హైదరాబాద్ శివార్లలోని షంషాబాద్ లో గల స్వర్ణభారతిట్రస్ట్ ప్రాంగణంలో రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ……
రైతులు బాగుంటేనే అన్నిరంగాలు బాగుంటాయని, వారి ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు. అన్నదాతలను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించేందుకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక పథక రచనలు చేయాలని సూచించారు. వ్యవసాయం దండగనే నిరాశతో పలువురు ఈ రంగానికి దూరమవుతున్న నేపధ్యంలో చదువుకున్న యువత ముందుకు వచ్చి ఈ బాధ్యతను స్వీకరించాలని, సాగురంగాన్ని సంక్షోభం నుండి గట్టెంక్కించాలని నాయుడు పిలుపు నిచ్చారు.
అందరికీ అన్నంపెట్టేందుకే అన్నదాత కష్టపడుతున్నారని, అమ్మ తర్వాత అంత గొప్ప మనుసు రైతన్నలదేనని అభిప్రాయపడ్డారు. రైతుకు చేయూతనిస్తున్న కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలను అభినందించారు. భవిష్యత్‌లో తీవ్ర ఆహార కొరత వచ్చే అవకాశం ఉన్నదని ఐక్యరాజ్యసమితి హెచ్చరికల నేపథ్యంలో మనమంతా రైతన్నకు అండగా నిలువాల్సిన అవసరం ఉన్నదని గుర్తుచేశారు.రైతులతో కేంద్రం జరుపుతున్న చర్చలు ఫలవంతం కావాలని ఆకాంక్షించారు. రైతులెవరికీ నష్టం కలుగదని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా విజ్ఞాన విస్తరణ రంగంలో సర్వారెడ్డి వెంకురెడ్డికి జీవన సాఫల్యపురస్కారాన్ని పల్లె సృజన వ్యవస్ధాపకులు బ్రిగేడియర్ పోగుల గణేశంకు కృషిరత్న అవార్డులను బహూకరించారు. ప్రకృతి వ్యవసాయం, అంతర పంటలు, అనేక పంటల సాగు ద్వారా ఉత్తమ సాగుతో ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న పశ్చిమగోదావరి జిల్లా లక్ష్మీ పురంకు చెందిన ఉప్పలపాటి చక్రపాణి సేవలను గుర్తించిఆయనకు వెంకయ్య చేతులమీదుగా అవార్డు అందజేశారు.
కృష్ణా జిల్లా, ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన అన్నే పద్మావతి కి ఉత్తమ మహిళా రైతుగా పురస్కారాన్ని అందజేశారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ వినూత్నరీతిలో డ్రాగన్ ఫ్రూట్ను దానిలో అంతర పంటలను సాగు చేస్తూ ఆదర్శ మహిళగా గణుతికెక్కిన ఆమె సేవలను వెంకయ్య కొనియాడారు..
వీరితో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మొత్తం 39 మందికి ఈ పురస్కారాలు లభించాయి. ఈకార్యక్రమంలో రైతునేస్తం పత్రికాథినేత వెంకటేశ్వరరావుతో పాటు ఆసంస్ధ నిర్వహిస్తున్న పత్రికల సంపాదకులు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కొసరాజు చంద్రశేఖరరావు పాల్గొన్నారు.