Neem Tree Disease: తెగుళ్లతో ఎండిపోతున్న వేపచెట్లు తిరిగి చిగురిస్తాయని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. పురుగులు, తెగుళ్లు సోకి దేశవ్యాప్తంగా లక్షలాది వేపచెట్లు రెండేళ్లుగా ఎండిపోతున్నాయి. ఆకులు ఎండి ఎర్రబారి రాలిపోతున్నాయి. వీటిపై ఈ వర్సిటీ శాస్త్రవేత్తలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత అధ్యయనం చేస్తున్నారు. రసాయన మందుల పిచికారీతో పలు ప్రాంతాల్లో తెగుళ్లను నియంత్రిస్తున్నారు. ఎండిపోయిన చెట్ల మొదళ్లలో పుష్కలంగా నీరుపోస్తే చిగుళ్లు వస్తున్నట్లు జయశంకర్ వర్సిటీ పరిశోధన సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ ‘ఈనాడు’కు చెప్పారు. కొద్దిరోజుల్లోనే ఫలితం కనిపిస్తుందన్నారు. పట్టణాలు, పల్లెల్లో నీటి లభ్యత ఉన్నచోట వేప చెట్లకు పుష్కలంగా నీరిచ్చినట్లయితే అవి చనిపోకుండా నివారించవచ్చునన్నారు.
- అసిటామిప్రిడ్ రసాయన మందును మార్కెట్‌లో ‘ప్రైడ్’ అనే పేరుతో విక్రయిస్తారు. ఈ మందును లీటరు నీటిలో2 గ్రాముల చొప్పున కలిపి ఎండిన వేపచెట్లపై డ్రోన్లతో చల్లి జయశంకర్ వర్సిటీ ప్రయోగం చేసింది.
- ‘స్ప్రింట్’ పేరుతో అమ్ముతున్న రసాయన మందును5 గ్రాములను లీటరు నీటిలో కలిపి వేపచెట్టుపై, మొదలులో చల్లాలని వర్సిటీ పురుగుమందుల విభాగం ప్రధాన శాస్త్రవేత్త మహదేవప్ప చెప్పారు.
Also Read: వేపకు టీ మస్కిటో దోమ: హోమియో చికిత్సే పరిష్కారం
ఉత్తరాఖండ్ నుంచి దేశమంతా
- ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్ సమీప ప్రాంతాల అడవుల నుంచి మొదలైన టీ మస్కిటో బగ్ (తేయాకు పురుగు), పోమోప్పిస్ శిలీంధ్రం ఏడాదికాలంగా దేశమంతా విస్తరించినట్లు పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాల అధ్యయనాల్లో గుర్తించారు.
- తేయాకు తోటల్లో విరివిగా సంచరించే దోమ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. గతంలో ఈ పురుగు జీడిమామిడి తోటలను పాడు చేసింది. పూత సమయంలో కాడలపై రసం పీల్చటంతో దిగుబడి లేక రైతులు నష్టపోయారు. ఈ పురుగు వేపచెట్లపై వ్యాపించడాన్ని ఇటీవల గుర్తించారు.
- గత జులై నుంచి వాతావరణంలో మార్పులు, అధిక వర్షాల వల్ల తెలంగాణ, మహారాష్ట్రల్లో పురుగు స్వైర విహారం చేసి లక్షలాది వేపచెట్లను నాశనం చేసింది. ముందుగా ఈ పురుగు వేపచెట్టు తలభాగంలో లేలేత కొమ్మలపై రంధ్రాలు చేస్తుంది. దాని నుంచి స్రవించే ద్రవపదార్థాలపై గాలిలో ఉండే వివిధ రకాల శిలీంద్ర బీజ కణాలు పడినపుడు అవి మొలకెత్తి శిలీంద్రాన్ని పెంపొందించి చెట్టు కొమ్మలను ఎండిపోయేలా చేస్తాయి. వెనువెంటనే ఆకులు రాలిపోతాయి. క్రమంగా చెట్టు చచ్చిపోతుంది. నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంది.
రామోజీ ఫిలింసిటీలో సత్ఫలితాలు..
వేలాది చెట్లు ఉన్న రామోజీ ఫిలింసిటీలో 25 సంవత్సరాల వయసున్న అనేక వేప వృక్షాల్లో 90 శాతం తెగులుబారిన పడ్డాయి. ఇటీవల వేపచెట్లకు నీరిచ్చినప్పుడు తిరిగి చిగురించడాన్ని సిబ్బంది గమనించారు . వెంటనే 3 రోజుల్లో 2,100 చెట్లకు పాదులు చేసి పుష్కలంగా నీటిని అందించారు. దోమ కాటుకు గురై కొమ్మలు ఎండగా నీరందించిన 5వ రోజుకే 50 శాతం చెట్లకు మళ్లీ చిగుళ్లు తొడిగాయి.
రెండోసారి కూడా చెట్లకు నీరు అందిస్తున్నారు. వేపచెట్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆకు రాలే దశలో ఉన్న వేపచెట్లకు నీటిని అందించటం వల్ల తెగుళ్లను అధిగమించి తొందరగా చిగురిస్తున్నాయని రామోజీ ఫిలింసిటీ ఉద్యాన విభాగం నిపుణులు గుర్తించారు. ట్యాంకర్లు, ఫైర్ ఇంజిన్ల ద్వారా కొమ్మలపైనా నీళ్లు చిమ్ముతూ ప్రయోగం చేస్తున్నారు.
Also Read: చేదు వేపకు.. చెడ్డ రోగం.!