Collective Natural Farming: నేల తల్లిని రక్షిస్తూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతుకు ఉన్న ఏకైక మార్గం ప్రకృతి సేద్యం. గత కొంతకాలంగా రసాయనాలతో సాగు చేపట్టిన రైతన్నలు ఇప్పుడిప్పుడే ప్రకృతి సాగువైపు అడుగులు వేస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన పంటలు అందించి.. భూమిని పరిరక్షించి.. రాబోయే తరాలకు మంచి ఫలాలను ఇవ్వడమే కొందరు రైతులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి వారు ఎవరూ? ఏఏ పంటలను పండిస్తున్నారు… ఏ విధంగా సాగు చేస్తూ గణనీయ లాభాలు పొందుతున్నారో ఇప్పుడు ఏరువాకలో తెలుసుకుందామా..
సొంతంగా ఎరువులు తయారు చేసుకోవడం ఎలా ?
గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నూతక్కి గ్రామం, కొత్తపాలెం గ్రామాల్లో అరటి సాగును కొందరు రైతులు ప్రకృతి విధానంలోనే విస్తారంగా సాగు చేపడుతున్నారు. అరటితోపాటు కొందరు అరుదైన పసుపు రకాలను కూడా పండిస్తూ.. గణనీయమైన లాభాలను అందుకుంటున్నారు. ఇక్కడి రైతులందరూ సామూహికంగా చేరి.. సొంతంగా కషాయాలు, ఎరువులు తయారు చేసుకోవడం.. సాగులో సహాయ సహకారాలు ఒకరికొకరు అందించుకోవడం వంటివి పాటిస్తున్నారు. అదేవిధంగా ఎప్పటి కప్పుడు వస్తున్న నూతన వంగడాల గురించి తెలుసుకుని వాటిని సైతం ప్రయోగాత్మకంగా సాగు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు..
ఆర్గానిక్ పంట ఏటా రెండు కాపులు
ఇక్కడి రైతులు 2018వ సంవత్సరం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకుని అప్పటి నుంచి సాగు చేపట్టడం ప్రారంభించారు. తొలిసారి అరటి పంటను సాగు చేపట్టారు. ప్రకృతి విధానానికి, రసాయనాలతో వినియోగించే పంటకు కొంత వ్యత్యాసం ఉంటుందని రైతులు చెబుతున్నారు. రసాయన ఎరువులు వినియోగించే వారు.. రసాయన పంట ఏడాదికి ఒక కాపు కాస్తే.. ఆర్గానిక్ పంట ఏటా రెండు కాపులు కాస్తాయని దీంతో దిగుబడి రెండూ ఒకే విధంగా ఉంటాయని రైతులు చెప్తున్నారు. దీంతోపాటు ఆర్గానిక్ అరటి పండ్లు రుచిగా ఉంటాయని, ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో వీటినే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఇష్టపడుతున్నట్లు కొత్తపాలెం రైతులు పేర్కొంటున్నారు.
అరటి మొక్కలు పిలకల దశలో ఉన్నప్పుడు.. పచ్చిరొట్ట ఎరువులైన.. పెసర, పిల్లి పెసర, జనుము, జీలుగు వంటి మొక్కలు వేయాలని చెబుతున్నారు. కొన్ని రోజుల తర్వాత సాళ్లలోనే వాటిని కలియదున్నితే అవే మొక్కలకు ఎరువుగా మారతాయని అంటున్నారు. డిప్ ఇరిగేషన్ పద్దతులను పాటిస్తూ.. నీరు అందిస్తే సరిపోతుందంటున్నారు. సాళ్లలో పెరిగే కలుపును కూడా మందు చల్లకుండా.. కలుపు తీయించి అక్కడే వేస్తే మొక్కకు ఎరువుగా మారుతుందని… నల్లమట్లిలో వానపాములు ఉండటంతో సేంద్రియ ఎరువుకు ఢోకా లేకుండా ఉందని ఆయన అంటున్నారు.
పద్మశ్రీ సుభాష్ పాలేకర్ మాటలకు ప్రేరణ
ఆర్గానిక్ అరటితోపాటు కొందరు రైతులు పసుపు పంటను కూడా సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. పద్మశ్రీ సుభాష్ పాలేకర్ మాటలకు ప్రేరణ పొంది ప్రకృతి సాగు చేపడుతున్నట్లు తెలిపారు. విచ్చలవిడిగా రసాయనాలను వినియోగించి భూమిని నాశనం చేయకుండా.. తర్వాతి తరాలకు సైతం సారవంతమైన భూమిని ఇచ్చేందుకు తాము ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రారంభించినట్లు చెబుతున్నారు. అయితే పసుపును ఎత్తుమడి విధానంలో సాగుచేస్తున్నట్లు రైతు పేర్కొన్నారు. దీని వల్ల మొక్కకు మొక్కకు గ్యాప్ ఎక్కువ ఉండటంతో ఎరువులు ఆయా మొక్కలకు పుష్కలంగా లభిస్తాయంటున్నారు. దీంతోపాటు పచ్చిరొట్ట ఎరువుల సాగు కూడా చేపట్టే అవకాశం ఉంటుందని తద్వారా మొక్కలకు సేంద్రియ ఎరువులు అందుతాయని ఆయన అంటున్నారు.
ఆరోగ్యమే మహభాగ్యం
ప్రకృతి వ్యవసాయం వల్ల రైతులు ఎన్ని లాభాలు పొందుతున్నారు. అంతే కాకుండా రసాయనాలను వినియోగించకుండా.. పర్యావరణాన్ని కాపాడేందుకు రైతులందరూ కలిసి సామూహికంగా చేపట్టిన ఈ విధానం ఎంతో బాగుంది కదా.. ఆర్గానిక్ పంటలను తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇంక మరెందుకు ఆలస్యం.. సేంద్రయ సాగు చేపట్టే రైతులను ప్రొత్సహిద్దాం.. ఆరోగ్యవంతమైన పంటలను తిందామా మరి.