మన వ్యవసాయం

వివిధ పంటలలో బోరాన్ పోషక ప్రాముఖ్యత..

0

అవసరమైన పోషకాలు లభ్యమైనప్పుడు మొక్కలు బాగా పెరిగి అధిక దిగుబడినిస్తాయి. వివిధ నేలల్లో సహజ సిద్ధంగా అన్ని పోషకాలు ఉన్నప్పటికి, వాటి లభ్యత లభించే పద్ధతులపైన, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సంభవించే నేలల క్షయకరణ మరియు సాగు లేదా వాన నీటితో కలిసి నేల క్రింద పొరల్లోకి వెళ్ళే స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. పంట మొక్కలలో పోషకాల సమతుల్యత కోల్పోయినప్పుడు దిగుబడులు ఆశాజనకంగా ఉండవు. 

పంట యొక్క ఎదుగుదలకు మరియు దిగుబడులకు ప్రధాన, ద్వితీయ మరియు సూక్ష్మధాతు పోషకాలు 16 అవరమవుతాయి. సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలకంటే తక్కువ మోతాదులో అవరమైనప్పటికీ మొక్కల జీవన చర్యలైన హార్మోనుల ఉత్పత్తిలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఈ సూక్ష్మ పోషకాలలో బోరాన్ అనేది ముఖ్యమైనది. ఇది మొక్కలలో సంపర్కానికి మరియు ఫలధీకరణంలో కీలక పాత్ర వహిస్తుంది. భారతదేశపు నేలల్లో బోరాన్ సూక్ష్మధాతు లోపం 33 శాతం ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సరాసరి 34 శాతం బోరాన్ లోపం ఉన్నట్లు నిర్ధారించడమైనది. 

బోరాన్ లోపాలు కనిపించే నేలలు  

చౌడు నేలల్లో, ఆమ్ల నేలల్లో,  అధిక నత్రజని మరియు భాస్వరం వేసే నేలల్లోఇసుక నేలల్లో మరియు సేంద్రీయ కర్బనం తక్కువగా ఉన్న నేలల్లో బోరాన్ లోపం కనిపిస్తుంది. 

పంట మొక్కలలో బోరాన్ ప్రాముఖ్యత 

బోరాన్ అనే ఈ సుక్ష్మధాతు పోషకం బోరిక్ యాసిడ్ అనే లభ్యస్థితిలో మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. ఇది మొక్కలలో మరియు నేలలో దాదాపుగా నిశ్చలస్థితిలో ఉంటుంది. 

  • మొక్క ఆకులలో తయారయ్యే ఆహారం మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలో బోరాన్ కీలక పాత్ర వహిస్తుంది. 
  • మొక్కలలో క్రొత్తగా వచ్చే వేర్లు, లేత ఆకుల కణాలలోని శిఖరాగ్రాన ఉంటూ నూతన కణాల్ని పెంపొందిస్తుంది. 
  • కణ పొర నిర్మాణంలో మరియు కణగోడల నిర్మాణానికి తోడ్పడుతూ, జీవ ధ్రవజాలన్ని కణాల ఎదుగుదలలో తోడ్పడుతుంది. 
  • మొక్కలలో ఫలధీకరణం లో కీలక పాత్ర వహిస్తుంది.  
  • పంట మొక్కల సంపర్క ప్రక్రియలో ఉపయోగపడే పుప్పొడి ఉత్పత్తిలో మరియు పుప్పొడి కణాల ఎదుగుదలను నియంత్రిస్తూ విత్తన మరియు పండ్ల ఎదుగుదలను నిలువరిస్తుంది. 
  • అలాగే మొక్క కాల్షియం గ్రహించడానికి, సక్రమంగా వినియోగించుకోవడానికి బోరాన్ అవసరం మరియు కాల్షియం, పొటాషియం నిష్పత్తిని క్రమబద్దికరిస్తుంది. 

పంట మొక్కలలో బోరాన్ లోప లక్షణాలు:  

  • గడ్డి జాతి మొక్కలలో బోరాన్ ధాతు పరిమితి 5 నుండి 10 పి.పి.యం. ఉంటుంది అదే విధంగా ద్విదళ బీజ మొక్కలలో దీని పరిమితి 20 నుండి 70 పి.పి.యం. ఉంటుంది.  
  • ఈ పోషకం మొక్కలలో నిశ్చిత స్థితిలో ఉంటుంది కనుక దీని ప్రభావము నూతనంగా పెరిగే భాగాలైనటువంటి వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు మరియు లేత పత్రాలపై ప్రభావం చూపుతుంది. 
  • బోరాన్ లోపానికి గురైన మొక్కలలో చిగుర్లు విక్రుతాకరంగా ఉంటాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపు మీద ఉంటాయి.దీని వలన మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుండి కొమ్మలు ఏర్పడుతాయి. 
  • లేత ఆకుల ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు రంగు చారలుగా మారుతాయి.తరువాత ముడుచుకొని ఉంటాయి. 

వివిధ పంటల వారిగా చూసినట్లయితే 

వరిలో: 

  1. లేత ఆకులు చివర్లో తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. 
  2. వరి పొట్ట దశ నుండి ఈత దశలో పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజ గట్టిపరక కుదురులోని అన్ని పిలకలు తాలుగా మారతాయి. 

మొక్కజొన్నలో: 

  1. బోరాన్ లోపం ఏర్పడినప్పుడు ఆకులు పెళుసుగా మారడంతో పాటు అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు ఏర్పడుతాయి.  
  2. క్రొత్తగా వస్తున్న ఆకులు చిన్న చిన్నవిగా ఉండి పూర్తిగా విచ్చుకోకుండా కుదించుకు పోయిన కాండం కణుపుల మీద ఉంటాయి. ఈ లక్షణాల వలన మొక్క గుబురుగా, కురచగా కనిపిస్తుంది.  
  3. మొదటగా లేత ఆకుల ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు రంగు చారలుగా మారుతాయి, క్రమేణా ఆకులు ముడతలు పడుతాయి. ఆ తరువాత జల్లు మరియు కండె చిన్నవిగా అయి మొక్క నుండి పూర్తిగా బయటకు రావు. 

ప్రత్తిలో: 

  1. లేత చిగుర్లు చిగురించక ,మొగ్గల పెరుగుదల ఆగిపోయి ప్రక్కల నుంచి మొగ్గలు వస్తాయి. 
  2. ప్రక్కల నుండి మొగ్గలు ఏర్పడటం వలన గుబురుగా కనిపిస్తాయి. 
  3. లేత ఆకుల చివర్లు, లేత మొగ్గలు దళసరిగా మారి, కుళ్ళుతునట్లు కనిపిస్తాయి. తరవాత పగుళ్ళు ఏర్పడతాయి. 

ప్రొద్దుతిరుగుడులో: 

  1. లేత మరియు మధ్య ఆకులలో చివర్లు గుండ్రంగా మారి మొగ్గ ఏర్పడక చనిపోతాయి. తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. 
  2. పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి. 

వేరుశనగలో: 

  1. లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. 
  2. బీజము నుండి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది. దీనిని ‘హాలో హార్ట్’ (hollow heart) అంటారు. 

పొగాకులో: 

  1. లేత పత్రదల పీఠo వద్ద పసుపు పచ్చగా మారి తర్వాత విరిగి పోతుంది 
  2. లేత ఆకు చివర్లు మరియు మొగ్గలు సరిగా పెరగాక ఎండిపోతుంది. దీనినే పొగాకులో అంచు అనారోగ్యం (top sickness of tobacco) అంటారు.  

షుగర్ బీట్ లో: 

  1. లేత ఆకులు గోధుమ రంగులో మారి చనిపోతాయి.  
  2. దీని ఫలితంగా లేత ఆకులు చనిపోయి దుంప పైభాగంలో రోసేట్టి లాగా ఉంటుంది. ఆకు కాడ అంతర్గత భాగంలో మరియు పైభాగంలో నల్ల మచ్చలు ఏర్పడుతాయి. దీనినే “హార్ట్ రాట్” (heart rot) అంటారు.   

ఉద్యాన పంటలలో పండ్లు లేదా కాయలు పగిలి ఉండటాన్ని గమనించవచ్చు. 

 హానికర విషపూరిత లక్షణాలు: 

బోరాన్ అతి తక్కువ ( < 0.52 పి.పి.యం.) మోతాదులో అవసరం. వ్యవసాయ నేలల్లో దీని లభ్యత నిశ్చలస్థితిలో ఉంటుంది కనుక ఏ కొద్ది పరిమాణంలో ఎక్కువైనా ఆకులు పసుపు లేదా ఎరుపు వర్ణంలోకి మారి ఆకు చివర్లు ఎండిపోతాయి. ఇంక అధిక మోతాదులో ఉన్నట్లయితే మొక్క మొత్తంగా ఎండిపోతుంది. 

బోరాన్ పోషక ఎరువులు  

  1. బోరాక్స్ (బోరాన్ లభ్యత 11.3 %) 
  2. బోరేట్ ఎరువులు (బోరాన్ లభ్యత 15 %) 
  3. అనార్ద్ర బోరాక్స్ (బోరాన్ లభ్యత 21.1 %) 
  4. బొరిక్ ఆమ్లం (బోరాన్ లభ్యత 17.5 %) 
  5. సోలుబార్ (బోరాన్ లభ్యత 4.9 %) 

లోప సవరణ మరియు నివారణ చర్యలు  

  1. భూసార పరీక్షల నిర్ధారణ తర్వాత మాత్రమే శాస్త్రవేత్తల సలహా మేరకు బోరాన్ లోపము కలిగిన నేలలో 4 కిలోల బోరోక్స్ను ఎకరానికి దుక్కిలో వేసి కలియదున్నాలి. 
  2. సేంద్రీయ ఎరువులను క్రమం తప్పకుండా వాడాలి. 
  3. పంట కాలంలో పంటల మీద లోపాన్ని గమనించినట్లయితే 1 గ్రా. బోరోక్స్ ను లీటరు నీటికి కలిపి వారం వ్యవదిలో 2-3 సార్లు పిచికారి చేయాలి. 
  4. వాణిజ్య పంటలలో 1% బోరోక్స్ ద్రావణాన్ని మొలకెత్తిన 30, 45, 60 మరియు 90 రోజులలో పిచికారీ చేయాలి.                                                        ఎన్. సాయినాథ్ మరియు ఎ. వి. రామాంజనేయులు 

                                                           వ్యవసాయ పరిశోధన స్థానం , తోర్నాల, సిద్దిపేట జిల్లా 

Leave Your Comments

విత్తనాలను నిల్వ సమయంలో ఆశించు పురుగులు – యాజమాన్యం

Previous article

కోట్లు ఇస్తామన్నా వద్దని విమానాశ్రయం దగ్గర వ్యవసాయం చేస్తున్న జపాన్ రైతు..

Next article

You may also like