లో వచ్చే వ్యర్థాలు ఈ విధంగా పక్కన పెట్టుకొని ఈ బకెట్ లో వేయాలి. ఈ విధంగా బకెట్ నిండే వరకు ఈ ప్రకారంగానే వ్యర్థాలు వేసుకోవాలి.2-3 రోజులకు ఒకసారి కర్రతో తిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తడి చెత్త బయటకు కనిపించకుండా ఎండుటాకులు గాని, కోకో పీట్ గాని వేసుకొని కప్పాలి.
ఇంట్లో ఎంత మంది ఉన్నారు అనే దానిపై బకెట్స్ సైజ్ ఆధారపడి వుంటుంది. ఒక బకెట్ నిండిన తరువాత ఇంకొ బకెట్ లో కూడా ఈ ప్రకారంగానే వ్యర్థాలు బకెట్ నిండే వరకు వేసుకోవాలి. రెండో బకెట్ మొదలు పెట్టిన తరువాత మొదట బకెట్ ని మర్చిపోవొద్దు. రెండో బకెట్ మొదలు పెట్టిన ఒక 4-5 రోజుల తర్వాత మొదట బకెట్ మూత తీసి చూస్తే లోపల అంతా ఆవిరి పట్టి ఉంటది అలాగే వ్యర్థాలు మెల్లగా నలుపు రంగులోకి మారతాయి. సగటున 40-60 రోజులలో కంపోస్ట్ తయారు అవుతది. కొన్ని రోజుల తర్వాత వర్షం పడినప్పుడు వాసన ఎలా వస్తదో అలాంటి వాసనతో కంపోస్ట్ తయారు అవుతది.
వ్యర్థాలు త్వరగా కుళ్ళడానికి బయోకల్చర్స్ లాంటివి వాడుకోవచ్చు. ఈ తడి చెత్త: ఎండుటాకులు/కోకో పీట్ = 1:1 రెషియో ఉండాలి. అలా 1:1 రెషియో లో లేకపోతే ఎరువుకి పురుగులు పట్టే అవకాశం కలదు. ఒక వేళ పొరపాటున పురుగులు పడితే వేప పిండి గాని,ఎండుటాకులు గాని, కోకో పీట్ గాని వేసుకొని మూత తీసి గాలికి పెట్టుకోవాలి. తడి మొత్తం ఆవిరి అయిపోయిన తర్వాత పురుగులు చనిపోతాయి. ఇలా ఒక శాస్త్రీయ పద్ధతిలో కంపోస్ట్ తయారు చేసుకోవాలి.
Also Read: Hand Weeder: కలుపు తీయడానికి మహిళా కూలీల కోసం కొత్త పరికరం..