Inspiring Story Woman Organic Farmer: మన సమాజంలో నాలుగైదు దశాబ్దాల కిందట మహిళలంటే చాలా చిన్న చూపు ఉండేది. నేడుకొంత వరకు తగ్గినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతోంది. మహిళలు అన్నీ పనులు చేయలేరని కొందరు పురుషులు కూడా తక్కువగా చూస్తూ ఉంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా రైతు అనేక అవమానాలు ఎదుర్కొని నేడు, తొట్టిన నోళ్లతోనే శెభాష్ అనిపించుకుంటోంది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఆమె ప్రారంభించిన ఫేస్ బుక్ గ్రూపులో ఏడు లక్షల మంది మహిళా రైతులను కూడగట్టింది. ఆమె సాధించిన ఈ విజయానికి ఫేస్ బుక్ కూడా అభినందించింది. ఆ వివరాలు మీకోసం.
పట్టుదలతో సాధించింది ఔరా అనుపించుకుంది
మహారాష్ట్రలోని పెండ్‌గాన్ గ్రామానికి చెందిన సాధారణ మహిళ సవితా దాక్లే. పెద్ద కుటుంబం. ఆమెకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. తండ్రి ఔరంగాబాద్‌లో చిన్నపాటి కంపెనీలు ఉద్యోగం చేసి ఇంటిని అతి కష్టంమీద నెట్టుకొస్తూ ఉండే వారు. ఒకరోజు ఆ కంపెనీ మూత పడటంతో వారి కుటుంబం రోడ్డున పడింది. సవిత స్కూల్ ఫీజు, బుక్స్ కొనేందుకు కూడా డబ్బు లేకపోవడంతో ఆమె చదువుకు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.
Also Read: China’s Engagement in Agriculture: యువతా వ్యవసాయం చేసుకో.. అని అంటున్న డ్రాగన్ దేశం
కొన్నాళ్లు ఓ చిన్న ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసింది. అంతలోనే వారి కుటుంబం సొంతూరుకి చేరుకుంది. వారి పొలంలో వ్యవసాయం మొదలు పెట్టారు. వారి ఇద్దరి అక్కలకు పెళ్లిళ్లు కావడం వారు వెళ్లిపోయారు. సవితకు 17 ఏళ్లు వచ్చాయి. ఇరుగుపొరుగు వారు మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారంటూ వెటకారం చేయడంతో ఆమెను ఓ రైతు కుటుంబంలో సంబంధం చూసి పెళ్లి చేశారు. అయితే పొలం పనులు చేయాల్సి ఉంటుందని సవిత అత్త షరతు పెట్టింది. అప్పటి దాకా పొలం గట్లపై అడుగు పెట్టింది లేదు. దీంతో సవిత పనులు చేయడం చాలా కష్టంగా మారింది.
అందరూ 50 కేజీల పత్తి తీస్తుంటే సవిత కేవలం రోజుకు పది కేజీలు మాత్రమే తీసేంది. దీంతో అందరూ ఎగతాళి చేశారు. అయినా ఓపిగ్గా భరించి అన్ని పనులు పట్టుదలతో నేర్చుకుంది. నేడు రోజుకు 80 కేజీల పత్తి తీసే స్థాయికి ఎదిగానని ఆమె సంతోషంగా చెబుతున్నారు. ట్రాక్టర్ నడపడం కూడా నేర్చుకున్నారు. వ్యవసాయంలో ప్రతి పని చేయడంలో ఆమె మెలకువలు సాధించారు. దీంతో ఇరుగుపొరుగు వారి నోళ్లు మూతపడ్డాయి. విమర్శించిన వారే పొగడటం మొదలు పెట్టారు. సవిత అంతటితో ఆగలేదు.
మహిళా సంఘాలతో జట్టుకట్టి సేంద్రీయ సాగు
సవిత నివశించే గ్రామంలో ఓ రోజు మహిళా సంఘాల మీటింగ్ నిర్వహిస్తున్నారు. నేను కూడా వెళతానని అత్తమామలకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. భర్త నచ్చజెప్పడంతో ఆమె ఆ సంఘాల మీటింగులో పాల్గొని విషయాలు తెలుసుకుంది. అప్పటి నుంచి ఆమె విజయ యాత్ర మొదలైంది. మహిళా సంఘాలకు సేంద్రీయ సాగులో మెలకువలు నేర్పించడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వద్ద ఉన్న జియో ఫోన్ తో ఫేస్ బుక్ లో విమెన్ ఇన్ అగ్రికల్చర్ అనే గ్రూపు ఏర్పాటు చేసింది. ఈ గ్రూపులో కేవలం మహిళలు అది కూడా సేంద్రీయ సాగు చేసే మహిళలకు మాత్రమే చోటు దక్కుతుంది. ఇలాంటి అరుదైన గ్రూపులో 7 లక్షల మంది సభ్యులుగా చేరి సేంద్రీయ వ్యవసాయంపై పట్టు సాధిస్తున్నారు. ఇదంతా సవిత పట్టుదలతో సాధించింది.
అభినందించిన ఫేస్‌బుక్
సవిత నిర్వహిస్తోన్న అరుదైన గ్రూపు గురించి తెలుసుకున్న ఫేస్‌బుక్ ఇండియా సీఈవో ఆమెను గుర్గావ్ లోని కార్యాలయానికి పిలిపించుకుని సన్మానంచారు. ఆమెకు బహుమతిగా ఓ స్మార్ట్ ఫోన్ ఇచ్చారు. దాంతో సవిత పని మరింత సులువైంది. ప్రస్తుతం సవిత ఫేస్ బుక్ వేదికగా మహిళలకు సేంద్రీయ పాఠాలు చెప్పడమే కాదు. అన్ని పేమెంట్లు ఆన్ లైన్లో చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. నాడు విమర్శిచిన వారే సవిత పనితనం చూసి మెచ్చుకుంటున్నారు. పట్టుదలతో నేర్చుకుంటే ఏదైనా సాధ్యమేనని ఈ మహిళా రైతు మరోసారి నిరూపించారు.
Also Read: Aranya Permaculture: యువతీ యువకులకు దిక్సూచిగా మారిన అరణ్య పర్మాకల్చర్.!